Skip to main content

కోర్సు ఏదైనా మొక్కుబడిగా చదవొద్దు!

మన దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే వ్యవసాయ రంగం ప్రస్తుతం ఒడిదొడుకులను ఎదుర్కోవడంతోపాటు నిపుణులైన వ్యవసాయ నిర్వహణ అధికార్ల కోసం ఎదురుచూస్తోంది అంటున్నారు.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ జనరల్ వి.ఉషారాణి (ఐఏఎస్). వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల కెరీర్ ఖాయమంటున్న ఉషారాణితో గెస్ట్‌కాలమ్..
పరిశ్రమలతో అనుసంధానం దిశగా..
గత 2-3 ఏళ్లుగా మేనేజ్‌మెంట్‌విద్యలో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంబీఏ.. స్కిల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌గా రూపాంతరం చెందుతోంది. పరిశ్రమలు కోరుకుంటున్న నైపుణ్యాలందించే దిశగా కరిక్యులంలోనూ మార్పు జరుగుతోంది. విద్యా సంస్థలకు, పరిశ్రమలకు మధ్య అనుసంధానం పెరుగుతుండటం మంచి పరిణామం.

అగ్రి బిజినెస్ మేనేజర్లుగా..
మార్కెటింగ్, ప్యాకేజింగ్, ఎక్స్‌పోర్టింగ్, ప్రాసెసింగ్, ప్రొడక్షన్ వంటి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో టెక్నాలజీ, మేనేజీరియల్ స్కిల్స్‌ను పెంపొందించాలన్న ఉద్దేశంతో పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలో రెండేళ్ల ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లామా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్స్‌ను అందిస్తున్నాం. ఈ కోర్సులో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ అంశాలతోపాటు బిజినెస్ అప్లికేషన్స్, ఆర్థిక సూత్రాల అన్వయాన్ని నేర్పుతాం. వాతావరణ మార్పులు, ప్రభుత్వ విధానాలను వివరిస్తాం. వీటితోపాటు కన్జ్యూమర్ సైన్స్, ప్లాంట్ సైన్స్, ఇండస్ట్రియల్ టెక్నాలజీ వంటి అంశాలుంటాయి. పంట మార్కెటింగ్‌లో రైతులకు సరైన సలహాలందాలన్న ఉద్దేశంతో ఏడాది ప్రోగ్రామ్ (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్) ఉంది. ఇన్ సర్వీస్ వాళ్ల కోసం పీజీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ దూర విద్యలో అందిస్తున్నాం.

అగ్రికల్చరల్ డిగ్రీ+క్యాట్
పీజీడీఎం(ఏబీఎం)లో చేరేందుకు అగ్రికల్చర్ సైన్స్, లేదా అగ్రికల్చర్ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ, లేదా ఇంజనీరింగ్, ప్యూర్ సెన్సైస్, కామర్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్‌లో బ్యాచిలర్ డిగ్రీ 50 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. క్యాట్ 2015 స్కోర్ కూడా ఉండాలి. రైటింగ్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్, మైక్రో ప్రెజెంటేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, వర్క్ ఎక్స్‌పీరియన్స్, అకడమిక్ రికార్డ్‌లను పరిశీలించి ప్రతి బ్యాచ్‌కు 60 మందిని తీసుకుంటాం.

ఉద్యోగావకాశాలకు కొదవలేదు
పీజీడీఎం (ఏబీఎం) చేసినవారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, అగ్రి ఇన్‌పుట్, ఫుడ్ అండ్ బేవరేజస్, పౌల్ట్రీ, రిటైల్ విభాగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తాం. గతేడాది మా విద్యార్థులు వివిధ ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా ఏడాదికి రూ.26 లక్షల జీతంతో ఉద్యోగాలు పొందారు.

కోర్సు ప్రత్యేకతలు..
కార్పొరేట్ ఎక్స్‌పోజర్ ఉండేలా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. వివిధ కంపెనీల్లో అగ్రి బిజినెస్ ప్రాక్టీసెస్ అండ్ అప్లికేషన్స్, ప్రాక్టికల్ వర్కింగ్ కండీషన్స్‌పై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తాం. 15 రోజుల విలేజ్ విజిట్‌లో వ్యవసాయం, రైతుల సమస్యలు, పొటెన్షియల్ ఏరియాస్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ వంటి విషయాల్లో శిక్షణ ఇస్తాం. ఈ ప్రోగ్రామ్‌లో టీచింగ్ పూర్తిగా కేస్-స్టడీస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది.

మేనేజ్‌మెంట్ విద్యార్థులకు సలహా
కాలేజీ ఎంపికలో వ్యాల్యూ ఆఫ్ మనీ, ప్లేస్‌మెంట్ రికార్డ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఇంటర్‌ఫేస్ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంబీఏతో పాటు ఏ కోర్సు అయినా మొక్కుబడిగా చదివితే ప్రయోజనం ఉండదు.
Published date : 17 Jun 2016 12:50PM

Photo Stories