Skip to main content

ఐసెట్-2020 కౌన్సెలింగ్ ముగిశాక డిగ్రీ బ్యాక్‌లాగ్ ఫలితాలు విడుదల..

సాక్షి, హైదరాబాద్: బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేయకుండానే, విద్యార్థులు నష్టపోతారనే కనీస ఆలోచన లేకుండానే... ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు ఐసెట్-20 కౌన్సెలింగ్‌ను కానిచ్చేశారు. ఫలితంగా పలువురు విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఆ సమయంలో జరగాల్సిన అన్ని వార్షిక, సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జూలై ఆఖరు నుంచి ఈ పరీక్షలు మొదలయ్యాయి. తొలుత ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మిగతా విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో ఫైనల్ సెమిస్టర్‌కు హాజరైన వారిలో కొందరికి బ్యాక్‌లాగ్‌‌స ఉన్నాయి. ఈ బ్యాక్‌లాగ్‌‌స పరీక్షలు ప్రాధాన్యతా క్రమంలో తర్వాత జరిగాయి. వీటి ఫలితాల విడుదలలో జరిగిన జాప్యం వారిని ఇరకాటంలో పడేసింది. ఫలితంగా ఐసెట్-20 కౌన్సెలింగ్‌కు దూరం కావాల్సి వచ్చింది.

డిసెంబర్ 26తో ముగిసిన సీట్ల కేటాయింపు
రాష్ట్రంలో 168 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 23,358 సీట్లున్నాయి. ఈ క్రమంలో ఐసెట్-20కి 58,392 మంది దరఖాస్తు చేసుకొని... 45,975 మంది పరీక్ష రాశారు. వీరిలో 41,506 మంది అర్హత సాధించారు. ఐసెట్-20 అడ్మిషన్ మొదటి విడత కౌన్సెలింగ్ గతేడాది డిసెంబర్ 15తో ముగిసింది. అనంతరం చివరి విడత కౌన్సెలింగ్‌కు అవకాశమిచ్చిన ప్రభుత్వం... డిసెంబర్ 26న సీట్ల కేటాయింపు పూర్తి చేసింది. అయితే తుది విడత కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు కూడా డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలు విడుదల కాలేదు. దీంతో పాస్ సర్టిఫికెట్ లేని కారణంగా విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేకపోయారు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలు డిసెంబర్ చివరి వారంలో విడుదల కాగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ ఫలితాలు మూడురోజుల క్రితం విడుదలయ్యాయి.

భారీగా మిగిలిన సీట్లు
ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైనప్పుడు బ్యాక్‌లాగ్ ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రవేశాలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులను కలిపి వినతిపత్రాలు సమర్పించాయి. కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా హడావుడిగా కౌన్సెలింగ్‌ను ముగించేశారు. డిసెంబర్ 26తో ఐసెట్ సీట్ అలాట్‌మెంట్ పూర్తయినప్పటికీ.. ఇంకా 7,164 సీట్లు మిగిలిపోయాయి కాబట్టి మూడో విడత కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన పి.సంజయ్‌కుమార్‌కు టీఎస్
ఐసెట్-20లో 5 వేల ర్యాంకు వచ్చింది. సీట్ల సంఖ్య, రిజర్వేషన్ పరంగా ఆ విద్యార్థికి కోరుకున్న చోట సీటు వచ్చే అవకాశం ఉండేది. కానీ కోవిడ్-19 కారణంగా గతేడాది ఏప్రిల్‌లో జరగాల్సిన బ్యాక్‌లాగ్ పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి ఫలితాలను ముందుగా ప్రకటించిన యూనివర్సిటీలు... బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలు మాత్రం జాప్యం చేయడంతో వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయాడు. సంజయ్ ఒక్కడే కాదు. బ్యాక్‌లాగ్ పరీక్షలు రాసిన 13 వేల మందిలో పలువురు అభ్యర్థులు ఐసెట్-20లో మంచి ర్యాంకులు సాధించినప్పటికీ... బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలు రాకపోవడంతో మొదటి, చివరి విడత కౌన్సెలింగ్‌కు దూరమయ్యారు.
Published date : 05 Jan 2021 04:11PM

Photo Stories