Inter Practical Exams: సజావుగా సీనియర్ ఇంటర్ ప్రాక్టికల్స్
గుంటూరుఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సర సైన్స్ కోర్సుల విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు (ప్రాక్టికల్స్) ఆదివారం ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 94 కేంద్రాల్లో విద్యార్థులు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా హాజరయ్యారు. నాన్ జంబ్లింగ్ విధానంలో ఏ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అవే కళాశాలల్లోని ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన ప్రాక్టికల్స్ కేంద్రాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు. ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి సీనియర్ అధ్యాపకులను సీఎస్‌లుగా నియమించారు. ప్రాక్టికల్స్ నిర్వహణ, మార్కుల నమోదులో అవకతవకలకు ఆస్కారం లేకుండా ఇంటర్మీడియెట్ బోర్డు నేరుగా నియమించిన ఎగ్జామినర్లు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 24,910 మంది సీనియర్ ఇంటర్ సైన్స్ కోర్సుల విద్యార్థులకు ఈనెల 20వ తేదీ వరకు విడతల వారీగా ప్రాక్టికల్స్ జరగనున్నాయి. వీరిలో 21,817 మంది ఎంపీసీ, 3,093 బైపీసీ విద్యార్థులున్నారు.
విజయవంతంగా ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు
ప్రాక్టికల్స్ చేసిన విద్యార్థుల ఆన్సర్ షీట్లకు ఆయా కళాశాలల వారీగా స్పాట్‌లోనే వాల్యూయేషన్ చేయడంతోపాటు విద్యార్థుల మార్కుల్ని అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానం విజయవంతమైంది. గతేడాది వరకు ఓఎంఆర్, బార్ కోడింగ్ పద్ధతిలో మాన్యువల్‌గా నిర్వహించిన మార్కుల నమోదు విధానాన్ని ప్రస్తుత ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోకి మార్పులు చేసిన ప్రభుత్వం, తొలిసారిగా అమలు చేసింది. ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా ప్రాక్టికల్స్‌కు హాజరైన విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ షీట్లను స్పాట్‌లోనే వాల్యూయేషన్ చేసిన ఎగ్జామినర్లు మార్కులను ఇంటర్మీడియెట్ బోర్డు సైట్‌లో నమోదు చేశారు. ప్రాక్టికల్స్ కేంద్రాల్లో ఆర్‌ఐవో జీకే జుబేర్‌తోపాటు డీఈసీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరుగుతున్న తీరును ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల ద్వారా గుంటూరులోని ఆర్‌ఐవో కార్యాలయంతో పాటు విజయవాడలోని ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి అధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. కేంద్రాల్లో విద్యార్థులతోపాటు సీఎస్, ఎగ్జామినర్లు, ఇతర సిబ్బంది కదలికల్ని నేరుగా పర్యవేక్షించారు.
ప్రాక్టికల్స్‌కు హాజరైన 7,911 మంది
ఆదివారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన ప్రాక్టికల్స్‌కు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 94 కేంద్రాల పరిధిలో 7,911 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో సీనియర్ ఇంటర్ సైన్స్ ప్రాక్టికల్స్‌కు కేటాయించిన 7,408 మంది విద్యార్థుల్లో 7,263, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు కేటాయించిన 757 మందికి 648 మంది చొప్పున హాజరయ్యారు.