TS Lawcet 2022 : లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..
ఇకపై గడువు పొడిగించలేమని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాసెట్ పరీక్ష జూలై 21, 22 తేదీల్లో జరగనున్నది. మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో 3597 సీట్లు, 5 ఏళ్ల కోర్సులో 1484, ఎల్‌ఎల్‌ఎంలో 674 సీట్లు ఉన్నాయి.
ఎన్నో సమస్యలకు పరిష్కారాలు చూపే.. లా కోర్సుల ప్రవేశ పరీక్షల గురించి తెలుసుకోండిలా..
అర్హతలు ఇలా..
➤ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
➤ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. వీరు బీఏ+ఎల్‌ఎల్‌బీ, బీకామ్+ఎల్‌ఎల్‌బీ, బీబీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ చేసే అవకాశం ఉంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..:
☛ తెలంగాణ స్టేట్ లెవల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ లాసెట్) పరీక్ష ద్వారా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో మొత్తం 120 మార్కులకు గాను 120 ప్రశ్నలకు ఉంటుంది. 3 పార్ట్‌లుగా పరీక్షను నిర్వహిస్తారు. అవి..
1. కరెంట్ ఆఫైర్స్: ఈ విభాగంలో 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష ఉంటుంది.
2. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ: ఈ విభాగంలో 30 ప్రశ్నలు–30 మార్కులుంటాయి.
3. అప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా: ఈ విభాగం నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
☛ మూడు విభాగాలకు కలిపి పరీక్ష సమయం 90 నిమిషాలు. ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం లేదు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్షను రాసుకోవచ్చు.
కోర్సు అనంతరం కూడా..
లా కోర్సు పూర్తిచేసిన తర్వాత న్యాయవాద వృత్తి చేపట్టాలంటే..‘ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్’లో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేయించుకోవాలి.
కెరీర్ ఇలా..
న్యాయ విద్య పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. లా పూర్తిచేసిన తర్వాత లీగల్ అడ్వైజర్, అడ్వకేట్, లీగల్ మేనేజర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి హోదాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు.
➤ లా డిగ్రీ ఉత్తీర్ణులయ్యాక టీచింగ్ పట్ల ఆసక్తి ఉంటే.. లీగల్ ఫ్యాకల్టీగా లా కాలేజీల్లో పనిచేయవచ్చు. అంతేకాకుండా పీజీ, ఎల్‌ఎల్‌ఎం వంటి వాటికి కూడా ప్రిపర్ కావచ్చు.