Skip to main content

మార్చి రెండో వారంలోవైస్‌చాన్‌‌సలర్ల నియామకాలు!

సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వైస్‌చాన్‌‌సలర్ల నియామకాలు త్వరలోనే జరగనున్నాయి.
వీసీల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిబ్రవరి 19 (బుధవారం)న ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులను ఆదేశించడంతో వీసీల నియామకంపై కదలిక మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. అయితే 10 యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలు ఉండగా, జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు ఇన్‌చార్జి వీసీని కూడా నియమించలేదు. గతేడాది జూన్ 23 నాటికి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, బాసర ఆర్‌జీయూకేటీకి వీసీలు ఉన్నందున, అప్పట్లో జారీ చేసిన వీసీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో వాటిని పేర్కొనలేదు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహా త్మాగాంధీ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా పోస్టులకు 273 మంది ప్రొఫెసర్లు, 984 దరఖాస్తు ఫారాలు అందజేశారు. ఒక్కొక్కరు రెండు మూడింటికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు యూనివర్సిటీల నామినీలను, యూజీసీ నామినీలతో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిందే తప్ప కమిటీల సమావేశాలు జరగలేదు. సెర్చ్ కమిటీల్లో యూనివర్సిటీ నామినీగా నియమించిన వారి నియామకం చెల్లదని, యూనివర్సిటీల పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు (ఈసీ) లేకుండా, ఆ ఈసీలు సిఫారసు చేయకుండా పెట్టిన నామినీల నియామకం కుదరదన్న వాదనలు వచ్చాయి. దాంతో సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి.. ఈసీల నియామకం కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి గత నెలలోనే పంపింది. ప్రస్తుతం అది ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. బుధవారం సీఎం ఆదేశాలు జారీ చేసినందున ఈ వారం రోజుల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఆయా యూనివర్సిటీల నుంచి సెర్చ్ కమిటీల్లో ఉండే యూనివర్సిటీల నామినీల పేర్లను ప్రభుత్వం తెప్పించుకోనుంది. ఆ తర్వాత సెర్చ్ కమిటీలు సమావేశమై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్లను ప్రతిపాదించనున్నాయి. మొత్తానికి వచ్చే వారంలో సెర్చ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీలు ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం యూనివర్సిటీల చాన్‌‌సలర్ అయిన గవర్నర్ ఆమోదానికి పంపనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే గవర్నర్ ఆమోదంతో మార్చి రెండో వారంలో కొత్త వీసీలు రానున్నారు.

దరఖాస్తు చేసుకోకున్నా..
యూనివర్సిటీల వీసీలుగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు దరఖాస్తు చేసుకోని వారిని కూడా సెర్చ్ కమిటీ ఎంపిక చేసే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి ప్రొఫెసర్‌గా పదేళ్ల అర్హత లేని వారు కూడా 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించారు. ప్రస్తుతం అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకే వారిని సెర్చ్ కమిటీలు పరిగణనలోకి తీసుకుంటాయా లేదా అన్న విషయంలో చర్చ జరుగుతోంది. అయితే సెర్చ్ కమిటీలు వారి పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఇవీ యూనివర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులు..

యూనివర్సిటీ

దరఖాస్తుల సంఖ్య

ఉస్మానియా

114

కాకతీయ

110

తెలంగాణ

114

శాతవాహన

125

పాలమూరు

122

మహాత్మాగాంధీ

124

జేఎన్‌టీయూ

56

తెలుగు యూనివర్సిటీ

23

ఓపెన్ యూనివర్సిటీ

142

ఏదైనా ఓకే

54

మొత్తం

984

Published date : 20 Feb 2020 02:02PM

Photo Stories