Inter Exams: చేతి రాతతో ప్రశ్నపత్రం.. అర్థంకాక తికమక
- ఇంటర్ పరీక్షల్లో మరో గందరగోళం
- హిందీ మీడియంలో ప్రింట్ కాని పేపర్లు... అరగంటలో అనువాదకులతో తర్జుమా
- రాత అర్థంకాక సరిగా రాయలేక పోయామన్న విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంటరీ్మడియెట్ పరీక్షల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. ఇటీవల కోదాడలో ఫస్టియర్ ఇంగ్లిష్ పేపర్‌కు బదులు కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు రాగా, తాజాగా హిందీ మీడియం విద్యార్థులకు బోర్డ్ చుక్కలు చూపింది. బుధవారం ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. కొంతమంది విద్యార్థులు హిందీ మీడియంలో పరీక్ష రాస్తున్నారు. అయితే, ఈ ప్రశ్నపత్రాన్ని బోర్డ్ హిందీ భాషలో ప్రింట్ చేయించకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఇంగ్లిష్ మాధ్యమంలో పరీక్ష కేంద్రానికి పంపే ప్రశ్నపత్రాన్నే హిందీలో తర్జుమా చేసి, విద్యార్థులకు ఇవ్వాలని బోర్డ్ ఆదేశించింది. అనువాదకులను పరీక్ష కేంద్రం వాళ్లే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేసింది. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ కాలేజీ, నిజామాబాద్‌లోని మరో కేంద్రంలో హిందీ మీడియం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి ముందు అనువాదకులను పిలిపించి వాళ్లతో ప్రశ్నపత్రం తర్జుమా చేయించి విద్యార్థులకు ఇచ్చారు. దీంతో పరీక్ష ఆలస్యమైంది. ఇదిలాఉంటే, అనువాదకుల చేతిరాత అర్థం కాక, విద్యార్థులు తిప్పలు పడ్డారు. ఆ రాతను అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని అంబేడ్కర్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పారు. అర్థం కాని విషయాలను అడిగే అవకాశం కూడా చిక్కలేదన్నారు. ఈ కారణంగా పొలిటికల్ సైన్స్ పరీక్ష సరిగా రాయలేకపోయామని వాపోయారు.
Also read: SSC Recruitment 2022: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 1920 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఎందుకీ పరిస్థితి?
గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఎదురవ్వలేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. బోర్డ్ పరిధిలో హిందీ అనువాదకులు లేరని, ఉన్నవాళ్లంతా రిటైరయ్యారని, అందుకే కాలేజీ వాళ్లనే ఏర్పాటు చేసుకోమన్నట్టు చెబుతున్నారు. అనువాదం కోసం బయట వ్యక్తులను పిలిస్తే, పేపర్ లీక్ చేసే ప్రమాదం ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమరి్థంచుకుంటున్నారు. దీన్ని బోర్డ్‌లోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాలేజీల్లో హిందీ మీడియంలో బోధన సాగుతున్నప్పుడు అధ్యాపకులు ఎందుకు ఉండరని ప్రశి్నస్తున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. 8.30 గంటలకు ప్రశ్నపత్రం బండిల్ విప్పుతారు. అంటే అరగంటలో అనువాదకుడు ఇంగ్లిష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయాలి. నెలల తరబడి ప్రింట్ చేస్తున్న పేపర్లలోనే తప్పులు వస్తుంటే, అరగంటలో ట్రాన్స్‌లేట్ చేస్తే వచ్చే తప్పుల మాట ఏంటని వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. హిందీ మాధ్యమంలో బోధించే అధ్యాపకులతో ముందే అనువాదం చేయించి ప్రశ్నపత్రం ప్రింట్ చేయించి ఉండాల్సిందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేకుండా బోర్డ్ వ్యవహరిస్తోందనే విమర్శలు సర్వత్రా విని్పస్తున్నాయి.
Also read: Israeli–Palestinian Conflict: కాల్చివేతకు గురైన అల్ జజీరా మహిళా జర్నలిస్టు?
ఇంత నిర్లక్ష్యమా: మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్)
హిందీ మాధ్యమంలో ప్రశ్నపత్రాలు ప్రింట్ చేయించకుండా, విద్యార్థులను గందరగోళంలో పడేయడం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యానికి నిదర్శనం. పరీక్షల విభాగం కొంతమంది పైరవీకారుల చేతుల్లో ఇరుక్కుపోవడం వల్ల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. బోర్డ్ ప్రయత్నం చేస్తే హిందీ అనువాదకులు ఎందుకు దొరకరు. అప్పటికప్పుడు తర్జుమా చేయించడం వల్ల తప్పులు దొర్లితే దానికి ఎవరు బాధ్యత వహించాలి.
Also read: 2, 000 Jobs: వర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీకి ఆమోదం
లెక్చరర్లు లేకనే : ఇంటర్ బోర్డ్
లెక్చరర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ప్రశ్నప్రతాలను ప్రింట్ చేయించడం సాధ్యం కాలేదని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం రాత్రి వివరణ ఇచ్చారు. గతంలో అనువాదం కోసం బోర్డ్ హిందీ మాధ్యమానికి చెందిన రిటైర్డ్ రెగ్యులర్ లెక్చరర్ల సేవలను పొందేదని, కోవిడ్ కారణంగా పాత లెక్చరర్లు అందుబాటులో లేరని, గోప్యమైన విషయం కాబట్టి ఈ పనిని వేరే వాళ్లకు అప్పగించలేమని చెప్పారు. హిందీ మాధ్యమంలో పరీక్ష రాసే విద్యార్థులు ఫస్టియర్‌లో 32 మంది, సెకండియర్‌లో 24 మందే ఉన్నారన్నారు. అందువల్లే అందుబాటులో ఉన్న అనువాదకుల సేవలు వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్స్‌కు చెప్పినట్టు తెలిపారు.
Also read: Supreme Court: ఏ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది?