Skip to main content

ఉన్నత విద్యతో ఉజ్వల కెరీర్!

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీతో సరిపెట్టుకోకుండా పీజీ, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్య లక్ష్యాలను నిర్దేశించుకుంటే కెరీర్ ఉన్నతంగా ఉంటుంది.. అని సూచిస్తున్నారు ఎస్‌ఆర్‌ఎం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డెరైక్టర్ ప్రొఫెసర్ డి.నారాయణరావు. డీఎస్‌టీ, సీఎస్‌ఐఆర్, ఇస్రో వంటి ప్రముఖ సంస్థలకు సలహా కమిటీ సభ్యులుగా కొనసాగి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులను అందుకున్న నారాయణరావుతో గెస్ట్ కాలమ్..
అకడమిక్ నేపథ్యం ఏదైనప్పటికీ విద్యార్థులు ఉన్నతంగా, విభిన్నంగా ఆలోచించాలి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బ్యాచిలర్ డిగ్రీతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కానీ, దాంతోనే కెరీర్ కొనసాగించడం దీర్ఘకాలంలో కష్టమవుతుంది. అందువల్ల ఇంజనీరింగ్, ఇతర విద్యార్థులు ఉన్నత విద్య దిశగా అడుగేయాలి.

సైన్స్.. అవకాశాలకు వేదిక
సైన్స్ కోర్సులంటే.. కెరీర్‌లో స్థిరపడటం ఆలస్యమవుతుందని, ఏళ్ల తరబడి శ్రమించాలనే భావనలో ఉంటారు. అయితే ముందుగా ఆ ఆలోచనకు స్వస్తి పలకాలి. సైన్స్‌తోనే సమాజం మనుగడ సాగిస్తోందన్న విషయాన్ని గ్రహించాలి. సైన్స్‌లో ఇప్పుడు విభిన్నమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. కోర్ కోర్సులను కాంటెంపరరీ అంశాలతో సమ్మిళితం చేస్తూ ఎన్నో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు వచ్చాయి. వీటిపై దృష్టిసారించడం ద్వారా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ సైన్స్ ఏ రంగాన్ని తీసుకున్నా.. వాటికి మూలాలు సైన్స్‌లోనే ఉన్నాయని గుర్తించాలి.

ప్రతి విభాగమూ ముఖ్యమైనదే!
సాధారణంగా ఏ డొమైన్‌ను ఎంపిక చేసుకున్న వారి నుంచైనా.. ముఖ్యమైన విభాగం ఏమిటి? అనే ప్రశ్న వస్తుంది. చాలా సెమినార్లలో సైన్స్ కోర్సుల ఔత్సాహికుల నుంచి కూడా నాకు ఇదే రకమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. వాస్తవంగా చెప్పాలంటే సెన్సైస్‌లో అన్ని విభాగాలూ ముఖ్యమైనవే. ఉదాహరణకు ఫిజికల్ సైన్స్‌ను తీసుకుంటే.. దానికి అనుబంధంగా ఉన్న అట్మాస్ఫియరిక్ సైన్స్, ఎర్త్ సైన్స్ వంటి ఎన్నో ముఖ్యమైన బ్రాంచ్‌లున్నాయి. అదే విధంగా కెమికల్ సెన్సైస్‌లోనూ! కాబట్టి ఏది క్రేజ్ అనే ఆలోచనకంటే తమ ఆసక్తిని బట్టి కోర్సును ఎంపిక చేసుకోవాలి.

పరిశోధనలకు మార్గాలు
సైన్స్ విభాగంలో పరిశోధనలకు ఇప్పుడు అవకాశాలు అపారంగా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేటు యూనివర్సిటీలు, కార్పొరేట్ సంస్థల నుంచి రీసెర్చ్ సెంటర్ల వరకు సైన్స్ అభ్యర్థులు పరిశోధనల దిశగా ప్రవేశం పొందేందుకు అవ కాశముంది. ప్రభుత్వ సంస్థల్లో జేఆర్‌ఎఫ్ పేరిట, ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లో రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ పేరుతో ఆర్థిక ప్రోత్సా హకాలు కూడా లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునే దిశగా అవగాహన పెంచుకోవాలి. ఇన్‌స్పైర్, కేవైపీవై వంటివి హై స్కూల్ స్థాయి నుంచే సైన్స్ రంగం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారిని ఆ రంగంలో సమున్నత స్థానాలకు తీసుకెళ్లేలా దోహదం చేస్తున్నాయి. అయితే వీటిలో కీలక పాత్ర ఉపాధ్యాయులదే. హై స్కూల్ స్థాయిలో తమ తరగతి గదిలోని విద్యార్థులు ప్రదర్శిస్తున్న ప్రతిభ ఆధారంగా విద్యార్థులను గుర్తించి ఈ దిశగా వారిని మోటివేట్ చేయడంలో ఉపాధ్యాయులు చొరవచూపాలి.

రీసెర్చ్ ల్యాబ్స్‌లో
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్‌టీ) తదితర పరిశోధన కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు పలు ప్రైవేటు యూనివర్సిటీలు సైతం స్పాన్సర్డ్ రీసెర్చ్ పేరుతో పరిశ్రమ వర్గాలతో ఒప్పందాల ద్వారా రీసెర్చ్ లేబొరేటరీలు నెలకొల్పి ఆవిష్కరణల దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. రీసెర్చ్ ఔత్సాహికులు వీటిని ఉపయోగించుకోవాలి.

ఆస్వాదిస్తూ.. సాగాలి
విద్యార్థులు, ఉన్నత విద్య ఔత్సాహికులకు నా సలహా ఏంటంటే.. కోర్సు ఏదైనా ఆస్వాదిస్తూ చదవడం ముఖ్యం. ప్రధానంగా సైన్స్ విభాగంలో ఇది ఎంతో అవసరం. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహ పరిస్థితులు ఎదురైనా, వాటిని ఒక పాఠంగా భావించి, బయటపడి కొత్త ఉత్సాహంతో అడుగేయాలి. అప్పుడు అద్భుత ఫలితాలు సొంతమవుతాయి.
Published date : 18 Jun 2016 12:41PM

Photo Stories