Skip to main content

Staff Nurse Jobs in Kadapa: ‘స్టాఫ్‌ నర్స్‌’ల నియామకానికి వేళాయె

contract staff nurse jobs in kadapa andhra pradesh

రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అనే సమస్యే లేకుండా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా స్టాఫ్‌నర్స్‌ల నియామకాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. ఫలితంగా అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతున్నారు.

కడప రూరల్‌ : కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్‌–4 (రాయలసీమ జిల్లాలు) పరిధిలో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌ల నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. మరో మారు అధిక సంఖ్యలో జరగనున్నాయి.

మొత్తం 11,120 దరఖాస్తులు
ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రభుత్వం పెద్ద సంఖ్యలో స్టాఫ్‌ నర్స్‌ నియామకాలను చేపట్టింది. ఇందుకు సంబంధించి అభ్యర్ధుల నుంచి మొత్తం 11,120 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు మొత్తం 286 మంది అర్హులకు స్టాఫ్‌ నర్స్‌లుగా నియమించారు. వారంతా తమకు కేటాయించిన స్ధానాల్లో విధులను చేపడుతున్నారు.

తాజాగా 313 నియామకాలు
ప్రభుత్వం మరో మారు స్టాఫ్‌నర్స్‌ నియామకాలను చేపట్టింది. ఇప్పటికే వచ్చిన 11,120 దరఖాస్తుల నుంచి అర్హులైన అభ్యర్థులను రాయలసీమలోని 8 జిల్లాల్లో గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 313 నియామకాలను చేపడుతున్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రీజనల్‌ డైరెక్టర్‌ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) పరిధిలో 90, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఆధ్వర్యంలో (నంద్యాల మెడికల్‌ కాలేజీ, తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి) 149, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌లో 74 మొత్తం 313 నియామకాలను చేపడుతున్నారు. పెద్ద సంఖ్యలో నియామకాలను చేపట్టడం పట్ల అర్హులైన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

313 పోస్టుల భర్తీకి చర్యలు ఈ నెల 21, 22న కౌన్సెలింగ్‌ నిబంధనల ప్రకారం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 21, 22వ తేదీల్లో కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్స్‌ నియామకాలను చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని మీటింగ్‌ హల్‌లో నిర్వహిస్తాం. కౌన్సెలింగ్‌ను కట్టుదిట్టంగా చేపడుతాం.
– డాక్టర్‌ కేవీఎన్‌ఎస్‌ అనిల్‌కుమార్‌, రీజినల్‌ డైరెక్టర్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం

Published date : 19 Jul 2023 08:13PM

Photo Stories