Skip to main content

ఐసీటీ.. అద్భుత సాధనం

భారతదేశం.. టెక్నాలజీపరంగా వేగంగా పరుగులు తీస్తోంది. 120 కోట్లకు పైగా జనాభా గల దేశంలో అధిక శాతం మంది యువత కావడం.. వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది.
యువత తమ ఆలోచన పరిధిని విస్తృతం చేసుకుని అందుబాటులోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకుంటే త్వరలోనే భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా మారడం ఖాయం అంటున్నారు.. డనూబే (ఆస్ట్రియా) యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఈ-గవర్నెన్స్ హెడ్ ప్రొఫెసర్ పీటర్ ప్యార్సిక్. టెలిమాటిక్స్‌లో పీహెచ్‌డీ చేసి.. ఈ-గవర్నెన్స్, ఈ-లెర్నింగ్ విధానాల్లో అనుభవం గడించిన ఆయనతో సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత విద్యపై ప్రత్యేక ఇంటర్వ్యూ..

సాంకేతిక నైపుణ్యాలుంటే వేగవంతమైన అభివృద్ధి: నేడు ప్రతి అంశానికి సాంకేతిక నైపుణ్యం అనుసంధానమై ఉంటోంది. సాంకేతిక పరిజ్ఞానంతో సమాజంలో అన్ని రంగాలను వేగవంతంగా అభివృద్ధి చేయొచ్చు. అయితే దీనికి కావాల్సింది నిపుణులైన మానవ వనరులు. యువత ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి.

సామాజిక లక్ష్యాలే వ్యక్తిగత అవకాశాలుగా: భారత్ ఇప్పుడు అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ దిశగా కదులుతోంది. ఇందుకు ఈ-గవర్నెన్స్, నేషనల్ లిటరసీ మిషన్ వంటివి ఉదాహరణలు. వీటి ప్రధాన ఉద్దేశం ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పాలన అందించడం. ఈ- గవర్నెన్స్‌కు సంబంధించి భారత్‌లో అకడమిక్ స్థాయిలో అవకాశాలు పెంచితే పూర్తి స్థాయిలో ఆ రంగంలో నిష్ణాతులు రూపొందుతారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, ఈ-పాలసీ వంటి విభాగాల్లో మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్స్)ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిని అభ్యసించడం ద్వారా నైపుణ్యాలు పెంచుకోవచ్చు.

సెల్ఫ్ స్ట్రక్చర్ అభ్యసనం: బోధన, అభ్యసనాలకు సంబంధించి పాశ్చాత్య దేశాలకు, భారత్‌కు మధ్య ప్రధాన తేడా సెల్ఫ్ లెర్నింగ్‌కు ఇక్కడ అకడమిక్ స్థాయిలో తక్కువ ప్రాధాన్యం ఉండటమే. సెల్ఫ్ లెర్నింగ్ ఉంటేనే విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహన లభిస్తుంది. విద్యార్థులకు నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో అనువర్తించేందుకు పూర్తి స్వేచ్ఛాపూరిత వాతావరణం కల్పించాలి. దీనివల్ల తమలోని లోపాలు తెలుసుకునే వీలు లభిస్తుంది.దాంతోపాటు వాటిని సరిదిద్దుకునే పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు.

ఐసీటీ.. మరో అద్భుత సాధనం: దాదాపు నూట ఇరవై కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో అందరికీ విద్యా ఫలాలు అందించాలంటే అద్భుత సాధనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ). దీన్ని సమర్థంగా అమలు చేస్తే మారుమూల ప్రాంతాలకు సైతం విద్యావకాశాలు లభిస్తాయి. కానీ ప్రధానంగా ఎదురయ్యే సమస్య మౌలిక సదుపాయాలు. ఈ నేపథ్యంలో వై-ఫై టెక్నాలజీలు, బ్రాడ్-బ్యాండ్ వంటి వాటితో అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసే విధంగా బోధన సదుపాయాలు కల్పించాలి.

ఇన్నోవేటివ్ నాలెడ్జ్ - ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్: విద్యార్థులు కేవలం కొన్ని కోర్సులకే పరిమితం కాకూడదు. గ్లోబల్ నాలెడ్జ్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ఇందుకు ఉపకరించే అంశం ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్. వీటి వల్ల విద్యార్థులకు ఇన్నోవేటివ్ నాలెడ్జ్ లభిస్తుంది. మల్టీ డిసిప్లినరీ నైపుణ్యాలు లభిస్తాయి. భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయగల సంసిద్ధత లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించి విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లను మెప్పించే విధంగా భారత్ విద్యా సంస్థలు నాణ్యత పాటించాలి.

సోషల్ మీడియాతో పెరిగే నెట్‌వర్క్: నేటి తరం యువత సోషల్ మీడియా సాధనాలను కూడా తమ అవకాశాలకు వేదికలుగా మార్చుకోవాలి. తమ రంగానికి చెందిన నిపుణులను సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్స్ ద్వారా నిరంతరం అనుసరిస్తూ ఉండాలి. సదరు రంగంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు తెలుసుకోవడంతోపాటు, తాము మరింతగా రాణించడానికి అవసరమైన సలహాలు, సూచనలు కోరాలి.

ఓపెన్ కొలాబరేషన్: టెక్నికల్ నైపుణ్యాలతోపాటు విద్యార్థులు అలవర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం ఓపెన్ కొలాబరేషన్, నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్. ఈ రెండింటితో కొత్త అంశాలు తెలుస్తాయి. ఇందుకోసం గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ వంటి వాటిలో పాల్గొనాలి. దీనివల్ల అవకాశాలు విస్తృతమవుతాయి. విదేశీ విద్య ఔత్సాహికులే కాకుండా.. ఉజ్వల భవిష్యత్తు కోరుకునే విద్యార్థులెవరికైనా నేటి పరిస్థితుల్లో ఇదే ప్రధానమైన సక్సెస్ ఫార్ములా!!
Published date : 02 Feb 2015 02:42PM

Photo Stories