Skip to main content

2,151 మంది విద్యా వాలంటీర్లు కావాలి.. అనుమతించండి

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైన 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు అవసరమని విద్యాశాఖ లెక్కలు వేసింది.
అందులో ఇప్పటికే 2,816 మంది టీచర్లను ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉన్నత పాఠశాలలకు పంపించింది. ఇంకా 2,151 మంది టీచర్లు అవసరమని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆయా స్థానాల్లో విద్యా వాలంటీర్లు అవసరమని, అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు వారిలో ఒక్కొక్కరికి నెలకు రూ.12 వేల చొప్పున ఈ మూడు నెలల కాలానికి 2,151 మంది విద్యా వాలంటీర్లకు రూ.7,74,36,000 అవసరమని పేర్కొంది. ఆ మొత్తాన్ని మంజూరు చేస్తూ విద్యా వాలంటీర్ల నియామకానికి అనుమతించాలని ప్రతిపాదించింది.

అత్యధికంగా నిజామాబాద్‌లో అవసరం
రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారం చూస్తే 11 జిలాల్లో ఒక్కో జిల్లాలో 100 మందికి పైగా విద్యా వాలంటీర్లు అవసరమని విద్యాశాఖ లెక్కలు వేసింది. అందులోనూ అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 190 మంది విద్యా వాలంటీర్లు అవసరమని తెలిపింది. ఇక జనగామ, ములుగు జిల్లాల్లో అదనపు టీచర్లు అవసరం లేదని పేర్కొంది. జనగామలో 103 స్కూళ్లలో 9, 10 తరగతులకు బోధించేందుకు 101 మంది టీచర్లు అవసరం కాగా, ఆ మేరకు టీచర్లు ఉన్నట్లు తెలిపింది. ములుగు జిల్లాలోని 28 మంది టీచర్లు అవసరం కాగా ఈ మేరకు టీచర్లను నియమించినట్లు వివరించింది. రంగారెడ్డిలోనూ 192 మంది అదనపు టీచర్లు అవసరం కాగా వారిని డిప్యూటేషన్‌పై నియమించారు.
Published date : 16 Feb 2021 02:27PM

Photo Stories