Skip to main content

డీఆర్‌డీఏ ఉద్యోగులకు జీతభత్యాలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి..

సాక్షి, అమరావతి: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)ల నిర్వహణకు ఇచ్చే నిధులకు కేంద్రం స్వస్తి పలికింది.
గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన పథకాల అమలు పర్యవేక్షణకు ప్రతి జిల్లాలో డీఆర్‌డీఏలు పనిచేస్తున్నాయి. వీటి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాల ఖర్చులో కేంద్రం 75 శాతం వాటా, రాష్ట్రం 25 శాతం భరిస్తాయి. డీఆర్‌డీఏ అడ్మినిస్ట్రేషన్‌ స్కీంను 1999 నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తోంది. ఈ స్కీంను వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2021 ఏప్రిల్‌ ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ రాష్ట్రాలకు సమాచారమిచ్చారు. వీటిని కొనసాగించే పక్షంలో ఇకపై డీఆర్‌డీఏ ఉద్యోగులకు జీతభత్యాలు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని 13 జిల్లాల డీఆర్‌డీఏలలో ప్రస్తుతం 280 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో 180 మందికి పైగా రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు కాగా, వంద మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు వివరించాయి.

రాష్ట్రంలో సెర్ప్‌ పరిధిలో డీఆర్‌డీఏలు
  • ∙ దేశంలో పలు రాష్ట్రాల్లో డీఆర్‌డీఏలు జిల్లా పరిషత్‌లలో అనుసంధానమై ఉండగా.. మన రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డీఆర్‌డీఏ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. డీఆర్‌డీఏలకు ప్రతి జిల్లాలో పర్యవేక్షణాధికారిగా పీడీ పనిచేస్తున్నారు.
  • రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవహారాలతో సహా పింఛన్ల పంపిణీ వంటి పలు ప్రభుత్వ పథకాలు సెర్ప్‌ ఆధ్వర్యంలో డీఆర్‌డీఏల ద్వారా అమలు చేస్తున్నారు.
  • డీఆర్‌డీఏ అడ్మినిస్ట్రేషన్‌ స్కీం పేరిట కేంద్రం నుంచి ప్రతి ఏటా రాష్ట్రానికి సుమారు రూ. పది కోట్లు వస్తున్నాయి. అయితే ఆ నిధులు డీఆర్‌డీఏ ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోకపోవడంతో పలువురు ఉద్యోగులకు గత కొన్నేళ్లుగా సెర్ప్‌ నిధుల నుంచి జీతాలు చెల్లిస్తున్నారు.
Published date : 25 Feb 2021 04:35PM

Photo Stories