Skip to main content

సామాజిక నిర్మితి - ముఖ్య లక్షణాలు

సాంఘిక శాస్త్రాలకు సమాజ శాస్త్రం ఆధారం. మానవుడు పట్టుకతో సంఘజీవి. సమాజం అవసరం లేకుండా మానవుడు మనుగడ సాగించలేడని రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రతి సమాజానికీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక సమాజాన్ని మరో సమాజంతో పోల్చి, తులనాత్మక అధ్యయనం చేయటం వల్ల ఆ సమాజాల మధ్య తారతమ్యాలు తెలుస్తాయి. భారత సమాజంలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన అంశాలు పాశ్చాత్య సమాజాల కంటే భిన్నంగా ఉన్నాయి. మతాలు, జాతులు, భాషలు, కులాలు, తెగల్లో అంతర్గత ప్రత్యేకతలను స్పష్టంగా గుర్తించవచ్చు. ఇంత వైవిధ్యం ఉన్నా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప సామాజిక నిర్మితి భారత సమాజంలో ఉంది.
సామాజిక శాస్త్ర అధ్యయనంలో సామాజిక నిర్మితి ఒక ముఖ్యాంశం. సామాజిక జీవనంలో వ్యక్తుల పరస్పర చర్యల వల్ల సంబంధాలు ఏర్పడతాయి. ఈ అల్లికను సామాజిక నిర్మితిగా చెప్పొచ్చు. సమాజం సొంతంగా నిర్మాణం చేసుకుంటుంది. వ్యక్తులు మారినప్పటికీ సమాజ నిర్మితి కొనసాగుతోంది. వ్యక్తులు తమ సామాజిక అవసరాల కోసం అనేక సంస్థలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ సంస్థలు సామూహిక జీవితానికి అనివార్యం. వ్యక్తులు, సంస్థల విశిష్ట అమరికను నిర్మితి అంటారు. అలాంటి విభిన్న సంస్థల సమగ్ర నిర్మితిని సమాజ నిర్మితిగా చెప్పొచ్చు.

వైవిధ్యానికి కారణాలు

ఒక సమాజంలో ప్రజల జీవన విధానం, ఆచార అలవాట్లు, సంప్రదాయం,కట్టుబొట్లు..వారు నివసించే భౌగోళిక వాతావారణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితులు భారతదేశంలోని వైవిధ్యానికి కారణాలుగా చెప్పొచ్చు.

సహజ మండలాలు
భారత భౌగోళిక పరిస్థితులు భారతదేశాన్ని విలక్షణమైన సహజ మండలాలుగా విభజిస్తున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులు, వింధ్య పర్వతాలు, దక్కన్ పీఠభూమి చారిత్రకంగా, సాంస్కృతికంగా విశిష్టమైనవి. భారతదేశం అనేక జీవనదులకు పుట్టినిల్లు. దేశంలోని అనేక మైదానాలను కేంద్రాలుగా చేసుకొని, ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. దీనివల్ల సాంస్కృతిక, సారస్వత రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఈ నేపథ్యం భారత సమాజంపై అవగాహన పెంపొందించుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది.

విభిన్న సామాజిక నిర్మితి- భౌగోళిక వైవిధ్యం
భారత సమాజ విశిష్ట లక్షణం భిన్నత్వం. దీనికి ప్రధాన కారణం భౌగోళిక వైవిధ్యం. దేశంలోని అన్ని పాంతాల్లో శీతోష్ణస్థితి, వాతావరణం, నదులు, వర్షపాతం వంటివి ఒకే విధంగా లేవు. దీనివల్ల భారత సమాజంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానంలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. సామాజిక నిర్మితి భిన్నంగా ఉంటుంది.

విభిన్న మతాలు
భారత సమాజం విభిన్న మతాలకు నిలయం. దేశంలో హిందువులు (79.8%- 96.63 కోట్లు), ముస్లింలు (14.2% - 17.22 కోట్లు), క్రైస్తవులు (2.3%-2.78 కోట్లు), సిక్కులు (1.7%-2.08 కోట్లు), బౌద్ధులు (0.7%- 0.84 కోట్లు), జైనులు (0.4%- 0.45 కోట్లు), ఇతర మతాల వారు ఉన్నారు. ప్రజల సామాజిక జీవన విధానం, విశ్వాసాలు, అలవాట్లు చాలా వరకు మత ప్రాతిపదికగా ఉంటాయి. ప్రతి మతానికి పవిత్ర గ్రంథం, ప్రత్యేక ఆరాధన పద్ధతులున్నాయి. రాజ్యాంగం భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా గుర్తించినప్పటికీ ప్రజల జీవన విధానంలో మతం ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది.

కుల వ్యవస్థ

వర్ణం అనగా రంగు అని అర్థం, చారిత్రకంగా ఆర్యులు తెల్లగా, అందంగా ఉండేవారు. అనార్యులు/ద్రవిడులు నల్లగా, పొట్టిగా ఉండేవారు. రుగ్వేదంలో పదో మండలంలోని పురుష సూక్తం చాతుర్వర్ణ వ్యవస్థను పేర్కొంది. వారు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సూద్రులు. తర్వాత వచ్చిన అనేక పరిణామాల కారణంగా కులాలు ఏర్పడ్డాయి. ఇవి ఎక్కువగా వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. కులాంతర వివాహాలు, వృత్తుల మార్పునకు అవకాశం లేకుండా కుల వ్యవస్థ జఠిలంగా తయారవుతూ వచ్చింది. ప్రయాణ సౌకర్యాలు, భావ ప్రసార సౌకర్యాలు, నాగరికత, పాశ్చాత్యీకరణ, పారిశ్రామికీకరణ, అంతర్జాతీయ ప్రభావం, ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వ్యవస్థ అనేక మార్పులకు గురవుతోంది.

విభిన్న భాషలు
భారతదేశంలో విభిన్న భాషలున్నాయి. అయితే సంస్కృతం భారతీయుల ఉమ్మడి జాతీయ వారసత్వ భాషగా కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. భారత సమాజంలో దాదాపు 1600 విభిన్న భాషలు మాట్లాడే వారున్నారు. వీటిలో రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. ఇండో ఆర్యన్ భాషలు మాట్లాడే ప్రజలు 73 శాతం, ద్రవిడ భాషను మాట్లాడే వారు 20 శాతం; ఆస్ట్రిక్, యూరోపియన్ భాషలు మాట్లాడేవారు 1.4 శాతం ఉన్నారు. హిందీని జాతీయ భాషగా గుర్తించి, ఆంగ్ల భాషను అధికార భాషగా ఏర్పరిచి భాషాపరమైన సమైక్యత సాధించే ప్రయత్నం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, హిందీని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఉద్యమాలు జరిగాయి. ఇలాంటి ఉద్యమాలు ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలకు దారితీశాయి. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన చేయటం వల్ల ప్రాంతీయతా భాషా చైతన్యం కూడా ఏర్పడింది.

విభిన్న జాతులు
చారిత్రకంగా భారతదేశానికి అనేక జాతులు రావటం వల్ల జాతి వైవిధ్యం అధికంగా కనిపిస్తుంది. ఆర్యులు, కుషాణులు, హుణులు, అరబ్బులు, తరుష్కులు దేశానికి వచ్చి స్థిరపడి, ఇక్కడి సంస్కృతిలో విలీనమయ్యారు. డాక్టర్ వి.ఎ.స్మిత్ అభిప్రాయంలో భారత సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల (Ecological Musium). సమాజంలోని జాతి విభాగాల వారసత్వాన్ని ఆధారంగా చేసుకొని, సామాజిక శాస్త్రవేత్త జి.ఎన్.గుహ భారత జాతులను ఆరు రకాలుగా విభజించాడు. అవి.. నేగ్రిటోలు, ప్రోటో ఆస్ట్రాలాయిడ్లు, మంగోలాయిడ్లు, మెడిటరేనియన్లు, పశ్చిమ బ్రాచీసెఫాల్స్, నార్టిక్‌లు.

విభిన్న సంస్కృతులు
భారత సమాజం విభిన్న సంస్కృతులకు నిలయం. హిందూ, క్రైస్తవం, జైన, బౌద్ధ, ముస్లిం, పారశీక తదితర మతాలు భారతీయ సమాజంలో సమాజ స్థిరీకరణకు కారణమయ్యాయి. హిందువులకు ప్రత్యేక సంస్కృతి ఉంది. వీరు ప్రధానంగా తీర్థయాత్రలు, నదీ స్నానాలు, విగ్రహారాధనలు, క్రతువులు వంటి అనేక ఆచారాలను అనుసరిస్తున్నారు. దేవుడు ఒక్కడే, పర్ధా పద్ధతి, విగ్రహారాధన చేయకపోవటం, వివాహాన్ని సామాజిక ఒడంబడికగా భావించటం మహమ్మదీయుల ప్రత్యేకతలు. క్రైస్తవ సామాజిక వ్యవస్థ.. భక్తి, వినయం, విశ్వాసం, ప్రేమ, అనురాగం వంటి ఉదార అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక భారత సాంస్కృతిక, పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి గురవటం వల్ల భారత సంస్కృతిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఉమ్మడి- వ్యష్టి కుటుంబాలు
ప్రాచీన భారత సమాజంలో ఉమ్మడి కుటుంబం ప్రధాన లక్షణం. ఉమ్మడి కుటుంబం వ్యవస్థలో ఉమ్మడి నివాసం, ఉమ్మడి ఆస్తులు, ఆదాయాలు, అధిక కుటుంబ సభ్యులు వంటివి విశేష అంశాలు. ఈ వ్యవస్థలో కుటుంబ సభ్యులందరికీ సాంఘిక రక్షణ, ఆర్థిక రక్షణ, విలువల పరమైన సౌకర్యాలు సమకూరుతాయి. సహజీవనం, త్యాగం, ప్రేమ, సర్దుబాటు వంటి ఉదార, ధార్మిక లక్షణాలు బలపడతాయి. సాంఘికీకరణ లభిస్తుంది. పారిశ్రామికీకరణ, శ్రమ విభజన, ఆధునిక విద్యా విధానం, వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వటం, వారసత్వ చట్టాలు, సమాచార సాంకేతిక రంగంలో మార్పులు, ప్రపంచీకరణ వంటివి ఉమ్మడి కుటుంబ వ్యవస్థపై ప్రభావం చూపాయి. దీంతో వ్యష్టి కుటుంబాలు ఆవిర్భవించాయి.

గ్రామీణ సమాజం ప్రాధాన్యత
భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉంటుందనేది ఆర్యోక్తి. స్వాతంత్య్రానికి ముందు 80 శాతం ప్రజలు గ్రామాల్లో ఉండేవారు. ప్రస్తుతం 68 శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. గ్రామాలకు దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వ్యవసాయం ప్రధాన వృత్తిగా గ్రామీణ వ్యవస్థ స్వయం సమృద్ధి, స్వయం పాలనా అధికారాలు కలిగి ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే విదేశీయుల దండయాత్రలు, బ్రిటిష్ పాలనలతో వ్యాపార సరళిలోని ఉత్పత్తి, పంపిణీ విధానాల్లో మార్పులు వచ్చాయి. ఇవి గ్రామీణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. కుటీర పరిశ్రమలు, చేతివృత్తులకు ఆదరణ కొరవడింది. పారిశ్రామికీకరణ వల్ల పట్టణాలకు ప్రాధాన్యం ఏర్పడింది. పాశ్చాత్యీకరణ వల్ల గ్రామీణ సామాజిక వ్యవస్థలో గుర్తించదగ్గ మార్పులు వచ్చాయి. ఇప్పటి గ్రామాలకు, ప్రాచీన గ్రామాలకు చాలా తేడాలున్నాయి. ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని మార్పులు గ్రామీణుల ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలపై ప్రభావం చూపాయి.

భిన్నత్వంలో ఏకత్వం
ప్రపంచంలోని ఏ సమాజంలో లేని భిన్నత్వం భారత సమాజంలో ఉంది. విభిన్న జాతులు, భాషలు, మతాలు, కులాలు, సంస్కృతులు ఉన్న ప్రజలు కలిసి జీవిస్తున్నారు. భౌగోళికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా భిన్నత్వం ఉంది. భిన్నత్వం ఉన్నప్పటికీ ఏకత్వం సాధించారు. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే జెండా, ఒకే జాతీయ గీతం వంటి వాటిలో ఏకత్వం భావన కనిపిస్తోంది. అదే విధంగా ఒకే రకమైన మానసిక అనుబంధాన్ని కలిగి ఉండటం జాతి ఐక్యతకు దోహదం చేస్తున్నాయి.

సంస్కృతీకరణ, లౌకికీకరణ, పాశ్చాత్యీకరణ
భారత సమాజంలో సామాజిక పరివర్తన జరిగింది. సంస్కృతీకరణ ప్రక్రియ ద్వారా ఆధునిక భారతీయ సమాజంలో వినూత్న మార్పులు వచ్చాయి. పాశ్చాత్యీకరణ ఫలితంగా ప్రజల జీవన విధానంలో పాశ్చాత్య ధోరణులు ప్రవేశించాయి. లౌకికీకరణ ఫలితంగా భారత సమాజం విభిన్న మతాలకు నిలయమైనప్పటికీ మత ప్రమేయం లేని లౌకిక సమాజంగా పరివర్తన చెందింది. ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాలు రాజ్యాంగం, చట్టం ప్రకారం నిర్ణయమవుతాయి. ఏ మతాన్నీ ప్రత్యేకంగా తృణీకరించటం జరగదు. దేశంలో అధికారిక మతం లేకుండా, మతాన్ని వ్యక్తిగత అంశంగా భావించి మతసహనం పాటిస్తున్నారు.

సామాజిక వెలి- సామాజిక భాగస్వామ్యం
భారత సమాజంలో కొన్ని వర్గాలను ముఖ్యంగా షెడ్యూల్ కులాలను సమాజానికి దూరంగా, జనజీవన స్రవంతికి రాకుండా వివక్షతో అడ్డుకున్నారు. వారికి అభివృద్ధి ఫలాలు అందలేదు. ఒక అభివృద్ధి నమూనా/చర్య వల్ల సమాజంలో కొందరికి ప్రయోజనం చేకూరితే, మరికొందరికి చేకూరదు. అభివృద్ధి నమూనాలో భాగాన్ని, దాని ప్రయోజనం పొందినవారిని భాగస్వాములు అంటారు. ఆ ప్రయోజనాలు పొందని వారు సామాజిక వెలికి గురవుతారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల సమాజంలోని కొన్ని వర్గాలకే అభివృద్ధి ఫలాలు దక్కుతున్నాయి. దళితులు, పేదలు, రైతులు అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా వెలికి గురవుతున్నారు.
Published date : 17 Oct 2015 02:51PM

Photo Stories