JEE Mains 2022: ‘సర్వర్’ షాక్
ప్రధానంగా హైదరాబాద్‌లోని అబిడ్స్, మూసారాంబాగ్‌లలో ఓ ప్రైవేటు కాలేజీకి చెందిన రెండు పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యలతో పరీక్ష గంటల తరబడి ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆ పరీక్ష కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పరీక్ష నిర్వహణలో National Testing Agency (NTA) విఫలమైందని మండిపడ్డారు. కొందరు విద్యార్థులు కాలేజీ అద్దాలు పగలగొట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు. దేశవ్యాప్తంగా JEE Mains తొలి దశ పరీక్షను జూన్ 23 నుంచి 29 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జూన్ 24న హైదరాబాద్‌లోని మూసారాంబాగ్ పరీక్ష కేంద్రంలో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షకు విద్యార్థులు 8 గంటలకే కేంద్రానికి చేరుకున్నారు. అయితే ఆడ్మిట్ కార్డుపై బార్ కోడ్‌ను స్కాన్ చేసే సమయంలో NTAతో అనుసంధానమైన సర్వర్ మొరాయించింది. చాలా సేపటి వరకూ అది పనిచేయలేదు. చివరకు కనెక్ట్ అవ్వడంతో విద్యార్థులను పరీక్ష హాలులోకి పంపారు. అప్పటికే మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్ష రాయలేకపోయినట్లు తెలిపారు. కంప్యూటర్ స్క్రీన్‌పై కొన్ని ప్రశ్నలు సైతం సరిగ్గా కనిపించలేదని.. ఫలితంగా పదుల సంఖ్యలో మార్కులు కోల్పోయామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల సెషన్‌లోనూ ఇదే సమస్య తలెత్తింది. కొందరు విద్యార్థులు మొత్తం ప్రశ్నలు కన్పించలేదని తెలిపారు. మరోవైపు అబిడ్స్‌లోని పరీక్ష కేంద్రాలోనూ ఇదే రకమైన సమస్య ఎదురైంది. ఉ.9 గంటలకు జరగాల్సిన పరీక్ష 10:30 గంటలకు మొదలైంది. మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన పరీక్ష సాంకేతిక కారణాలతో సాయంత్రం 5 గంటల వరకు మొదలుకాకపోవడంతో ఆ కేంద్రంలో పరీక్షను ఎన్‌టీఏ వాయిదా వేసినట్లు కాలేజీ నిర్వాహకులు ఓ నోట్ విడుదల చేశారు.
చదవండి: JEE - JEE Main Guidance | JEE Main Syllabus | JEE Main Model papers | JEE Main Previous Papers