మార్కులతోపాటు... రిమార్కులు రాకుండా చూసుకోవాలి!
Sakshi Education
విద్య అంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదు, ‘విద్య’ లక్ష్యం డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాదు. మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవడమే కాదు. గోల్డ్ మెడల్ సాధించడమే కాదు. ఇవన్నీ కావాల్సిందే.
అయితే మార్కులతోపాటు రిమార్కులు కూడా రాకుండా చూసుకోవాలి. చదువుతోపాటు సంస్కారాన్ని కూడా పెంపొందించుకోవాలి. వినయం లేని విద్యార్థి రాణించడు. శోభించడు. సంస్కారం లేని చదువు నిష్ప్రయోజనం. వివేకం లేని విజ్ఞానం వినాశనానికి దోహదం చేస్తుంది. మానవత్వాన్ని కోల్పోయిన విజ్ఞానం మారణహోమానికి దారితీస్తుంది. ఆలోచనారహిత మైన మేధాశక్తి సర్వనాశనానికి దారితీస్తుంది. అయితే ఈనాటి విద్యలు తెలివితేటలను మాత్రమే పెంచుతున్నాయిగానీ ఏ మాత్రం గుణాన్ని పెంచడం లేదు. వినయ వివేకాలు వివేకాదులను అభివృద్ధి పరచడం లేదు. సంస్కారవంతులను గౌరవించడం లేదు. గుణంలేని జీవితం దీపం లేని గుడి వంటిది. గుణాన్ని మించిన బలం వేరొకటి లేదు. గుణం ప్రధానం, ధనం ప్రధానం కాదు. అయితే ఈనాడు అంతా ధనానికి దాసోహం అంటున్నారు ధర్మానికి దూరమవుతున్నారు. ధనం శాశ్వతం కాదు . అది ఎప్పుడు వస్తుందో, ఎవరి వద్దకు వస్తుందో, ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. నీతి,ధర్మాలు మాత్రం శాశ్వతం. ధనం వస్తుంది, పోతుంది. నీతి వస్తుంది ,పెరుగుతుంది. మనిషిలో నీతి కనుక ప్రవేశిస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోతుంది. కనుక నీతికి మించిన వేరొకటి లేదు. గుణం అంత కంటే ఎక్కువ ముఖ్యం. కనుక ప్రతి విద్యార్థి సద్గుణ సంపన్నుడు కావాలి. అందుకు చిన్ననాటినుంచే అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు బాటలు వేయాలి.
Published date : 20 Feb 2020 03:19PM