CEC students: క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికెట్లతో ఉపాధి
అనకాపల్లి టౌన్: అమెజాన్ వెబ్ సర్వీసెస్ వర్క్‌షాపు ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికెట్లు సంపాదించుకోవచ్చని డైట్ కళాశాల సీఈసీ విభాగాధిపతి పి.పూర్ణప్రియ తెలిపారు. స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కళాశాల ఆవరణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌పై వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీఈసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.వైకుంఠరావు మాట్లాడుతూ క్లౌడ్ కంప్యూటింగ్ సర్టిఫికెట్లు విద్యార్థుల ఉపాధి అవకాశాలకు దోహదపడతాయన్నారు. ఈ వర్క్‌షాపు ఏడు రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు. రిసోర్స్‌పర్సన్ జె.లోవబాబు మాట్లాడుతూ అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో లోడ్ బ్యాలెన్సింగ్, వెబ్‌సైట్ హోస్టింగ్, క్రియేషన్ ఆఫ్ డేటా బేస్ వంటి వాటి ద్వారా వివిధ టెక్నిక్స్‌ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.