Skip to main content

Supreme Court: ఏ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది?

Supreme Court

బ్రిటిష్‌ జమానా నాటి దేశద్రోహం చట్టం(సెక్షన్‌ 124ఏ) విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. చట్టం అమలుపై మే 11న స్టే విధించింది. కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేదాకా ఈ చట్టం కింద కొత్తగా కేసులు నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసుల విచారణ కూడా నిలిపేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తమ తదుపరి ఉత్తర్వుల దాకా కొనసాగుతాయని పేర్కొంది. 124ఏ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని వ్యాఖ్యానించింది. దీనిపై జూలై మూడో వారంలో తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీ కూడా ఉన్నారు.

GK Important Dates Quiz: ప్రపంచవ్యాప్తంగా ఏ రోజును అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు?

ఒక చట్టం... వేల వివాదాలు 
సెక్షన్‌ 124 ఏలో ఏముంది?

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్‌ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు.

ఎందుకు తెచ్చారు?
స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్‌ థామస్‌ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్‌ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్‌ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్‌ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్‌ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్‌ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి.

2015–20 మధ్య 356 కేసులు..

  • 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్‌ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి.
  • ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది.
  • 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి.
  • కేంద్రంలో ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి.​​​​​​​

Tomato Flu: దేశంలోని ఏ రాష్ట్రంలో టమాటో ఫ్లూ వైరస్‌ను గుర్తించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
బ్రిటిష్‌ జమానా నాటి దేశద్రోహం చట్టం(సెక్షన్‌ 124ఏ) అమలుపై స్టే విధింపు
ఎప్పుడు : మే 11
ఎవరు    : సుప్రీంకోర్టు
ఎందుకు : సెక్షన్‌ 124ఏ ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 May 2022 02:21PM

Photo Stories