ఉచితంగా ఎంసెట్, నీట్ కోచింగ్
Sakshi Education
దేవరాపల్లి (మాడుగుల): ఆంధ్రప్రదేశ్‌లోని 30 ప్రభుత్వ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నారాయణ విద్యాసంస్థల సహకారంతో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కోచింగ్ సెంటర్లను ప్రారంభించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ బి.ఉదయలక్ష్మి తెలిపారు.
ఈ సెంటర్లలో విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్, నీట్ కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అక్టోబర్ 4న విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో నన్నయ వర్సిటీ వీసీ ముర్రు ముత్యాలనాయుడు ఏర్పాటు చేసిన అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉయలక్ష్మి విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించేందుకు ఈ ఏడాది నుంచి ప్రతి కళాశాలకు డిజిటల్ తరగతి గది మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో 3,109 కాలేజీలుండగా వీటిల్లో 450 ప్రభుత్వ కళాశాలని, మిగిలినవి సోషల్, బీసీ వెల్ఫేర్, ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. వీటి పరిధిలో ఏటా 10.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామన్నారు. 450 ప్రభుత్వ కళాశాలల్లో 1.50 లక్షల మంది విద్యార్థులకు మిడ్డే మీల్స్ కింద ఏడాదికి రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఆమె వివరించారు. రాష్ట్రంలో 43 కాలేజీలకు రూ.32 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు.
Published date : 05 Oct 2018 01:54PM