Skip to main content

ఇంటర్ ‘అడ్వాన్స్‌డ్’ ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య గురువారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 4,72,441 మంది విద్యార్థులు హాజరు కాగా.. 2,69,862 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెమోలను ఈ నెల 29లోగా సంబంధిత రీజినల్ ఇన్‌స్పెక్షన్ అధికారుల నుంచి ప్రిన్సిపాళ్లు తీసుకె ళ్లాలని రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. ఆ మెమోలను వీలైనంత త్వరగా విద్యార్థులకు అందజేయాలని, మెమోల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే విద్యార్థులు జూలై 23లోగా సంబంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని సూచించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం విద్యార్థులు ఈ నెల 30లోగా ఫీజు చెల్లించి, tsbie.cgg.gov.inవెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, స్కాన్డ్ కాపీ కమ్ రీవెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 600 చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల ఉత్తీర్ణతే అత్యధికం
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ పరీక్షలకు 3,02,340 మంది విద్యార్థులు హాజరుకాగా 1,99,139(66%) మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 1,44,475 మంది కాగా, 1,02,375(71%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,57,865 మంది పరీక్షలకు హాజరు కాగా 96,764(61%) మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 1,50,609 మంది హాజరు కాగా 61,438(41%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 60,985 మంది హాజరు కాగా 27,667(45%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 89,624 మంది పరీక్షలు రాయగా 33,771(38%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలకు 11,419 మంది హాజరు కాగా 5,152(45%) మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ ఒకేషనల్ పరీక్షలకు 8,073 మంది హాజరు కాగా 4,133(51%) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్ విద్యలో సంస్కరణలు: రంజీవ్ ఆర్ ఆచార్య:
ఇంటర్ విద్యలో, పరీక్షలు, బోర్డు సేవల్లో అనేక సంస్కరణలు తేవడంతోపాటు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు రంజీవ్ ఆర్ ఆచార్య వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయకుండా ఉండేందుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా 798 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటిసారిగా ప్రాక్టికల్ మార్కులను కూడా ఆన్‌లైన్ ద్వారా బోర్డుకు తెప్పించామన్నారు. ఎగ్జామినర్ పరీక్ష హాల్లో మార్కులు వేసిన వెంటనే బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. పరీక్షలకు గైర్హాజరైన వారి వివరాలు కూడా ఆన్‌లైన్‌లో పరీక్ష కేంద్రం నుంచి బోర్డుకు తె ప్పించామన్నారు. 12 స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Published date : 24 Jun 2016 02:50PM

Photo Stories