నోటిఫికేషన్ రాకుండానే ఇంటర్ అడ్మిషన్లా? గుర్తింపు రద్దు చేస్తాం జాగ్రత్త!!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి అనధికారికంగా అడ్మిషన్లు చేసినట్టు తమ దృష్టికొచ్చిందని, అలాంటి చేరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ బోర్డు ఈ విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ఆన్‌లైన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయితే అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల కాకుండానే, ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలు కాకుండానే కొంతమంది విద్యార్థులు కొన్ని కాలేజీల్లో అడ్మిషన్లు పొంది.. ఫీజులు కూడా చెల్లించినట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఆ అడ్మిషన్లు చెల్లుబాటు కావని, విద్యార్థులు చెల్లించిన ఫీజులను ఆయా కాలేజీలు వెంటనే వాపసు ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలాంటి కాలేజీలను ఆర్‌ఐవో(రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్)లు గుర్తించి, గుర్తింపు రద్దుతో సహా, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఆదేశించారు.
Published date : 05 Aug 2021 03:26PM