ఏపీ విద్యాసంస్థలకు సెలవులు.. పరీక్షలు రాసే వారికి మాత్రమే హాస్టళ్లలో అనుమతి!
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ నివారణకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, వసతి గృహాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు సహా కోచింగ్.. శిక్షణ కేంద్రాలన్నీ ఈ నెల 19వ తేదీ నుండి 31వ తేదీ వరకూ మూసి వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.
కోవిడ్-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలపై బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా.పీవీ రమేష్‌లతో సమీక్షించిన తర్వాత ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 10 మందికి మించి ప్రజలు ఒక చోట గుమిగూడకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ (మనిషికి మనిషికి మధ్య ఒక మీటర్ దూరం) పాటించేలా ప్రజలందరిలో అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో కింది విధంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
సోషల్ డిస్టెన్స్ ప్రధానం
యథావిధిగా బోర్డు పరీక్షలు
సోషల్ డిస్టెన్స్ ప్రధానం
- రైతు బజార్లు మార్కెట్లు, సంతలు, షాపులు, షాపింగ్ మాల్స్, ఇతర ముఖ్యమైన వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి.
- రానున్న 15 రోజులు అత్యంత కీలకం. అందువల్ల ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతంలో తగిన శానిటైజేషన్ జాగ్రత్తలు తీసుకోవాలి.
- పైవేట్ సంస్థలు వారి కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందిని ఇంటి నుంచే పని చేసేలా చూడాలి.
- హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో నిరంతరం తగిన శానిటైజేషన్ ప్రొటోకాల్ జాగ్రత్తలు పాటించాలి.
- సభలు, సమావేశాలు నిర్వహించాల్సి వస్తే వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించాలి.
- విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు కుటుంబ సభ్యులు సహా ఎవరితో కలవకుండా ఇంట్లో విడిగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి.
యథావిధిగా బోర్డు పరీక్షలు
- ఇప్పటికే షెడ్యూళ్లు ప్రకటించి ఉన్న వివిధ బోర్డుల పరీక్షలు యథావిధిగా జరుగుతాయి.
- పరీక్షలు రాసే విద్యార్థుల్లో ఎవరికై నా జ్వర లక్షణాలుంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు రాయించాలి.
- ఈ పరీక్షలకు హాజరయ్యే వారిని మినహాయించి ఇతర విద్యార్థులకు హాస్టళ్లలో సెలవులు వర్తింపచేయాలి.
- విద్యార్థులకు ఏవైనా ముఖ్యమైన విషయాలు చెప్పాల్సి వస్తే సెలవుల నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించుకోవాలి.
Published date : 19 Mar 2020 02:50PM