ఇంటర్ ఫలితాలపై వాట్సాప్ వార్తలను నమ్మొద్దు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 8న విడుదలవుతాయంటూ ఇంటర్ బోర్డు పేరిట వాట్సాప్‌లో నకిలీ ప్రెస్‌నోట్ చక్కర్లు కొడుతుండటాన్ని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు.
తన పేరుతోపాటు బోర్డు పరీక్షల నియంత్రణ విభాగం రిటైర్డ్ అధికారి సుశీల్‌కుమార్ సంతకం, రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు లోగోలతో నకిలీ ప్రెస్‌నోట్ తయారు చేసి వాట్సాప్‌లో పెట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని బోర్డు కార్యదర్శిని జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని, నకిలీ ప్రెస్‌నోట్‌ను సర్క్యులేట్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని కార్యదర్శికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు బోర్డు కార్యదర్శి ఈ వ్యవహారంపై ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల తేదీపై తాముకానీ లేదా మంత్రి పేషీ కానీ ఎలాంటి ప్రెస్‌నోట్ విడుదల చేయలేదని వివరణ ఇచ్చారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఇంకా కొనసాగుతోందని, ఈ ప్రక్రియ ట్యాబ్యులేషన్ పనులు చేయాల్సి ఉందన్నారు. అవన్నీ పూర్తయ్యాక ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించారు.
Published date : 05 Apr 2019 02:21PM