English language skills: ఆంగ్లభాషా నైపుణ్యం పెంచేలా..
విద్యార్థుల ఉత్తీర్ణతకు కొలమానం
విద్యార్థులు ఆంగ్ల భాషపై మరింత పట్టు సాధించేందుకు ఈ ఏడాది ఆంగ్ల సబ్జెక్టుపై ప్రయోగ పరీక్ష నిర్వహిస్తున్నాం. విద్యార్థుల ఉత్తీర్ణతకు ఇది కొలమానం కానుంది. విద్యార్థులు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా ప్రయోగ పరీక్షకు హాజరుకావాలి.
– జానపాటి కృష్ణయ్య, డీఐఈఓ, సూర్యాపేట
హుజూర్‌నగర్: ఇంటర్మీడియట్ స్థాయిలోనే విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యం పెంచి ఆంగ్ల భాషపై మరింత పట్టు సాధించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఏడాది నుంచి ఆంగ్లంలో ప్రయోగ పరీక్షల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు అందరూ తప్పకుండా ఈ పరీక్షకు హాజరు కావాల్సింటుంది. మొత్తంగా 80 మార్కులు థియరీకి, ప్రయోగ పరీక్షకు 20 మార్కులు కేటాయించారు. నాలుగు దశల్లో నిర్వహించే ప్రయోగ పరీక్షలో 20 మార్కులకు గాను కనీసం 7 మార్కులు వస్తేనే వారు ఉత్తీర్ణులు అవుతారు. గైర్జాజరైన విద్యార్థులను ఫెయిల్ అయినట్టుగా పరిగణిస్తారు.
నాలుగు దశల్లో నిర్వహణ
విద్యార్థులకు ఆంగ్ల భాషపై ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో మొదటిది కమ్యూనికేటీవ్ ఫంక్షన్స్ దీనిలో ఏదైనా ఒక అంశంపై ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు సంభాషీంచుకునే తీరును అధ్యాపకులు పరీక్షిస్తారు. రెండోది జస్ట్ ఎ మినిట్ (జామ్) పేరిట ఒక ఆంశంపై విద్యార్థులు నిమిషం లోపు అనర్గళంగా మాట్లాడాల్సి ఉంటుంది. మూడోది రోల్‌ప్లే దీనిలో తల్లిదండ్రులు లేదా మరేదైనా అంశంపై విద్యార్థులు బృందంగా చర్చించాలి. ఇక చివరిదైన నాలుగో పరీక్షలో లిజనింగ్ కాంప్రహెన్షన్ పేరిట గ్రహించే శక్తి పెంపొందించడంపై విద్యార్థులను అధ్యాపకులు పరీక్షిస్తారు.
16న చివరి ప్రయోగ పరీక్ష
ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు విడతల్లో ప్రయోగ పరీక్షలు జరిగాయి. చివరి పరీక్ష ఈనెల 16న నిర్వహించనున్నారు. దీని కోసం అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ప్రయోగ పరీక్షలకు హాజరుకాని వారు కూడా నాలుగో విడతలో పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.
19న పర్యావరణ విద్య టెస్టు
ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పర్యావరణ విద్య పరీక్షకు సన్నద్ధం చేయిస్తున్నారు. కొత్తగా ఆంగ్లంలో ప్రయోగ పరీక్ష ఉండడంతో రెగ్యులర్ విద్యార్థులకు నైతికత–మానవ విలువలు అనే ఆంశంపై పరీక్ష నిర్వహించడం లేదు. గతంలో ఫెయిలైన వారికి మాత్రమే ఈ నెల 17న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 19న నిర్వహించే పర్యావరణ విద్య పరీక్ష ను రెగ్యులర్ విద్యార్థులంతా రాయాల్సి ఉంటుంది.