Skip to main content

నిర్మాణ రంగం.. మరింత వినూత్నం

‘ఆధునిక యుగంలో నిర్మాణాల ఆవశ్యకత పెరిగి, ఆర్కిటెక్ట్ నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడింది’ అని న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొ. చేతన్ వైద్య తెలిపారు. ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మాస్టర్ ఆఫ్ సిటీ ప్లానింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అర్బన్ ఎక్స్‌పర్ట్ కమిటీ వంటి వాటిలో సభ్యులైన ప్రొఫెసర్ చేతన్ వైద్యతో గెస్ట్ కాలమ్..
ఆర్కిటెక్చర్ రంగం ఆధునిక హంగులు అద్దుకుంటోంది. ఒకప్పుడు డిజైన్ రూపకల్పన మాన్యువల్‌గా జరిగేది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి అనేక సాఫ్ట్‌వేర్ ఆధారిత అంశాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆర్కిటెక్ట్‌లు సమర్థంగా సేవలు అందించే అవకాశం లభిస్తోంది.

ప్లానింగ్ ముఖ్యమే..
ఆర్కిటెక్చర్ అంటే ఆయా నిర్మాణాలకు డిజైన్ల రూపకల్పన మాత్రమే కాదు. ముందస్తు ప్లానింగ్ వంటి అంశాలు, అనేక ఇతర విభాగాలు ఆర్కిటెక్చర్ పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా నిర్మాణాలకు, ప్లానింగ్‌కు సంబంధించి అర్బన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, కోస్టల్ ఏరియా ప్లానింగ్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ వంటి అనేక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పేరుతో ఇన్‌స్టిట్యూట్‌లను నెలకొల్పింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలోనూ, ఆర్కిటెక్చర్ కోర్సుకు అనుబంధంగా ప్లానింగ్ కోర్సును అందిస్తున్నాయి.

ప్రాక్టికాలిటీకి ప్రాముఖ్యం
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ రంగంలో ఎదురవుతున్న మానవ వనరుల కొరత దృష్ట్యా, ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరగాలి. ఇన్‌స్టిట్యూట్‌ల పరంగా మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన సమస్యగా మారింది. ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఉండే ఈ కోర్సుల్లో మౌలిక సదుపాయాలు లేకపోతే సరైన నైపుణ్యాలు లభించవు. మౌలిక సదుపాయాల కల్పనలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చర్యలు తీసుకుంటోంది. తమ పరిధిలోని అన్ని కళాశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు అందించేలా నిబంధనలు రూపొందించింది. దీంతోపాటు నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేపట్టి కళాశాలలన్నీ నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపడుతోంది. ప్రవేశాల పరంగా జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష (నాటా)ను నిర్దేశించింది. దీంతో విద్యార్థుల ఎంపిక దశ నుంచే ఇన్‌స్టిట్యూట్‌లపై నియంత్రణ ఉంటోంది.

ఇంటర్ డిసిప్లినరీ దృక్పథం ముఖ్యం
ఆర్కిటెక్చర్, ప్లానింగ్, సివిల్ ఇంజనీరింగ్... ఒకదానికొకటి సమన్వయం గల కోర్సులుగా చెప్పొచ్చు. ఉదాహరణకు అర్బన్ ప్లానింగ్‌లో.. ప్లానింగ్‌లో భాగంగా, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తారు. ఆర్కిటెక్చర్‌లో భాగంగా నిర్మాణాలకు డిజైన్లు తయారు చేస్తారు. క్షేత్ర స్థాయిలో సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఉపయోగించి నిర్మాణాలు చేపడతారు. ఇటీవల కాలంలో పర్యావరణ అంశాలకు కూడా ఆయా నిర్మాణాల క్రమంలో ప్రాధాన్యం ఏర్పడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరీ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి.

చేయూతనిచ్చే పథకాలు
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ రంగంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే వేల సంఖ్యలో మానవ వనరుల కొరత ఉంది. కాబట్టి కొలువుల గురించి ఆందోళన చెందక్కర్లేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్మార్ట్ సిటీ, అమృత్ వంటి పథకాలతో ఈ రంగంలో నిపుణుల ఆవశ్యకత మరింత పెరగనుంది.

బ్యాచిలర్ స్థాయి నుంచే..
ఆర్కిటెక్చర్ రంగంలో భవిష్యత్తు కోరుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే ఈ దిశగా అడుగులు వేస్తే కలిసొస్తుంది. చాలా మంది సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు బీటెక్ పూర్తయ్యాక, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కోర్సుల స్పెషలైజేషన్లపై దృష్టిసారిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో సమర్థంగా రాణించాలంటే బ్యాచిలర్ డిగ్రీ (బీఆర్క్) స్థాయి నుంచే ఈ దిశగా అడుగులు వేయాలి.

సృజనాత్మకత కీలకం
ఇంజనీరింగ్‌కు ప్రత్యామ్నాయంగా విద్యార్థులు ఈ కోర్సులో చేరకూడదు. వ్యక్తులు లేదా సంస్థల స్థాయిలో ఉండే క్లయింట్ల అవసరాలు, పరిమితులకు లోబడి డిజైన్లు, ప్రణాళికలు రూపొందించాలి. ఇందులో రాణించడానికి వ్యక్తిగతమైన సృజనాత్మక నైపుణ్యాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అందుకే ఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌ల సరళి కూడా అభ్యర్థుల్లోని సృజనాత్మకతను పరీక్షించే విధంగా ఉంటుంది. కేవలం సబ్జెక్టు పరిజ్ఞానంతో ఈ కోర్సులో రాణించటం కష్టం.
Published date : 24 Dec 2015 05:32PM

Photo Stories