Skip to main content

ఇంటి వద్దే పాఠాలు… లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ తరగతులు...!

సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులు జోరందుకున్నాయి. లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు మూతపడగా, వివిధ సెట్స్, పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ఎంతో దోహదపడుతున్నాయి. దీంతో రోజుకు మూడు నాలుగు గంటలు ఆన్‌లైన్‌ తరగతుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. నగరంలోని వివిధ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు శిక్షణ కేంద్రాలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా సాధారణ తరగతి వాతావరణాన్ని కలిపిస్తూ బోధన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఎంసెట్, నీట్, జేఈఈ, వంటి ప్రవేశ పరీక్షలతోపాటు గ్రూప్స్, బ్యాకింగ్, సివిల్స్‌ అర్హత పరీక్షలకుఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నాయి.

దేశంలో ఐఐటీలు, ఏఐసీటీఈ, ఇగ్నో తదితర ఉన్నత శిక్షణ సంస్థల ద్వారా రూపొందించిన ‘ స్వయం’ ఆన్‌లైన్‌ పోర్టల్‌ విద్యార్థులకు వరంగా మారింది. ‘ స్వయం’ ద్వారా వివిధ విద్యాసంస్ధలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరి తమ ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. స్వయంతోపాటు ఇతర ఆన్‌లైన్‌ కోర్సులను అందించే సంస్థలుకూడా ఈ లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలల కాలం ఉచిత శిక్షణకు అవకాశం కల్పించాయి. ప్రత్యేకంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు అనేక రకాలైన ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించి వివిధ సంస్థలు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ఎన్‌పీటెల్, ముక్, ఎడెక్స్, యుదాసిటీ, ఉడ్మి, ఖాన్‌ఆకాడమి,టెడ్, అలిసన్, ఫ్యూచర్‌లెర్న్, ఓపన్‌లెర్న్, ఒపన్‌ కల్చర్‌ తదితరాలు ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణలను అందిస్తున్నాయి.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు..
ఇంజినీరింగ్‌ విద్యార్ధులకు సంబంధించిన నాలుగు సంవత్సరాల పాఠ్యాంశాలను ఏడ్యూలిబ్‌ ఆన్‌లైన్‌ సంస్థ ఈ మూడు నెలల పాటు ఉచితంగా అందుబాటులో ఉంచింది. విద్యా సంవత్సరం నష్ట పోకుండా చదివిన అంశాలను మర్చిపోకుండా ఉండడానికి ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను దోహపడుతున్నాయి. వారంవారం ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సైతం తమ ప్రతిభ మెరుగుపర్చుకునే పనిలో పడ్డాయి. మరోవైపు ఇంజినీరింగ్‌ విద్యా సంస్ధలు విద్యార్ధుల విద్యా సంవత్సరం వధా కాకుండా ‘జూమ్‌’ అప్‌గ్రేడ్, క్లిక్‌మీటింగ్, జోబోమీటింగ్,సిస్‌కోవెబెక్, డీయోమొబైల్, గోటూ మీటింగ్‌ తదితర ఆన్‌లైన్‌ మీటింగ్‌ యాప్‌ లద్వారా సాధారణ తరగతి వాతావారణాన్ని కలిపిస్తూ మొబైల్‌ , ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి టైమ్‌టెబుల్, షెడ్యూలు ముందుగానే విద్యార్థులకు అందుతుంది. నిర్ధేశించిన సమయంలో లాగిన్‌ కావల్సి ఉంటుంది.

పాఠ్యాంశాలపై చర్చించుకుంటాం
ఆన్‌లైన్‌ తరగతులు సాధారణ తరగతులను తలపిస్తున్నాయి. అధ్యాపకుల బోధన అనంతరం విద్యార్ధులంతా ఆన్‌లైన్‌ మీటింగ్‌లో ఉండి వివిధ అంశాలపై చర్చించుకోవడం, సందేహాలు నివత్తి, చర్చకు అవకాశం కలుగుతోంది.
– శ్రీనివాస్, సివిల్‌ ఇంజినీరింగ్, గురునానక్‌ కళాశాల
Published date : 09 Apr 2020 06:10PM

Photo Stories