పిల్లల్లో.. బుద్ధిమాంద్యాన్ని ముందే గుర్తించొచ్చు!
Sakshi Education
మెల్‌బోర్న్: కొంత మంది చిన్నారులు వేటికీ అంత త్వరగా స్పందించరు. అంతేకాదు, వారి ప్రవర్తన, మాట తీరు, పెరుగుదల సైతం సరిగా ఉండదు.
ఈ లక్షణాలనే ఆటిజం(బుద్ధిమాంద్యం)గా వ్యవహరిస్తారు. అయితే, చిన్నారుల్లో ఈ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. దీంతో వ్యాధిని గుర్తించేసరికి ఆలస్యమై చివరికి ఆ చిన్నారులు కుటుంబం, సమాజ ఆదరణకు దూరమవుతుంటారు. ఈ పరిస్థితిని నివారించేలా చిన్నారుల్లో ఆటిజం లక్షణాలను ముందే గుర్తించేందుకు ఓ పరికరాన్ని తాజాగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కంటిని స్కానింగ్ చేయడం ద్వారా ఆటిజంను మరింత ముందుగానే ఈ-స్కాన్ పరికరాన్ని ఆస్ట్రేలియాలోని ఫ్లైండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు. ‘జర్నల్ ఆఫ్ ఆటిజం అండ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్స్’లో ప్రచురితమైన వివరాల ప్రకారం.... చేతితో పట్టుకొనేందుకు అనువుగా ఉండే ఈ-స్కాన్ పరికరం పిల్లల కంటిలోని రెటీనాలో ఉండే భిన్న సూక్ష్మ విద్యుత్ సంకేతాల నమూనాను గుర్తిస్తుంది. దీనికోసం పరిశోధకులు 5 నుంచి 21 ఏళ్ల వయసు కలిగిన 180 మందిని పరిశీలించారు. వీరిలో కొందరు ఆటిజం బారినపడినవారు ఉన్నారు. వీరి కంటిని ఈ స్కాన్‌తో పరీక్షించారు. బుద్ధిమాంద్యానికి గురైన వారిలో కంటిలోని రెటీనాలో కొన్ని వైరుద్యాలున్నట్లు గుర్తించారు. దీంతో ఈ పరికరం ఉపయోగించి ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ (ఏఎస్‌డీ), అటెన్షన్ డెఫిసిట్ స్పెక్ట్రం డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి ఇతర వైకల్యాలను ముందుగానే గుర్తించొచ్చని తేల్చారు. ‘రెటీనా అనేది నాడీ కణజాలంతో తయారవుతుంది. ఆప్టిక్ నెర్వ్‌ద్వారా ఇది మెదడుతో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల ఇది ఈ-స్కాన్‌తో పరీక్షించదగిన ప్రదేశం’అని ఫ్లైండర్స్ యూనివర్సిటీ కో-ఆథర్ పాల్ కానస్టబుల్ చెప్పారు.
Published date : 24 Feb 2020 03:45PM