Skip to main content

తెలంగాణలో మార్చి ఆరంభంలోనే ‘ఇంటర్’ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి మొదట్లోనే ఇంటర్మీడియెట్ పరీక్షలను ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లను వేగవంతం చేసింది.
ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటికి సంబంధించిన శిక్షణలు, జవాబు పత్రాల రూపకల్పన, డాటా ప్రాసెసింగ్ ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే టెండర్లు పిలిచిన ఇంటర్మీడియట్ బోర్డు మరో రెండు రోజుల్లో వాటిని ఖరారు చేయనుంది. ప్రశ్నపత్రాల్లోనూ ఎలాంటి తప్పులు దొర్లకుండా, నిబంధనలు, బ్లూప్రింట్ మేరకు ప్రశ్నల సరళి ఉండే విధానంపై పేపర్ సెట్టింగ్‌లో పాల్గొనే లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణను ప్రారంభించింది. బ్లూప్రింట్ ప్రకారం 40 శాతం సులభ ప్రశ్నలు, 30 శాతం విద్యార్థి ఇంటలీజెన్స్ పరీక్షించే ప్రశ్నలు, మరో 30 శాతం విద్యార్థి అప్లికేషన్ వైఖరిని ప్రశ్నించేలా ప్రశ్నల రూపకల్పన పక్కాగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల బుక్‌లెట్‌లో 23 పేజీలు ఉండగా, వాటిని గణితం సబ్జెక్టుకు సంబంధించి 27కు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. 23 పేజీల జవాబు పత్రాల బుక్‌లెట్ గణితం పరీక్షకు సరిపోవడం లేదని విద్యార్థులు చెప్పడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఆలస్య రుసుముతోనూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు బుధవారంతో ముగిసింది. దీంతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు లెక్క కూడా దాదాపు ఖరారయ్యింది. ఈ విద్యా సంవత్సరంలో 4,91,165 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో చేరారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి అదనంగా 40 వేల ఇంటర్మీడియట్‌లో చేరారు. ఇక ద్వితీయ సంవత్సరంలో మరో 4.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు వచ్చే మార్చిలో దాదాపు 9.5 లక్షల మంది హాజరు కానున్నారు. వారంతా ఫీజు చెల్లించేందుకు వచ్చే నెల 28వ తేదీ వరకు గడువును ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఆలస్య రుసుముతో నవంబర్ 14 వరకు చెల్లించవచ్చని వెల్లడించింది. జేఈఈ, ఎంసెట్‌కు ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా ఇంటర్ పరీక్షలను మరింత ముందుగా నిర్వహించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈసారి ఇంటర్‌తోపాటే పదో తరగతి పరీక్షలను కూడా నిర్వహించనున్న నేపథ్యంలో ఆ దిశగా పరీక్ష కేంద్రాలు గుర్తింపు, పరీక్షల నిర్వహణ సమయాలపై దృష్టి సారించారు. అలాగే ఈసారి పరీక్షలు పూర్తయిన 30 రోజుల్లోనే ఫలితాలు వెల్లడించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published date : 29 Sep 2016 02:43PM

Photo Stories