యువత కోసమే శిక్షణా కేంద్రాలు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
Sakshi Education
యాదగిరిగుట్ట: నిరుద్యోగ యువతకు తగిన నైపుణ్యాలు అందించడమే కాకుండా జంట నగరాల్లో పనిచేస్తున్న సెట్విన్ లాంటి శిక్షణా కేంద్రాల్లో ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని టూరిజం, యువజన సర్వీసులు, ఎకై ్సజ్, పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునితా మహేందర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పాత జిల్లాలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 22 కోర్సులు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ప్రదానంగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సులు, ఎయిర్ కండిషనింగ్, మొబైల్ సర్వీసింగ్, సీసీ టీవీ, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్, సోలార్ టెక్నిషియన్ వంటి తదితర కోర్సులు ఉంటాయన్నారు. మొదటి దశలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి రూ.25 లక్షల వ్యయంతో యాదగిరిగుట్టలో 5 వృత్తులతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. యాదాద్రికి దగ్గర్లో ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్ వద్ద మరింత అభివృద్ధికి ఆ ప్రాంతంలో 90 ఎకరాల భూమిని సేకరించినట్లు చెప్పారు. ఇక్కడి ప్రాంతం టూరిజం స్పాట్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే బస్వాపూర్ వద్ద ఎలాంటి అభివృద్ధి చేయాలనే అంశాలపై సీఎం కేసీఆర్, పర్యాటక శాఖ అధికారులతో చర్చిస్తారని తెలిపారు.
Published date : 30 Oct 2019 05:49PM