Employees: ‘సంతోషమే సగం బలం’.. భారత్‌లో మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం ఇదే.. కానీ వీరిలో అసంతృప్తి..!
సంతోషంగా ఉండడానికి మేనేజర్ల మద్దతు కీలకమని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ జాబ్ పోర్టల్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. 30 శాతం మంది ఉద్యోగులు పని విషయంలో ఓ స్థాయి అసంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన 1,219 సంస్థలు, 2,537 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఇండీడ్ తరఫున వాలువాక్స్ అనే సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఉద్యోగం తమ అన్ని రకాల సంతోషానికి సాయపడుతున్నట్టు 58 శాతం మంది భావిస్తున్నారు. ఉద్యోగుల ఆనందానికి మేనేజర్లదే ప్రధాన బాధ్యత అని 95 శాతం మంది భావిస్తున్నారు. సానుకూల పని వాతావరణానికి నాయకత్వ పాత్ర కీలకమని వారు పేర్కొన్నారు. మద్దనునిచ్చే మేనేజర్లతోపాటు.. అర్థవంతమైన పని, నైపుణ్యాల వినియోగం, సవాళ్లు, సృజనాత్మకంగా ఉండడం, మంచి బృందంతో కలసి పనిచేయడం అన్నవి ఉద్యోగుల్లో సంతోషాన్ని కలిగించే ఇతర అంశాలని సర్వే నివేదిక వెల్లడించింది.
Email Goes Viral: ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్ధికి చుక్కలు చూపించిన ఐటీ కంపెనీ.. కారణం ఏమిటంటే..!
వీరిలో అసంతృప్తి..
అయితే 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న ఉద్యోగుల్లో 74 శాతం మంది, 2 ఏళ్లలోపు అనుభవం కలిగిన ఉద్యోగుల్లో 54 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. దీర్ఘకాలంగా పనిచేసే ఉద్యోగుల్లో స్తబ్దత నెలకొంటే, కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే వారు కుదురుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫలితమే ఈ స్పందన అని ఇండీడ్ నివేదిక తెలిపింది.
ఎఫ్‌ఎంసీజీ రంగంలో 81 శాతం, ఐటీ/ఐటీఈఎస్‌లో 81 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో 80 శాతం, రిటైల్‌లో 78 శాతం మంది పనిలో ఆనందం ఉన్నట్టు చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో 59 శాతం, లాజిస్టిక్స్‌లో 58 శాతం, నిర్మాణ రంగంలో 58 శాతం మంది పనిలో సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. స్థిరత్వం, వృద్ధి అవకాశాలు తక్కువగా ఉండడం తక్కువ మంది సంతోషంగా ఉన్నామని చెప్పడానికి కారణం. చిన్న కంపెనీల్లో 73 శాతం, పెద్ద కంపెనీల్లో 79 శాతం మంది ఉద్యోగులు పనిలో ఆనందంగా ఉన్నారు.
అదే మధ్యసైజు కంపెనీల్లో సంతోషంగా ఉన్నామని చెప్పిన వారు 61 శాతంగానే ఉన్నారు. ‘చాలా సంస్థలు తమ ఉద్యోగుల సంతోషానికి ప్రాధాన్యం ఇస్తుండడం వారిలో సంతృప్తి పెరగడానికి కారణం. ఈ ఆనందం అంతిమంగా మెరుగైన ఉత్పాదకతకు దారితీస్తుంది. స్థిరమైన వ్యాపార విజయాలకు తోడ్పడుతుంది’ అని ఇండీడ్ ఇండియా టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్ రోహన్ సిల్వెస్టర్ తెలిపారు.