Skip to main content

అధిక ఫీజులు వసూలు చేసిన ‘పది’ పాఠశాలలపై విద్యాశాఖ కఠిన చర్యలు.. గుర్తింపు రద్దు!

సాక్షి, హైదరాబాద్: ట్యూషన్ ఫీజు మాత్రమే విద్యార్థుల నుంచి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46కు విరుద్ధంగా 10 పాఠశాలలు ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేశాయని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ ఎ.దేవసేన హైకోర్టుకు నివేదించారు.
జీవోకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలకు నోటీసులు జారీ చేసి వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే గుర్తింపు రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ ఎ.దేవసేన అదనపు కౌంటర్ దాఖలు చేశారు. మౌంట్ లిటెరా జీ స్కూల్ (రంగారెడ్డి జిల్లా), మెరీడియన్ స్కూల్ (బంజారాహిల్స్), ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ (హిమాయత్‌నగర్), నీరజ్ స్కూల్ (అమీర్‌పేట), నారాయణ హైస్కూల్ (డీడీ కాలనీ), జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి పబ్లిక్ స్కూల్, లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్, కల్ప స్కూల్, సెయింట్ ఆండ్రూస్ స్కూల్స్ (సికింద్రాబాద్, మేడ్చల్)లు నిబంధనలు ఉల్లంఘించినట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ జాయింట్ డెరైక్టర్‌తో విచారణ చేయించామని తెలిపారు. జీవో 46కు విరుద్ధంగా ఈ పాఠశాలలు ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరతామని పేర్కొన్నారు. జీవో ఉల్లంఘించిన సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలకు రూ.5 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు, గుర్తింపును ఐదేళ్లపాటు రద్దు చేసే అధికారం ఉందని తెలిపారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ వ్యవహారంపై వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీబీఎస్‌ఈ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
Published date : 06 Nov 2020 04:20PM

Photo Stories