డిగ్రీ విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకోసం ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్య పుస్తకాలను రూపొందించనున్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు ఉన్నత విద్యా మండలి గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఒకే పాఠం పాఠ్యపుస్తకంలో ఒకవైపు ఆంగ్ల మాధ్యమంలో, మరోవైపు తెలుగు మాధ్యమంలో ఉండేలా ముద్రించాలని తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సులు అభ్యసించే విద్యార్థులకోసం ‘ప్రత్యేక టూల్‌కిట్’ను అభివృద్ధి చేయనున్నారు. డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఏ సెమిస్టర్లో ఏ నైపుణ్యాలను నేర్చుకోవాలి? అందుకు అనుసరించాల్సిన మార్గాలు తదితర అంశాలు ఈ టూల్‌కిట్లో ఉంటాయి. ఉన్నత విద్యామండలిలో లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన విలేజ్ డిజిటల్ లైబ్రరీలకు దీన్ని అనుసంధానించనున్నారు. ఉన్నత విద్యామండలిలో ఏర్పాటు చేసిన క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌కు, ఉన్నత విద్యామండలి ప్లానింగ్ బోర్డుకు బడ్జెట్ కేటాయింపులకు గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సీఎస్‌ఐఆర్ ల్యాబొరేటరీలతో యూనివర్సిటీలను అనుసంధానించేందుకు కుదుర్చుకున్న ఒప్పందానికి అనుమతి తెలిపింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల విద్యార్థులతోపాటు రీసెర్చి స్కాలర్లు, అధ్యాపకులు ఈ ల్యాబొరేటరీలను వినియోగించుకుంటారు. పరిశోధనలకు అవసరమైన మరింత పరిజ్ఞానాన్ని అందించేందుకు ‘కోర్ టీమ్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Published date : 26 Mar 2021 03:25PM