Skip to main content

వృత్తి నైపుణ్యాలతోనే ఉజ్వల భవిత

వృత్తి నైపుణ్యాలు (Professional Skills)... ప్రస్తుతం ఈ అంశంపైనే విద్య, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నైపుణ్యాల కొరత తీవ్రంగా వేధిస్తోందంటూ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో యువత కేవలం విషయ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ఎంపిక చేసుకున్న రంగంలో క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఖాయమంటున్న ఐసీఐసీఐ ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చిన్మయ్ సేన్‌గుప్తాతో గెస్ట్ కాలమ్...

ప్రస్తుతం యువత ముందు ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వారి లక్ష్యాలు, ఆశయాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే కన్న కలలు కొందరికే నిజమవుతున్నాయి. ఉన్నత అవకాశాలు కొందరికే అందుతున్నాయి. దీనికి కారణం క్షేత్ర స్థాయిలో వృత్తి నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నవారే త్వరగా తమ లక్ష్యాలను చేరుకోగలుగుతున్నారు.

అన్ని రంగాల్లోనూ...
నేటి ప్రపంచంలో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వరకు.. పదో తరగతి అర్హతతో లభించే ఉద్యోగాల నుంచి పీహెచ్‌డీ స్థాయి అవకాశాల వరకు వృత్తి నైపుణ్యాలు అత్యంత ఆవశ్యకంగా మారాయి. ఉదాహరణకు సంస్థల్లో అకౌంటింగ్ విభాగంలో ఏళ్లనాటి పద్దులు రాసే విధానం పోయింది. సాఫ్ట్‌వేర్ ఆధారిత ఈఆర్‌పీ సొల్యూషన్స్ ద్వారా కంపెనీలు తమ పని సులువు చేసుకోవాలని భావిస్తున్నాయి. పీహెచ్‌డీ, ఆర్ అండ్ డీ స్థాయిలో ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ వరకు సాఫ్ట్‌వేర్ ఆధారిత డిజిటైజేషన్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పరిశోధకులు తమ పనిని తేలిగ్గా చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆధునిక వృత్తి నైపుణ్యాలు సొంతం చేసుకుంటేనే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అయినా, ఆవిష్కరణల విభాగంలోనైనా మంచి కెరీర్ లభిస్తుంది. అందుకే ఏ రంగమైనా, ఏ స్థాయి అయినా యువత కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి నైపుణ్యాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అకడమిక్ స్థాయిలో వీటిని బోధించకపోతే, ప్రత్యేకంగానైనా శిక్షణ తీసుకోవాలి.

కమ్యూనికేషన్ స్కిల్స్ కీలకం:
క్షేత్ర స్థాయిలో ఒక ఉత్పత్తి గురించి వినియోగదారుడికి సరిగా తెలియజేసే నైపుణ్యం లేకపోతే ఆ ప్రభావం ఉత్పత్తి విక్రయాలపై పడుతుంది. అదే విధంగా కంపెనీల విధానాలు, భవిష్యత్తు ప్రణాళికలను బోర్డ్ మీటింగ్స్‌లో సరిగా చెప్పలేకపోతే అది కంపెనీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఎదుటి వారిని మెప్పించే రీతిలో చెప్పగలిగే నైపుణ్యం అవసరం. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం తప్పనిసరి. బృందంతో కలిసి సమర్థవంతంగా పనిచేయగలగడం (బృంద స్ఫూర్తి) కూడా కీలకమైనది.

పరిశ్రమ ధోరణి ప్రకారం:
విద్యార్థులు తాము చేరిన కోర్సుకు సంబంధించి అకడమిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవడంతో పాటు ఆ కోర్సుకు సంబంధించిన రంగంలో పరిశ్రమ పరంగా వచ్చిన కొత్త పరిణామాలను తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన పరిజ్ఞానం సంపాదించుకోవాలి. పరిశ్రమ స్థితిగతులను అనుసరిస్తూ వాటిని అకడమిక్స్‌తో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే కోర్సు పూర్తయ్యే నాటికి సర్టిఫికెట్‌తోపాటు జాబ్ రెడీ స్కిల్స్ కూడా సొంతమవుతాయి.

సాఫ్ట్‌వేర్ అనుబంధ కోర్సులు:
ప్రస్తుతం కంపెనీల్లో పనితీరు పరంగా అవలంబిస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న విభాగంలో సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు అందించే కోర్సులు అభ్యసించాలి. ఉదాహరణకు అకౌంటింగ్‌లో షార్ట్‌టర్మ్ ఈఆర్‌పీ సర్టిఫికేషన్లు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫైళ్ల నిర్వహణకు సంబంధించి వస్తున్న స్వల్పకాలిక సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకోవాలి. ఇలా చేస్తే ఆయా రంగాల జాబ్ మార్కెట్లో ముందుంటారు.

మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు:
మేనేజ్‌మెంట్ పీజీ ఔత్సాహికులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రత్యేక నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. కేస్ స్టడీస్‌ను సమగ్రంగా విశ్లేషించగల స్కిల్స్ అవసరం. వాస్తవ కేస్‌స్టడీస్‌ను విశ్లేషించి, ఒక సమస్యను ఎలా పరిష్కరించగలరు? దానికి అనుసరించాల్సిన విధానాలు ఏమిటి? తాము ఆ స్థానంలో ఉంటే సమస్యను ఎలా పరిష్కరించగలరు? అనేదాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడే ఐఐఎంలో చదివినా, సాధారణ ఇన్‌స్టిట్యూట్‌లో చదివినా కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరుతుంది. ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుంది.
Published date : 28 Aug 2015 01:50PM

Photo Stories