Skip to main content

JEE Main: పరీక్ష తేదీల్లో మార్పు..

జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి మొదటి దశలో నిర్వహించే JEE Main పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
JEE Main
జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పు..

జూన్‌ 20 నుంచి మొదలవ్వాల్సిన పరీక్షను 23కు మార్చారు. తొలి విడత పరీక్షలు జూన్‌ 29 వరకూ జరుగుతాయి. ఆడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ ప్రక్రియను జూన్‌ 18 నుంచే అనుమతించినట్టు National Testing Agency తెలిపింది. పూర్తిగా ఆన్‌లైన్‌ మోడ్‌లో దేశవ్యాప్తంగా 501 ప్రాంతాల్లో మెయిన్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి ఎక్కడ పరీక్ష అనే విషయాన్ని JEE Main వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఎన్‌టీఏ పేర్కొంది. పరీక్ష రాసే పట్టణం పేరు మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంటుందని, పరీక్ష కేంద్రం ఎక్కడనేది హాల్‌ టిక్కెట్‌లో ఇస్తామని తెలిపింది.

చదవండి: 

పరీక్షలోనూ మార్పులు

రెండేళ్ళ కోవిడ్‌ తర్వాత నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ ఈసారి కొంత కఠినంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. పరీక్ష విధానంలో మార్పులే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. గత రెండేళ్ళుగా సెక్షన్‌–ఏలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండేది. ఇప్పుడు దీన్ని సెక్షన్‌–బీలో కూడా పెడుతున్నారు. ఈ విభాగంలో ఇచ్చే న్యూమరికల్‌ ప్రశ్నలకు దీన్ని పెట్టడం వల్ల విద్యార్థులు ఆచితూచి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నపత్రం మొత్తం 20 మార్కులకు ఉంటుంది. ఇదిలా ఉండగా, గతంలో మొత్తం 90 (ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు) ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దీంతో మొత్తం మార్కుల సంఖ్య 360గా ఉండేది. ఇప్పుడు 90 ప్రశ్నల్లో 75కే జవాబు ఇవ్వాలి. మిగతా 15 చాయిస్‌గా తీసుకోవచ్చు. దీంతో ప్రశ్నపత్రం 300 మార్కులకే ఉండనుంది.

చదవండి:

సమాన మార్కులు వస్తే టై బ్రేకర్‌ విధానం

2021లో రద్దు చేసిన టై బ్రేకర్‌ విధానాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మళ్ళీ తెరమీదకు తెచ్చింది. ర్యాంకుల్లో సమానమైన స్కోర్‌ సాధించినప్పుడు వయసును కూడా ప్రామాణికంగా తీసుకోవడం ఈ విధానంలో ప్రత్యేకత. ఇద్దరు విద్యార్థులు పరీక్షలో సమానమైన మార్కులు సాధిస్తే ముందుగా గణితం, ఫిజిక్స్, కెమెస్ట్రీల మార్కులను పరిగణనలోనికి తీసుకుంటారు. ఆ తర్వాత తప్పు సమాధానాల నిష్పత్తిని సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో మార్కులు ఉంటే వయసును పరిగణనలోనికి తీసుకుంటారు. అప్పుడు కూడా ఇద్దరూ సమానంగా ఉంటే, ముందు ఎవరు దరఖాస్తు చేశారో చూసి ర్యాంకులు నిర్ధారిస్తారు. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మొదటి విడత జూన్‌ 23 నుంచి 29 వరకూ , ఆ తర్వాత జూలై 21 నుంచి 30 వరకూ రెండో విడత జరుగుతుంది. కోవిడ్‌ సమయంలో నాలుగు విడతల పరీక్ష విధానాన్ని రెండు విడతలుగా మార్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్ష రాస్తున్నారు.

చదవండి: జేఈఈ–అడ్వాన్స్‌డ్‌.. జయం ఇలా!

ఐఐటీల్లో మరో 500 సీట్లు!

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి సీట్లు పెరిగే అవకాశముంది. గతేడాది (2021–22)లో 16,232 సీట్లు ఉండగా, ఈసారి మరో 500 సీట్లు పెరగవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ వెలువడే నాటికి వీటిని జాబితాలో చేరుస్తారని చెబుతున్నాయి. ప్రప్రంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐఐటీలు కొత్త కోర్సుల వైపు అడుగులేస్తున్నాయి. పాఠ్యప్రణాళికలోనూ మార్పులు తెస్తున్నాయి. డిమాండ్‌ ఉన్న, పారిశ్రామిక అవసరాలు తీర్చగలిగే కోర్సులను విద్యార్థుల ముందుకు తెస్తున్నాయి. ఈ క్రమంలో ఐఐటీలు కొన్ని కొత్త కోర్సులను డిజైన్‌ చేశాయి. హైదరాబాద్‌ ఐఐటీలో బీటెక్‌ బయోటెక్నాలజీ అండ్‌ బయో ఇన్‌ఫర్మేటిక్స్, కంప్యూటేషన్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ కెమెస్ట్రీ కోర్సులను గతేడాది కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది కూడా మరికొన్ని పరిశోధనాత్మక ప్రాధాన్యం ఉన్న కోర్సుల వైపు అడుగులు వేస్తున్నారు. స్టాటిస్టిక్స్‌ అండ్‌ డేటా సైన్స్, మెడికల్‌ అనుబంధ సాంకేతిక కోర్సుల వైపు ఐఐటీలు మొగ్గు చూపుతున్నాయి. త్వరలో వీటికి అనుమతి వస్తుందని భావిస్తున్నాయి. మరోవైపు ఇతర ప్రాంతాల్లోని ఐఐటీలు కూడా కొత్త కోర్సులను ముందుకు తెస్తున్నాయి. ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక సంస్థలు కూడా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్‌ కోర్సులకు రూపకల్పన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఐఐటీల్లోనే ఈసారి 500 సీట్లు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ ఐఐటీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Published date : 20 Jun 2022 03:38PM

Photo Stories