రూ.731.30 కోట్లతో 44 లక్షల మంది విద్యార్థులకు రెండో విడత జగనన్న విద్యా కానుక..!!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు 2021–22 విద్యా సంవత్సరానికి రూ.731.30 కోట్లతో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ పథకం అమలుకు ఈసారి దాదాపు రూ.100 కోట్ల మేర నిధులు పెంచింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఆమేరకు నిధులు ఎక్కువగా కేటాయించింది. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్లలో 3 జతల యూనిఫారం, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్కు బుక్కులు, నోట్ బుక్కులతో పాటు ఈసారి కొత్తగా డిక్షనరీని ఇవ్వనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, వివిధ సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గుర్తింపు ఉన్న మదర్సాలలోని 1–10 వరకు చదువుతున్న దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. ఈసారి డిక్షనరీని కూడా చేర్చడంతో ఆమేరకు వాటిని ప్రొక్యూర్ (సేకరించాలని) చేయాలని పాఠశాల విద్యా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 2020–21 విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం రూ.648.10 కోట్లకు పైగా వెచ్చించగా, ఈసారి రూ.731.30 కోట్లను మంజూరు చేసింది. యూనిఫారం కుట్టు కూలీ కింద 1–8 విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.120, 9–10 విద్యార్థుల కోసం ఒక్కొక్కరికి రూ.240 చొప్పున నిధులు అందించనున్నారు.
జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువులు, విద్యార్థుల సంఖ్య
జగనన్న విద్యాకానుక కింద అందించే వస్తువులు, విద్యార్థుల సంఖ్య
కేటగిరీ | విద్యార్థులు | నిధులు (రూ.కోట్లలో) |
యూనిఫారం (1నుంచి 8 తరగతులు) | 3438674 | 244.16 |
యూనిఫారం (9–10 తరగతులు) | 861564 | 97.76 |
షూ, 2 జతల సాక్సులు | 4300238 | 86.00 |
బెల్టు | 3188090 | 11.16 |
స్కూలు బ్యాగ్ | 4300238 | 75.25 |
పాఠ్యపుస్తకాలు | 4300238 | 106.33 |
వర్కుబుక్కులు | 2138498 | 33.96 |
నోట్‌బుక్కులు | 2161740 | 76.68 |
Published date : 12 Mar 2021 03:40PM