ఇంటర్‌తో సంబంధం లేకుండా ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, ఇతర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్‌సడ్ పరీక్షల స్కోర్ (ర్యాంకు) ఆధారంగానే భవిష్యత్తులో ప్రవేశాలు చేపట్టాలని ఐఐటీల కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలిసింది. వీలైతే 2018-19 విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ప్రవేశాల విధానంలో మార్పులు తెచ్చిన ఐఐటీ కౌన్సిల్ మరిన్ని మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ స్కోర్‌తో పాటు జేఈఈ తుది ర్యాంకు ఖరారు చేయడంలో ఇంటర్ మార్కులకు ఉన్న 40 శాతం వెయిటేజీని ఇప్పటికే రద్దు చేసింది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్‌సడ్ ర్యాంకుతోపాటు టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధనను కూడా తొలగించింది. ఎన్‌ఐటీలు అయినా, ఐఐటీలు అయినా విద్యార్థి ఆయా ప్రవేశ పరీక్షల ర్యాంకుతోపాటు ఇంటర్మీడియట్‌లో 75 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 65 శాతం) మార్కులు ఉంటేచాలని నిర్ణయించింది. 2017-18 విద్యా సంవత్సరంలో దీని ఆధారంగానే ప్రవేశాలు చేపట్టనుంది. అయితే భవిష్యత్తులో అసలు ఇంటర్మీడియట్ మార్కులతో సంబంధమే లేకుండా, కేవలం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగానే ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు చేపట్టేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
Published date : 30 Nov 2016 03:33PM