Postal Jobs Notification 2023: తపాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
అనంతపురం సిటీ: తపాలా శాఖ అనంతపురం డివిజన్‌లోని గ్రామీణ పోస్టాఫీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, జీతభత్యాలు ఎలా ఉంటాయి అనే వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. పదో తరగతి అర్హతతో తపాలా కొలువులు దక్కించుకోవచ్చు. దీంతో చాలామంది నిరుద్యోగులు ఎగబడుతున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
చదవండి: APPSC Group 1&2 Notification: త్వరలో గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్లు
ఖాళీ పోస్టులు, జీత భత్యాల ఇలా..
అనంతపురం డివిజన్‌లో మొత్తం 44 ఖాళీల భర్తీకి సంబంధించి తపాలా శాఖ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో బీపీఎం 25, ఏబీపీఎం 18, డాక్ సేవక్ పోస్టు 1 ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ పదో తరగతిలో వచ్చిన మార్కులను బట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బీపీఎంకు వేతనం రూ.12 వేల నుంచి రూ.29,380, ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టుకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు లభిస్తుంది.
దరఖాస్తు చేసుకునేందుకు గడువు..
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు ఉంటే ఈ నెల 24 నుంచి 26లోగా చేసుకోవచ్చు.