Skip to main content

నేటి నుంచి ఏపీలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్లో ప్రవేశాలు జరగనున్నాయి.
ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, కోఆపరేటివ్, ఏపీ రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ గురుకుల, గిరిజన సంక్షేమ గురుకుల, ఇన్సెంటివ్, ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలలోని జనరల్, వొకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు మొదటి సంవత్సరంలోకి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల విక్రయం నేటి నుంచి ప్రారంభం కానుంది.

పరిశీలనకు మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవాలి..
టెన్త్ క్లాస్‌కు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లతో పాటు ఎస్సెస్సీ బోర్డు ఇంటర్నెట్ ద్వారా జారీచేసే మార్కుల షార్ట్ మెమోల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని రామకృష్ణ సూచించారు. విద్యార్థుల ఒరిజినల్ ఎస్సెస్సీ సర్టిఫికెట్, కేస్ట్ సర్టిఫికెట్‌తో సహా అన్ని సర్టిఫికెట్లను కేవలం పరిశీలనకు మాత్రమే తీసుకోవాలని, పరిశీలన అనంతరం వాటిని తిరిగి విద్యార్థులకు ఇచ్చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను తమ దగ్గర ఉంచుకుంటే యాజమాన్యాలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. దరఖాస్తు ఖరీదు జనరల్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదన్నారు. కాగా, తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ చదివిన వారికి ఏపీలో సెకండియర్‌లోకి ప్రవేశాలు నిర్వహించరాదని బోర్డు కార్యదర్శి చెప్పారు.

జూనియర్ ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్..
దరఖాస్తుల విక్రయం:
గురువారం (నేటి నుంచి)
దరఖాస్తుల స్వీకరణ గడువు: జనవరి 17 వరకు
అడ్మిషన్ల పూర్తి: జనవరి 17
తరగతుల ప్రారంభం: జనవరి 18
Published date : 07 Jan 2021 06:20PM

Photo Stories