Skip to main content

ఏపీ ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు: సెక్షన్కు 88 సీట్లు.. కాలేజీకి గరిష్టంగా 9 సెక్షన్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ 2021 – 22 ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ విధానాన్ని బోర్డు అమల్లోకి తెస్తోంది.
మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో ఆశించిన సీటును దక్కించుకునేలా ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకుంటోంది. కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా సీటు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆన్‌లైన్‌ విధానాన్ని గత ఏడాది అమల్లోకి తెచ్చిన బోర్డు దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించడం తెలిసిందే. 3 లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తులు కూడా సమర్పించారు. అయితే న్యాయస్థానం ఆదేశాలతో అప్పట్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్లు చేపట్టేందుకు కోర్టు అనుమతించడంతో బోర్డు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

అనుమతులు, ప్రవేశాలు ఆన్‌లైన్‌లోనే..
ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు వీలుగా ఇంటర్‌ బోర్డు కాలేజీలకు అనుమతుల ప్రక్రియలో పలు సంస్కరణలు చేపట్టింది. కొత్త కాలేజీలకు అనుమతులు, రెన్యువల్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి కాలేజీలో నిర్వహించే కోర్సులు, సెక్షన్ల వారీగా ఎన్ని తరగతి గదులు ఉండాలి? ఒక్కో గది వైశాల్యం తదితరాలపై ప్రమాణాలు నిర్దేశించింది. గదులతో సహా భవనాల ఫొటోలను కాలేజీల యాజమాన్యాలు బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకుంది. ఆ ఫొటోలను కాలేజీలవారీగా విద్యార్థులు, తల్లిదండ్రులు పరిశీలించేలా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాలేజీలో ఏ కోర్సులున్నాయి? ఎంతమంది సిబ్బంది ఉన్నారు? లాంటి వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. వీటి ఆధారంగా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అయితే సెక్షన్‌కు 40 మందిని మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను న్యాయస్థానం నిలిపివేయడంతో ఈ ఏడాది పాత జీవో ప్రకారం సెక్షన్‌కు 88 మంది విద్యార్థుల చొప్పున గరిష్టంగా 9 సెక్షన్లుండేలా కాలేజీలకు సీట్లు కేటాయింపు చేయనున్నారు.

సర్టిఫికెట్లను సమర్పించే పనిలేదు..
పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజును సంబంధిత కాలేజీకి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించాలి. అయితే ఫీజులకు సంబంధించి కమిషన్‌ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త విధానం వల్ల విద్యార్థి తన సర్టిఫికెట్లను కాలేజీలో సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌ దరఖాస్తులోనే సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసుకుని ఇంటర్‌ బోర్డు పరిశీలన చేసి సీట్లు కేటాయిస్తున్నందున విద్యార్థి ఒరిజినల్‌ ధ్రువపత్రాలను కాలేజీలకు సమర్పించాల్సిన అవసరం ఉండదు.

రిజర్వేషన్లు పక్కాగా అమలు..
ఆన్‌లైన్‌ అడ్మిషన్లతో ప్రైవేట్‌ కాలేజీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, క్రీడాకారులు, బాలికలకు సంబంధించిన కోటా సీట్లు ఆయా విభాగాల వారితోనే భర్తీ కానున్నాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను పక్కాగా రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం చొప్పున ఇవ్వాలి. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలి.

అభిప్రాయాలు తెలుసుకున్న బోర్డు కార్యదర్శి
ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో అడ్మిషన్లను చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లతో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ బుధవారం జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. 13 జిల్లాల నుంచి అందిన సూచనలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరిస్తూ ఆన్‌లైన్‌ విధానంలో అవసరమైన మార్పులు చేస్తామని వారికి వివరించారు. నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే కొన్ని ప్రైవేట్‌ కాలేజీలు నిర్వహించిన అడ్మిషన్లు చెల్లుబాటు కావని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు.

తిరగాల్సిన అవసరం లేకుండా..
ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం ద్వారా విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు పలు వెసులుబాట్లు కల్పించింది. గతంలో మాదిరిగా కాలేజీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బోర్డు ఏర్పాటు చేసిన పోర్టల్‌లో లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా టెన్త్ హాల్‌ టికెట్‌ నెంబర్, పాసైన సంవత్సరం, బోర్డు పేరు, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్‌ నెంబర్, మెయిల్‌ ఐడీ, పుట్టిన తేదీ, చదివిన స్కూలు, కులం, ఆధార్‌ నంబర్‌ తదితర వివరాలతో తొలుత రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్‌ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలు, కాలేజీ, మాధ్యమాల వారీగా కోర్సులతో కూడిన వివరాలు పోర్టల్‌లో తెలుసుకోవచ్చు. తమకు నచ్చిన కోర్సు, కాలేజీని ఎంపిక చేసుకుని ప్రాధాన్యత క్రమంలో విద్యార్థి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. రిజర్వేషన్లు, టెన్త్ మెరిట్‌ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లను బోర్డు కేటాయిస్తుంది.
Published date : 05 Aug 2021 03:26PM

Photo Stories