Skip to main content

సంక్షేమం

పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల వివరాలు...
ఆసరా పింఛన్లు
పేదలు భద్రతతో జీవించడానికి రాష్ర్ట ప్రభుత్వం ‘ఆసరా’ పింఛన్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వృద్ధులు, ఎయిడ్‌‌స వ్యాధిగ్రస్తులు, వితంతువులు, జీవనోపాధి కోల్పోయిన నేత కార్మికులు, కల్లుగీత కార్మికుల కనీస అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీనిలో వృద్ధులు, వితంతువులు, చేనేతలు, గీత కార్మికులకు ప్రతినెలా రూ.1000 పెన్షన్‌ను, వికలాంగులకు రూ.1500 పెన్షన్‌ను అందిస్తున్నారు. గత ప్రభుత్వం సామాజిక పింఛన్ల కోసం ఏడాదికి రూ. 835.63 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆసరా పథకం కింద సుమారు రూ. 4,000 కోట్లు ఖర్చు చేస్తోంది.
జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ) కింద కేంద్ర ప్రభుత్వం పింఛన్ల కోసం ఏడాదికి రూ. 264.84 కోట్లు కేటాయిస్తోంది. 80 ఏళ్ల లోపు వారికి భారత ప్రభుత్వ పెన్షన్ స్కేలు నెలకు రూ. 200, ఆపై వయసున్న వారికి రూ.500, వితంతువులు, వికలాంగులకు రూ.300 కేటాయిస్తుంది. మిగతా ఖర్చును రాష్ర్ట ప్రభుత్వం భరిస్తూ, భారత ప్రభుత్వ నిధులతో ఎన్‌ఎస్‌ఏపీ కింద 8.15 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తోంది. 2015 నుంచి మహిళా బీడీ కార్మికులకు కూడా ఆర్థిక సహాయాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ‘సమగ్ర కుటుంబ సర్వే’లో సేకరించిన సమాచారం ఆధారంగా బీడీ కార్మికులకు నెలకు రూ. 1000 చెల్లిస్తోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన
అన్ని వర్గాల పేదలకు ఆహార భద్రత కార్డులను అందించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారికి సబ్సిడీతో ఆహార ధాన్యాలు, నిత్యావసర సరుకులను అందించడం దీని ఉద్దేశం. ఇప్పటికే కోటి ఒక లక్షా దరఖాస్తులు అందగా, 99 లక్షల ఒక వెయ్యి దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. 87.57 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) కింద 49 వేల మంది లబ్ధిదారులున్నారు.
ఆహార భద్రతా కార్డులు పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయాన్ని లక్షా యాభై వేల రూపాయలు, నగర ప్రాంతాల్లో రెండు లక్షల వరకు సడలించారు. భూ పరిమితిని కూడా సడలించి మాగాణిని 3.5 ఎకరాలు, మెట్టను 7.5 ఎకరాల వరకు పెంచారు.
లబ్ధిదారులకు 2015 జనవరి 1వ తేదీ నుంచి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. కుటుంబంలో సభ్యుల పరిమితిని తొలగించారు. అలాగే ఏఏవై లబ్ధిదారులకు 35 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరికీ రూపాయికి కిలో చొప్పున బియ్యం అందిస్తున్నారు. ఆహార భద్రతా కార్డులను ఇంకా జారీ చేయనప్పటికీ, అర్హులందరికీ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం కోసం 2.80 కోట్ల యూనిట్లకు నెలకు సుమారు 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.
విద్యార్థులకు సన్నబియ్యం
హాస్టళ్లలోని విద్యార్థులు, పాఠశాల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి సూపర్ ఫైన్ రకం బియ్యం(సన్న బియ్యం) సరఫరా చేస్తున్నారు.
హాస్టళ్లకు 6,663 మెట్రిక్ టన్నులు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి 5837 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఇందుకు ప్రభుత్వం కిలో రూ. 36 చెల్లించి సన్న బియ్యాన్ని సేకరిస్తోంది.
భూమి కొనుగోలు పథకం
నిరుపేద ఎస్సీ కుటుంబాల్లోని మహిళల సంక్షేమం కోసం భూమి కొనుగోలు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద, మొదటి దశలో భూమి లేని పేద ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల వరకు భూమిని సమకూరుస్తారు. తర్వాత దశల్లో అర ఎకరం, ఎకరన్నర, రెండెకరాల భూమి ఉన్న ఎస్సీలకు కూడా మిగిలిన పరిమాణం భూమిని ఇచ్చి మూడెకరాల ఆసాములుగా చేస్తారు.
భూమి అభివృద్ధి, వ్యవసాయ అవసరాలకు నిధులను సమకూర్చడంతోపాటు, ఏడాదిలో ఒక పంటకు నీటి సౌకర్యం, బిందు సేద్యం, విత్తనాల ఖర్చులకు సమగ్ర ప్యాకేజీని అందిస్తారు. ఇందుకు అవసరమైన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తారు. భూమి కొనుగోలు పథకం వంద శాతం సబ్సిడీతో అమలు జరుగుతుంది. హైదరాబాద్ మినహా రాష్ర్టంలోని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో, ఎకరం భూమిని 2 లక్షల రూపాయల నుంచి 7 లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేయడానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. 2015 జనవరి 29 నాటికి 525 మంది లబ్ధిదారులకు 1132 ఎకరాల ప్రైవేట్ భూమిని, 270 ఎకరాల ప్రభుత్వ భూమిని మంజూరు చేశారు.
కల్యాణ లక్ష్మీ పథకం
పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన యువతి వివాహ ఖర్చులకు రూ. 51,000 ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. రెండు లక్షల లోపు వార్షికాదాయం ఉన్న దళిత, గిరిజన కుటుంబాల్లోని 18 ఏళ్లు నిండిన యువతి వివాహానికి సాయం చేస్తారు. 2014 అక్టోబర్ 2 నుంచి కల్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నారు.
షాదీ ముబారక్
2014 అక్టోబర్ 2న ‘షాదీ ముబారక్ పథకాన్ని’ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మైనార్టీ కుటుంబాలకు చెందిన యువతి వివాహానికి రూ. 51 వేలు అందిస్తారు. వివాహానికి కనీసం నెల ముందు దరఖాస్తు చేసుకుంటే యువతి ఖాతాలో ఈ మొత్తాన్ని జమచేస్తారు.
తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు
తెలంగాణ తాగు నీటి సరఫరా ప్రాజెక్టు (టీడీడబ్ల్యూఎస్పీ)ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ను మినహాయించి, తొమ్మిది జిల్లాల్లోని 25,139 ఆవాసాలు, 67 మున్సిపాలిటీల్లో నివసిస్తున్న 319 లక్షల మందికి రోజుకు వంద లీటర్ల తాగునీటి ని సరఫరా చేస్తారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.42 వేల కోట్లు. ప్రస్తుతం అమల్లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులన్నీ ప్రతిపాదిత టీడీడబ్ల్యూ ప్రాజెక్టులో సమీకృతమవుతాయి.
నాగార్జునసాగర్, పాలేరు, వైరా, దుమ్ముగూడెం, శ్రీశైలం, ఎస్సారెస్పీ, సింగూర్, నిజాంసాగర్, కడెం, కొమరంభీం ప్రాజెక్టుల నుంచి ఈ తాగునీటి ప్రాజెక్టు సుమారు 63 టీఎంసీల నీటిని వినియోగించుకుంటుంది. దీన్ని నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 1.25 లక్షల కిలోమీటర్ల పొడవునా నీటి గొట్టాలను అమర్చాల్సి ఉంటుంది. 18 స్వీకరణ బావులు, 17,407 నీటి నిల్వ ట్యాంకులను నిర్మించాలి. మధ్య మధ్యలో 62 పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టుకు 186 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఈ ప్రాజెక్టు నిధుల కోసం రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాల వనరులతో పాటు ద్వైపాక్షిక బహుళ పక్ష సంస్థలు, ఆర్థిక సంస్థల నుంచి కూడా రాష్ర్ట ప్రభుత్వం నిధులను కోరుతోంది.
రాష్ర్ట స్వీయ నీటి సరఫరాతో పాటు, పరిశ్రమలకు అవసరమైన నీటిని కూడా ఈ ప్రాజెక్టు పరిగణనలోకి తీసుకుంటుంది.
  1. ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్గొండ జిల్లాలో ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ఆచరణలోకి తేవాలని నిర్ణయించారు. రాష్ర్టంలో మొత్తం నాలుగు ప్రాంతాలకూ లబ్ధి చేకూరేలా ఈ పనులను ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఏకకాలంలో అమలు చేస్తారు.
  2. రాష్ర్టంలోని ప్రతి ఇంటికీ రక్షిత నీటిని కుళాయి ద్వారా సరఫరా చేయడమే లక్ష్యంగా ఆ ప్రాజెక్టును చేపడుతున్నారు.
  3. వచ్చే 30 ఏళ్లపాటు తాగునీటి అవసరాలను తీర్చగలిగే రీతిలో ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  4. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించడానికి రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ర్టస్థాయి సమన్వయ సంఘాన్ని నెలకొల్పారు. జిల్లాలో ప్రాజెక్టు పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ పర్యవేక్షిస్తుంది.
ప్రాజెక్టు ఆవశ్యకత
తెలంగాణలోని వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాలతో పాటు విడిగా ఉన్న నీటి నెట్‌వర్‌‌కలను ఈ ప్రాజెక్టు ద్వారా సద్వినియోగం చేసుకుంటారు.
భూగర్భ జల నాణ్యత: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, ఇనుము ఎక్కువగా ఉంటోంది. భూమి ఉపరితలానికి కొద్ది దిగువన ఇనుప రజను, ఉప్పు ఎక్కువగా ఉన్నచోట్ల, భూగర్భ జలాలు తగ్గిన కొద్దీ నీటిలో ఇనుపమడ్డి, లవణం, ఫ్లోరైడ్ పెరిగిపోతున్నాయి. నీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ శాతాన్ని గుర్తించిన జనావాసాలు 4506, నైట్రేట్ కాలుష్యం ఉన్న నీటిని 1881 జనావాసాల్లో, ఇనుప మడ్డితో కలుషితమైన నీటిని 576 జనావాసాల్లోనూ గుర్తించారు.
భూగర్భ జలకాలుష్యం: పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయ సంబంధమైన పురుగు మందులు, నైట్రేట్లతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి
పెరుగుతున్న డిమాండ్: మారుతున్న జీవనశైలి, నగరీకరణలతో నీటి వినియోగం పెరుగుతోంది. దీంతో జల వనరులు త్వరితగతిన తరిగిపోతున్నాయి.
గ్రామీణ, నగర ప్రాంతాలు: ప్రస్తుతం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరాకి ప్రణాళికలు వేర్వేరుగా ఉన్నాయి. ఒకే జలవనరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ఈ విధంగా వేర్వేరు ప్రణాళికలతో పట్టణ ప్రాంతాలకు ప్రాజెక్టు వ్యయం చాలా పెరిగిపోతోంది.
భూగర్భ జలాల మీద అతిగా ఆధారపడడాన్ని క్రమంగా తగ్గించి, ఉపరితల వనరుల మీద ఆధారపడడానికి మారాలని జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమ మార్గదర్శక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ
తెలంగాణ నీటి సరఫరా ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ, భవిష్యత్ నిర్వహణ, మరమ్మతులకు తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ని నెలకొల్పారు. సిబ్బందిని ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ శాఖ సమీకరిస్తుంది.
మార్గదర్శకాలు
నీటి సరఫరాకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ (సీపీహెచ్‌ఈఈఓ) నిబంధనావళి, రాష్ర్ట ప్రభుత్వం అంగీకరించిన మార్గదర్శకాలు, విధానాల ప్రకారంగా ప్రతిపాదిత తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు.
నిర్వహణ, మరమ్మతుల విభాగం
గుత్త నీటి సరఫరా వ్యవస్థని నిర్వహణ, మరమ్మతుల బాధ్యతలను నిర్వర్తించడం రెండూ కార్పొరేషన్ చేతుల్లోనే ఉంటాయి. జనావాసాల పరిధిలో నీటి సరఫరా నిర్వహణ, మరమ్మతుల బాధ్యత పీఆర్‌ఐల చేతిలో ఉంటాయి. పీఆర్‌ఐలు నిర్దేశించే రుసుముల ద్వారా నిర్వహణ వ్యయాన్ని వాస్తవిక వినియోగదారులు సమకూరుస్తారు.
ఆటోమేషన్
తెలంగాణ తాగునీటి ప్రాజెక్టును నవ సాంకేతిక గ్రిడ్‌గా ప్రతిపాదించారు. దీనిలోని శుద్ధి విభాగాలు, పంపింగ్ స్టేషన్లలో పూర్తి ఆటోమేషన్ ఏర్పాటవుతుంది. నీటి ప్రవాహం మీద నిరంతర నిఘాకు, ట్యాంకుల్లోని నీటి నిల్వల గమనికకు, బేరింగ్‌ల/మోటార్‌ల ఉష్ణోగ్రత పరిశీలనకు ఈ ఆటోమేషన్ ఉపయోగపడుతుంది.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం

భారత రాజ్యాంగం స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించింది. సమాన అవకాశాలు, పనికి సమాన వేతనం చెల్లించాలని పేర్కొంది. మహిళలు, బాలలకు ప్రత్యేక ఏర్పాట్ల కోసం రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఈ శాఖ బహుముఖమైన కార్యకలాపాలను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించొచ్చు. అవి..
  • సమీకృత శిశు అభివృద్ధి సేవల(ఐసీడీఎస్) కార్యక్రమ అమలు. రాష్ర్టంలో 149 ప్రాజెక్టులతో ఈ కార్యక్రమాన్ని సార్వత్రీకరణం చేశారు.
  • సంరక్షణ, ఆలనాపాలనలు అవసరమైన ప్పుడు మహిళా, శిశు సంక్షేమం కోసం సంస్థల నిర్వహణ.
  • మహిళలు, శిశువుల సంరక్షణ, సంక్షేమం, సాధికారత చర్యల అమలు, పర్యవేక్షణ.
మహిళలు, బాలల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు పలు సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి.
ఆరోగ్య లక్ష్మీ..
ఇది గర్భిణులు, బాలింతలకు ఒక పూట పూర్తి భోజనాన్ని అందించడానికి చేపట్టిన కార్యక్రమం. దీన్ని 2015 జనవరి 1 నుంచి అన్ని అంగన్‌వాడీ కేంద్రా(ఏడబ్ల్యూసీ)ల్లో అమలు చేస్తున్నారు. రూ. 105.86 కోట్లతో 5,66,917 మంది మహిళలకు ప్రయోజనం కల్పిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ సొసైటీ..
మహిళలు, బాలికల భద్రత, సంరక్షణ, సాధికారత కోసం ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ విమెన్’ పేరుతో సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని రూపొందించారు. ఇది 2014 నవంబర్ 25న రిజిస్టర్ అయింది.
మహిళల హెల్ప్‌లైన్
అత్యాచారాలకు వ్యతిరేకంగా, వాటిపై వెంటనే స్పందించడానికి సమీకృత మహిళా హెల్ప్‌లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మహిళలు హింసకు గురైతే వెంటనే నిర్భయ సెంటర్ / పోలీస్ / హాస్పిటల్ / అంబులెన్‌‌సలకు సమాచారం చేరవేయడానికి, 24 గంటల పాటు అత్యవసర స్పందన సహాయాన్ని అందించడానికి చర్యలు తీసుకున్నారు.
షి-ట్యాక్సీ పథకం
ఈ పథకం అమలుకు రాష్ర్ట ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ట్యాక్సీకి 35 శాతం సబ్సిడీని రాష్ర్ట ప్రభుత్వం సమకూరుస్తోంది.
సమీకృత శిశు అభివృద్ధి సేవలు
ఆరేళ్లలోపు బాలల పోషణ, ఆరోగ్య రక్షణ, మానసిక, భౌతిక, సామాజిక అభివృద్ధికి కేంద్ర పోషణలో నడుస్తున్న ఏకైక అతి పెద్ద సమీకృత కార్యక్రమం ఐసీడీఎస్. ఇది అందిస్తున్న సేవలు..
ఎ. ఆరేళ్లలోపు బాలలు, గర్భిణులు, బాలిం తలకు అనుబంధ పోషణ కార్యక్రమం
బి. పిల్లలకు ప్రీ స్కూల్ విద్య
సి. టీకాలు వేయడం
డి. ఆరోగ్య తనిఖీలు
ఇ. సిఫారసు చేసిన సేవలు
ఎఫ్. బాలలు,మహిళలు, యువతుల ఆరోగ్యం, పోషణపై విద్యా చైతన్యం.
31,711 ప్రధాన ఏడబ్ల్యూసీల్లో 25,326 ఏడబ్ల్యూసీలు గ్రామీణ ప్రాంతాల్లో, 3716 పట్టణ ప్రాంతాల్లో, 2,669 గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి అదనంగా 3,989 మినీ ఏడబ్ల్యూసీలు ఉన్నాయి. ఇందులో 3,160 గ్రామీణ ప్రాంతాల్లో, 42 పట్టణ ప్రాంతాలు, 787 గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 5,66,917 మంది మహిళలు, 19,05,385 మంది బాలలకు లబ్ధి చేకూరుతోంది. అంగన్ వాడీ కార్యకర్తల వేతనాన్ని 2015 మార్చి 1 నుంచి రూ.7,000, అంగన్‌వాడీ సహాయకులకు వేతనాన్ని రూ.4,500 పెంచారు.
అనుబంధ పోషకాహార కార్యక్రమం
అనుబంధ పోషకాహార కార్యక్రమం (ఎస్‌ఎన్‌పీ) కింద ‘తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం’ (వండనవసరం లేనిది) ఏడు నెలల నుంచి మూడేళ్ల బాలలకు అందిస్తున్నారు. 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 3 నుంచి 6 ఏళ్ల వయసు బాలలకు ఆహారాన్ని వండి పెడుతున్నారు. ఈ పథకంలో 24.72 లక్షల మంది లబ్ధిదారులున్నారు.
కిశోర శక్తి యోజన
11 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలకు సాధికారత కలిగించడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. బాలికల స్వీయ అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తారు. పోషణ, ఆరోగ్యం, విద్య, గృహాధారిత, జీవన, వృత్తినైపుణ్యాలు పెంపొందిస్తారు. గృహ హింస, కార్యాలయ వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి గృహ హింస చట్టం - 2005ను రూపొందించారు.
సమీకృత శిశు సంరక్షణ పథకం
ప్రతికూలతలకు ఆలవాలమైన బాలలకు చట్ట పరమైన సేవలు, సంరక్షణ, పునరావాసం తదితర సేవలను ఐసీపీఎస్ కల్పిస్తుంది. అనాథలు, హెచ్‌ఐవీ/ ఎయిడ్‌‌స సోకిన బాలలు, యాచకులు, బాల ఖైదీలు, వీధి బాలలను ఆదుకోవడానికి ఐసీపీఎస్ కృషి చేస్తోంది.
బాల నేరస్థుల సంక్షేమం
బాల నేరస్థుల సంక్షేమం కోసం తెలంగాణలో రెండు చిల్డ్రన్ హోమ్‌లు, మూడు అబ్జర్వేషన్ హోమ్‌లు, ఒక స్పెషల్ హోమ్, బాలికల కోసం ఒక హోమ్, ఒక ‘అనంతర సంరక్షణ గృహం’ పనిచేస్తున్నాయి.
‘యువ కౌమార కౌన్సెలింగ్ అండ్ గెడైన్స్ క్లినిక్’ల ద్వారా వ్యవస్థేతర సేవలను అందిస్తున్నారు. వీటిలో మానసిక, ఆరోగ్య సంబంధమైన జాగృతి, కౌన్సెలింగ్, గెడైన్స్ సేవలను బాలలు, కౌమారులకు అందిస్తున్నారు.

వికలాంగుల సంక్షేమం

వికలాంగులకు విద్య, ఉపాధి, వృత్తి శిక్షణ కోసం వికలాంగ చట్టం- 1996 దోహదపడుతుంది. వీరి సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారు.
సర్వే, మదింపు
‘సాఫ్ట్‌వేర్ ఫర్ అసెస్‌మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్’ (సదరెమ్) అనేది కంప్యూటర్ ఆధారిత సాధనం. వైద్య-ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి శాఖలతో కలిసి ఈ మదింపు విధానాన్ని సంక్షేమ శాఖ రూపొందించింది. భారత ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకనుగుణంగా వైకల్యాన్ని మదింపు చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. ఇది విశిష్టమైన ఐడీతో వైకల్య ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులను జారీ చేస్తుంది. వారికి వర్తింపజేసే సేవలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది. సదరెమ్ ద్వారా 5,27,159 ధ్రువీకరణ పత్రాలను వికలాంగులకు జారీ చేశారు.
సాధనాలు, సహాయ ఉపకరణాలు
భారత కృత్రిమ అవయవాల ఉత్పత్తి కార్పొరేషన్ (అలిమ్‌కో) సహకారంతో 2014-15లో అన్ని జిల్లాల్లో రెండు దశల్లో శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు 2015 జనవరి 7 వరకు వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాలో శిబిరాలను నిర్వహించారు. జిల్లాకు 2,948 మంది చొప్పున వివిధ సాధనాలకు, సహాయ ఉపకరణాలకు లబ్ధిదారులను గుర్తించారు.
వికలాంగులు, వృద్ధుల సంక్షేమం
తల్లిదండ్రులు, వృద్ధుల భరణం, సంక్షేమాల చట్టం-2007ను భారత ప్రభుత్వం రూపొందించింది.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో మొత్తం పది జిల్లాల్లో అప్పీలేట్ ట్రైబ్యునళ్లను నెలకొల్పారు. రాష్ర్టంలో 42 ట్రైబ్యునళ్లు పనిచేస్తున్నాయి.
భారత ప్రభుత్వ పథకాలు
వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల(ఎన్‌జీవో)కు భారత ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్‌ను మంజూరు చేసింది. నాలుగు జిల్లా వికలాంగ పునరావాస కేంద్రాల(డీడీఆర్‌సీ)ను తెలంగాణకు భారత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు కేటాయించారు.
పింఛన్లు
వికలాంగులకు ప్రత్యేకించిన మిగులు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్‌మెంట్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో 2014-15లో 215 ఉద్యోగాలను గుర్తించారు. వికలాంగులు, వృద్ధుల పింఛనును 1500కు పెంచుతూ 2014 నవంబర్ 5న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో 11,99,215 మంది వృద్ధులు, 3,46,409 మంది వికలాంగులు లబ్ధి పొందుతున్నారు.
తెలంగాణ వికలాంగుల సహకార కార్పొరేషన్
ఈ కార్పొరేషన్ వికలాంగుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తుంది. అవి..
1. కృత్రిమ అవయవాలు, చక్రాల కుర్చీ తదితర ఉపకరణాల సరఫరా.
2. వ్యక్తులు, సంస్థలకు విద్యా సంబంధమైన సాధనాల సరఫరా.
3. వివిధ సాంకేతిక, సాంకేతికేతర వ్యాపకాల్లో శిక్షణ సౌకర్యాలు
4. వివిధ వైకల్యాలను బాల్యంలోనే గుర్తించి వైద్యం చేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం.
Published date : 07 Oct 2015 03:53PM

Photo Stories