Skip to main content

ఫ్యాషనబుల్ కెరీర్‌కు లిఫ్ట్.. నిఫ్ట్

ఆధునిక కాలంలో నూతన ఫ్యాషన్ల అవసరం నానాటికీ పెరిగిపోతోంది. తద్వారా వీటిని సృష్టించేవారికి మంచి డిమాండ్ ఏర్పడింది. వినూత్నమైన ఫ్యాషన్లను వెలుగులోకి తెచ్చే నైపుణ్యం ఉన్నవారు సమాజంలో ప్రముఖులుగా వెలిగిపోతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తి ఉండి, ఈ రంగంలో స్థిరపడాలనుకొనేవారికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఎన్నో కోర్సులను ఆఫర్ చేస్తోంది. నిఫ్ట్‌కు దేశవ్యాప్తంగా 15 నగరాల్లో క్యాంపస్‌లున్నాయి. హైదరాబాద్‌లో నిఫ్ట్ క్యాంపస్ ఉంది. ఫ్యాషన్ సంబంధిత కోర్సులను అందించడంలో ‘నిఫ్ట్’ను దేశంలోనే అగ్రశ్రేణి ఇన్‌స్టిట్యూట్‌గా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్ట్-హైదరాబాద్ జాయింట్ డెరైక్టర్ ఇ.వెంకట్‌రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఇంజనీరింగ్, మెడిసిన్‌తో పోలిస్తే ఫ్యాషన్ టెక్నాలజీ బెస్ట్ కెరీర్
ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యనభ్యసించాలంటే ఎన్నో కళాశాలలు, సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, నిఫ్ట్‌లు దేశవ్యాప్తంగా 15 మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రవేశం పొందాలంటే గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఫ్యాషన్ కోర్సులను మంచి కెరీర్ ఆప్షన్‌గా భావించొచ్చు. ఫ్యాషన్లు, డిజైన్లపై ఆసక్తి, అనురక్తి ఉండి తమదైన శైలిలో కొత్త ఫ్యాషన్లను సృష్టించి గుర్తింపు పొందాలని కోరుకొనేవారు ఈ రంగంలోకి నిస్సందేహంగా అడుగుపెట్టొచ్చు.

గ్రాడ్యుయేషన్ స్థాయిలో
బ్యాచిలర్ ప్రోగ్రామ్స్-డిజైన్ : యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, లెదర్ డిజైన్.
కాలపరిమితి: నాలుగేళ్లు.అర్హత: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత.
బ్యాచిలర్ ప్రోగ్రామ్-టెక్నాలజీ
అప్పెరల్ ప్రొడక్షన్, కాలపరిమితి:
నాలుగేళ్లు.
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్.

ఏది ఉత్తమం? ఎందుకు?
నిఫ్ట్‌లో డిజైన్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ రంగాలు విద్యార్థుల ఆదరణను ఎంతగానో చూరగొన్నాయి. సృజనాత్మకంగా ఆలోచించేవారు డిజైన్; ప్రొడక్షన్‌పై ఆసక్తి ఉన్నవారు టెక్నాలజీ; మార్కెటింగ్‌పై ఇష్టం ఉన్నవారు మేనేజ్‌మెంట్‌ను ఎంచుకోవాలి. తద్వారా కెరీర్‌లో రాణించవచ్చు.

అవకాశాలు
యాక్సెసరీ డిజైన్
: కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే కాస్ట్యూమ్ జ్యుయెలరీ, తోలు వస్తువులు, గిఫ్ట్‌వేర్, టేబుల్‌వేర్, గడియారాలు, పాదరక్షలు, హస్త కళాకృతులు, లైఫ్‌స్టైల్ తదితర ఉత్పత్తుల తయారీ రంగాల్లో డిజైనర్లు, బ్రాండ్ మేనేజర్లు, విజువల్ మర్చండైజర్లు, ప్రొడక్ట్ మేనేజర్లుగా స్థిరపడొచ్చు.
ఫ్యాషన్ కమ్యూనికేషన్: ఇదొక స్పెషలైజ్డ్ ఫ్యాషన్ ప్రోగ్రామ్. దీనిద్వారా లైఫ్‌స్టైల్ పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. గ్రాఫిక్ డిజైన్, విజువల్ మర్చండైజింగ్, రిటైల్ స్పేస్ డిజైన్, స్టైలింగ్ అండ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ జర్నలిజం, ఈవెంట్స్ అండ్ ఫ్యాషన్ అడ్వర్టైజింగ్ విభాగాల్లో భారీగా ఉపాధి అవకాశాలుంటాయి.
ఫ్యాషన్ డిజైన్: డిజైనర్లు, ఫ్రీలాన్స్ డిజైన్ కన్సల్టెంట్లు, డిజైన్ మేనేజర్లు, స్టైలిస్టులు, ఎగ్జిబిషన్ అండ్ విజువల్ డిస్‌ప్లే నిపుణులు, ఫోర్‌కాస్ట్ అండ్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫోరమ్ నిర్వాహకులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఇలస్ట్రేటర్లు, ప్యాటర్న్ ఇంజనీర్లుగా స్థిరపడొచ్చు.
నిట్‌వేర్ డిజైన్: విద్యార్థులను పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేలా ఈ కోర్సును రూపొందించాం. నిట్‌వేర్ డిజైన్ కోర్సు పూర్తయ్యాక డిజైనర్లు, క్రియేటివ్ మేనేజర్లు, మర్చండైజర్లు, ప్రొడక్షన్ మేనేజర్లుగా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
టెక్స్‌టైల్ డిజైన్: వస్త్రాల మిల్లులు, సంబంధిత ఎగుమతి సంస్థల్లో ప్రవేశించాలనుకొనేవారికి ఈ కోర్సు ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనర్లుగా మంచి పేరు తెచ్చుకోవచ్చు. వస్త్ర పరిశ్రమల్లో డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ మేనేజర్లుగా పనిచేయొచ్చు. అంతేకాకుండా డిజైనర్లుగా సొంత వ్యాపారం కూడా నిర్వహించుకోవచ్చు.

ఫ్యాషన్ అండ్ అప్పెరల్ డిజైనింగ్
ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థుల కోసం లెక్కలేనన్ని అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. గార్మెంట్ ప్రొడక్షన్, క్వాలిటీ అస్యూరెన్స్, గార్మెంట్ ఫిట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డవలప్‌మెంట్, సోర్సింగ్, ప్రాజెక్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డవలప్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, సిస్టమ్ అనాలిసిస్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, మర్చండైజింగ్ ఫర్ రిటైల్ అండ్ ఎక్స్‌పోర్ట్.. ఇలా ఎన్నో రంగాల్లో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది.

ఏయే సంస్థల్లో ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతోపాటు విదేశాల్లోనూ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అమాబత్తూర్ క్లాతింగ్ కంపెనీ, ఏవైఎన్ యాక్సెసరీస్(హాంకాంగ్), బాంబే రేయాన్ ఫ్యాషన్స్ లిమిటెడ్, సెలబ్రిటీ ఫ్యాషన్స్, కలర్ ప్లస్, గినీ అండ్ జానీ, గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, పోకర్నా గ్రూప్, ఇంటిగ్రా అప్పెరల్స్, ఐటీసీ, లాగూనా క్లాతింగ్, మధురా గార్మెంట్స్, పాంటాలూన్, టెక్స్‌పోర్ట్ ఓవర్సీస్, టెక్స్‌పోర్ట్ సిండికేట్, థర్డ్ ఐ సైట్, మ్యాగ్‌పై, తనిష్క్, జంపింగ్ గూస్.. తదితర సంస్థలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి.

వేతనాలు
సృజనాత్మక ఆలోచనలు కలిగి, వృత్తిలో వస్తున్న నూతన ధోరణులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకుపోయేవారు ఐదు అంకెల వేతనం అందుకోవచ్చు. నిఫ్ట్-హైదరాబాద్‌లో కోర్సు పూర్తిచేసిన విద్యార్థికి ఇప్పటివరకు లభించిన అత్యధిక వేతన ప్యాకేజీ నెలకు రూ.49 వేలు.

ఫ్యాషన్ టెక్నాలజీ, డిజైన్, మేనేజ్‌మెంట్.. వీటిలో ఏది అత్యుత్తమ రంగం
పై మూడు రంగాలూ అత్యుత్తమమైనవే. దేన్ని ఎంచుకున్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదు. అయితే విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచులకు అనుగుణమైన రంగాన్ని ఎంచుకుంటే కెరీర్‌లో ఉన్నతంగా ఎదిగేందుకు వీలుంటుంది.
Published date : 03 Mar 2014 12:12PM

Photo Stories