Free Education: న్యాయ విద్య ఉచితంగా చదువుకోండిలా.. ఎవరికి ఎన్ని సీట్లు..
ఇప్పటివరకు యూనివర్సిటీ కళాశాలలు, ప్రైవేట్ కాలేజీల్లో మాత్రమే న్యాయ విద్య అందించేవారు. పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో ‘లా’ చేయాలంటే.. వేలకు వేలు ఫీజు సమర్పించుకోవాల్సి వచ్చేది.
చాలా మందికి ఆసక్తి ఉన్నా.. ఫీజు చెల్లించేందుకు వెనుకడుగు వేసేవారు. అయితే గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా న్యాయ విద్యను అందిస్తోంది.
గురుకులాల ద్వారా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే బలహీన వర్గాల గురుకుల విద్యాలయాల సంస్థ 2023–24 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేకంగా గురుకులాల ద్వారా న్యాయ విద్య అందిస్తోంది. బాలురకు హైదరాబాద్ వద్ద మహేశ్వరంలో, బాలికలకు కాజీపేటలోని సోమిడి రోడ్డులో ‘లా’ గురుకుల కళాశాల ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు.
ప్రభుత్వ నిర్వహణలో సాగే.. ఈ కళాశాలలో చేరే విద్యార్థులకు టీఎస్ లా సెట్ ద్వారా అడ్మిషన్లు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల్లో కనిష్ట ఆదాయం కలిగిన వారు, ఇంటర్ పూర్తయిన వారు మాత్రమే ఈ ‘లా’ గురుకుల కళాశాలలో అడ్మిషన్లు పొందవచ్చు.
చదవండి: Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలు
అనేక సదుపాయాలు..
ఈ రెసిడెన్షియల్ ‘లా’ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లకు గరిష్ట వయో పరిమితి 20 ఏళ్లు.. వివాహితులకు ప్రవేశం లేదు. విద్యార్థులు తప్పనిసరిగా హాస్టల్‌లో వసతి పొందాలి.
విద్యార్థులకు ఉచిత హాస్టల్, మెస్ సౌకర్యం, యూనిఫామ్, నోట్ బుక్స్ వంటి అనేక సదుపాయాలు ఉంటాయి. నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేకమైన శ్రద్ధ చూపే అధ్యాపకులు ఉంటారు.
చదవండి: DY Chandrachud: గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి న్యాయ విద్య!!
నామమాత్రపు ఫీజు..
ఐదేళ్ల లా కోర్సుకు నామమాత్ర ఫీజు కేవలం రూ.4 వేలు. అలాగే.. రూ.4,000 కాషన్ డిపాజిట్ అడ్మిషన్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. కాషన్ డిపాజిట్ రుసుమును కోర్సు పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తారు.
కాజీపేట గురుకుల లా కళాశాలలో 60 సీట్లు
ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాజీపేటలోని గురుకుల ‘లా’ కళాశాలలో విద్యార్థినులకు 60 సీట్లు, హైదరాబాద్ మహేశ్వరం కళాశాలలో 60 సీట్లు విద్యార్థులకు (బాలుర) అందుబాటులో ఉన్నాయి.
- గురుకులంలో న్యాయ విద్య
- గతేడాది కాజీపేటలో ప్రారంభం
- హాస్టల్ వసతి, మెస్, ఇతర సదుపాయాలు
ఎవరికి ఎన్ని సీట్లు..
గురుకుల లా కళాశాలలో ఉన్న 60 సీట్లలో బీసీ ఏ–13, బీసీ–బి 15, బీసీ–సి 2, బీసీ–డి 11, బీసీ–ఈ 6, ఈబీసీ–1, ఎస్సీ–9, ఎస్టీ– 3 సీట్లు కేటాయిస్తారు. కాగా.. హనుమకొండ జిల్లా కాజీపేటలోని న్యాయ విద్య గురుకుల మహిళా కళాశాలలో గత విద్యా సంవత్సరం ఐదేళ్ల లా కోర్సు ప్రారంభమై కొనసాగుతోంది.
ఇందులో 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈవిద్యాసంవత్సరం ఫస్టియర్‌లోనూ ప్రవేశాలు ఉంటాయి. లాసెట్ ద్వారానే అడ్మిషన్లు ఇవ్వనున్నారు.
ఇటీవల లా సెట్ నోటిఫికేషన్..
తెలంగాణలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని లా కళాశాలలకు టీఎస్ ‘లా’ సెట్ నోటిఫికేషన్ ఇటీవలే విడుదల చేశారు. 2024–25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునేందుకు నోటిఫికేషన్ వెలువడింది.
చివరి తేదీ ఈ ఏడాది ఏప్రిల్ 15. అపరాధ రుసుము రూ.500లతో ఏప్రిల్ 25వ తేదీ వరకు అవకాశం ఉంది.