JEE Mains 2024: లాజిక్ పసిగట్టు.. జేఈఈ ర్యాంక్ కొట్టు!
వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌లో ఈ పరీక్ష జరుగుతుంది. ఇందులో అర్హత కోసం ప్రతీ ఒక్కరూ ప్రయత్నిస్తారు. మెయిన్స్‌లో మంచి ర్యాంకు వచ్చి, అడ్వాన్స్‌డ్‌లో రాకపోయినా ఆనందించే వాళ్లూ ఉంటారు. అయితే, జేఈఈలో విజయం సాధించడానికి కృషితో పాటు కొన్ని లాజికల్ అంశాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
చాలామందికి ఏ ర్యాంకుతో ఎక్కడ, ఏ బ్రాంచీలో సీటు వస్తుందనే అవగాహన ఉండదు. మెయిన్స్ ర్యాంకుతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఈసారి మారిన సిలబస్ కొంత ఒత్తిడిని తగ్గించే వీలుంది. కాబట్టి మెయిన్స్ ర్యాంకుల పట్ల ఉన్న అపోహలు దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది విద్యార్థులు 10,000 లోపు ర్యాంకు ఉంటేనే ఎన్‌ఐటీల్లో సీట్లు వస్తాయని భావిస్తారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
దీంతో తుది దశ కౌన్సెలింగ్ వరకూ ఉండకుండా ఎంసెట్‌పై దృష్టి పెడతారు. ర్యాంకర్లు కూడా రాష్ట్ర కాలేజీల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ప్రయత్నిస్తారు. కౌన్సెలింగ్ జిమ్మిక్కు పూర్తిగా అర్థమైతే తప్ప దీని నుంచి బయటపడటం కష్టం. అందుకే మెయిన్స్‌కు వెళ్లే విద్యార్థులు గత కొన్నేళ్ల ర్యాంకులు, సీట్ల వివరాలపై ముందే కొంత కసరత్తు చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
కాలేజీ కూడా లక్ష్యం కావాలి..:
మెయిన్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ముందస్తు సన్నద్ధతను బట్టి ఓ అంచనాకు రావాలి. మూడేళ్ల కటాఫ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ ర్యాంకు వస్తుందో గుర్తించాలి. దీని ఆధారంగానే ఏయే కాలేజీల్లో ఎంత వరకూ సీట్లు వచ్చాయనేది తెలుసుకోవచ్చు. జాతీయ స్థాయిలో ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్‌ఐటీల్లో 23,056 సీట్లు, ఐఐఐటీల్లో 5,643 సీట్లు, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి.
చదవండి: JEE Main 2024: జేఈఈ–2024కి ఎన్నికల గండం!
అడ్వాన్స్‌డ్‌తో భర్తీ చేసే 16,050 ఐఐటీ సీట్లను పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లను జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. కొన్నేళ్లుగా సీట్ల కేటాయింపును పరిశీలిస్తే, వరంగల్ నిట్‌లో సీఎస్‌ఈకి అబ్బాయిలకు 3,089 ర్యాంకు, అమ్మాయిలకు 3,971 వరకూ సీటు వస్తుంటే, ఏపీలో అబ్బాయిలకు 14,000 ర్యాంకు, అమ్మాయిలకు 28,000 ర్యాంకు వరకు సీటు వస్తోంది.
ఒబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13,000 వరకూ, ఏపీలో 33,000 ర్యాంకు వరకూ సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకి గరిష్టంగా 97,139 వరకూ, ఎస్టీలకు 48,000 ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. సిలబస్ మారడంతో ఈసారి కొంత పోటీ ఉండొచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ర్యాంకు, కాలేజీని టార్గెట్‌గా పెట్టుకోవాలన్నది జేఈఈ అధ్యాపకుల సూచన.
బ్రాంచే టార్గెట్ అనుకుంటే...
చాలామంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బ్రాంచీ కోసం ఎదురు చూస్తారు. అందుకే ఓపెన్ కేటగిరీలో ఈ బ్రాంచీ సీట్లకు పోటీ ఉంటుంది. ఒకవేళ బ్రాంచీనే లక్ష్యమైతే ఫలానా కాలేజీలో కావాలనే టార్గెట్ పెట్టుకోకూడదు. కొన్ని ఎన్‌ఐటీల్లో ఓపెన్ కేటగిరీకి కూడా 40,000 ర్యాంకు వ చ్చినా సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇవేంటో విద్యార్థులు తెలుసుకోవాలి. మెకానికల్ డివిజన్‌లో ఓపెన్ కేటగిరీలోనే వరంగల్ నిట్‌లో 17,000 వరకూ, ఏపీలో 75,000 వరకూ ర్యాంకులకు సీటొచ్చే వీలుంది.
రిజర్వేషన్ విభాగంలో ఏకంగా 2,96,201 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. తిరు చ్చి, సూరత్‌కల్, క్యాలికట్, నాగపూర్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్‌ఐటీల్లో ఓపెన్ కేటగిరీ విద్యార్థులు కూడా జేఈఈ ర్యాంకు గరిష్టంగా 50,000 దాటినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. కాబట్టి కోరుకున్న బ్రాంచీ, ఏ కాలేజీలో వస్తుందనే కసరత్తు చేయడం ముఖ్యం. ఈ లాజిక్ తెలిస్తే ప్రిపరేషన్ అందుకు తగ్గట్టుగా ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు.