‘ఈచ్ వన్ టీచ్ వన్’లో పాల్గొంటాం: విశ్రాంత ఉపాధ్యాయ ఉద్యోగులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ‘ఈచ్ వన్ టీచ్ వన్’అని పిలుపునిచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో నిర్వహించే అవగాహన సదస్సుల్లో విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ వెల్లడించారు.
జనవరి 1ఆయన తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నరసయ్య, ప్రధాన కార్యదర్శి ఇనగంటి నవనీత రావు, ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఉద్దీన్, కోశాధికారి ఇ.శ్రవణ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు హెచ్.రాములు, కార్యదర్శి జి.లక్ష్మీ నారాయణ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన తర్వాత వివిధ అంశాలపై చర్చించారు. గ్రామాలు, మున్సిపల్ వార్డులు, పట్టణ ప్రాంతాలు, బస్తీల్లో నివసిస్తున్న తాము ప్రభుత్వానికి వలంటీర్లుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పారిశుద్ధ్యం వంటి రంగాలతో పాటు సామాజిక రుగ్మతలపై సైనికులుగా పనిచేస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తీసుకుంటున్న జీతం కంటే తాము అధిక మొత్తంలో పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతగా ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి పూర్తి అండదండలు అందిస్తామని తెలిపారు.
Published date : 02 Jan 2020 03:23PM