Skip to main content

స్వాతంత్య్ర సంగ్రామం-అతివాద యుగం

అతివాద యుగం (1905-1919)
జాతీయోద్యమంలో రెండో దశను అతివాద యుగంగా పిలుస్తారు. అతివాదుల లక్ష్యాలు, విధానాలు మితవాదులకు భిన్నంగా ఉండేవి. అందుకే వీరికి నూతన జాతీయవాదులనే పేరు వచ్చింది. మితవాదుల విధానాలతో తీవ్రంగా విసిగిపోయిన యువ నాయకులు వారిపై విమర్శలు చేయటం ప్రారంభించారు. ఇందులో భాగంగా మితవాదుల లక్ష్యాలను ‘బుడగలతో ఆటల వలే ఉన్నాయని’ అరబిందో ఘోష్, ‘కాంగ్రెస్ సమావేశాలను మూడు రోజుల తమాషా’అని అశ్వనీకుమార్ దత్తా, జాతీయ కాంగ్రెస్‌ను ‘యాచన సంస్థ’గా బిపిన్ చంద్ర, రాజకీయ హక్కులు యాచనతో కాదు పోరాడితే వస్తాయని లజపతిరాయ్, ‘కప్పల్లా సంవత్సరానికి ఒకసారి అరవటం వల్ల ఉపయోగం లేదు’ అని తిలక్ మితవాదుల చర్యలను తీవ్రంగా విమర్శించారు.

అతివాదయుగం వృద్ధికి కారణాలు
  • ప్రభుత్వ భారతీయ వ్యతిరేక విధానాలు
  • 1896లో పత్తిపై దిగుమతి సుంకాల రద్దు.
  • కర్జన్ చర్యలు - 1904 విశ్వవిద్యాలయాల చట్టం, 1905 బెంగాల్ విభజన మొదలైనవి.
  • ప్రాంతీయ భాషా పత్రికలు పెరగటం.
  • 1896లో ఇథియోపియా.. ఇటలీని ఓడించటం, 1905లో జపాన్.. రష్యాను ఓడించటంతో యూరోపియన్లు అజేయులనేభ్రమ తొలగిపోవడం.
  • విప్లవభావాలు కలిగిన తిలక్, లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్ వంటి నాయకులు జాతీయ కాంగ్రెస్‌లో ఉండటం. లాల్, బాల్, పాల్‌లను అతివాద త్రయంగా పిలుస్తారు.
  • ఆర్యసమాజం, బ్రహ్మసమాజం, వివేకానంద మొదలైన వారి బోధనలతో ప్రాచీన భారతదేశ గొప్పతనంపై అవగాహన పెరిగి ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానాలు అధికమయ్యాయి.
  • ముఖ్యంగా తిలక్ బోధనలు, ఆయన నిర్వహించిన గణేష్, శివాజీ పండుగలు దేశవ్యాప్తంగా జాతీయవాదాన్ని ప్రచారం చేశాయి. తొలిసారిగా ఆయనిచ్చిన ‘స్వరాజ్య, స్వదేశీ, విదేశీ బహిష్కరణ’ వంటి నినాదాలు స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో స్ఫూర్తిని రగిలించాయి.
అతివాదుల లక్ష్యం: స్వరాజ్య సాధన అతివాదుల ముఖ్య లక్ష్యం. అతివాదుల దృష్టిలో స్వరాజ్యమంటే సంపూర్ణ స్వాతంత్య్రం. పరపాలన కంటే స్వపరిపాలన ఉత్తమమైంది. అందువల్లే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా’ అని తిలక్ ప్రకటించారు.

కార్యక్రమాలు: అతివాదులు తమ లక్ష్యసాధనకు నిష్క్రియాత్మక ప్రతిఘటన పాటించారు. ఇందులో భాగంగా బహిష్కరణ, స్వదేశీ, జాతీయ విద్యావిధానం, జాతీయ భావాలను వ్యాప్తి చేశారు.

బహిష్కరణ:
  • బ్రిటిష్ వస్తువులను బహిష్కరించటం.
  • ఆంగ్లేయుల విద్యా సంస్థల్లో విద్యనభ్యసించకపోవటం.
  • బ్రిటిష్ న్యాయస్థానాలను బహిష్కరించటం.
  • పన్నులు చెల్లించకపోవటం.
  • బ్రిటిష్ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారంతా రాజీనామాలు చేయటం.
స్వదేశీ:
  • స్వదేశీ పంచాయతీ కోర్టుల పునఃప్రతిష్టాపన.
  • స్వదేశీ విద్యా సంస్థల స్థాపన.
  • స్వదేశీ పరిశ్రమల్లో తయారైన వస్తువుల వాడకం. దేశీయ పరిశ్రమల అభివృద్ధి.
జాతీయభావాల వ్యాప్తి:
  • జాతీయభావాన్ని హిందూ మతంతో జోడించి వ్యాప్తి చేయడం. హిందూ దేవతలైన దుర్గా, కాళీలతోపాటు భారతదేశాన్ని భారతమాతగా ఆరాధించటం.
  • వందేమాతరం గీతం ద్వారా దేశ ఔన్నత్యాన్ని చాటడం. ఒకరికొకరు ‘వందేమాతరం’ అని అభివాదం చేసుకోవటం.
  • గణేష్, శివాజీ ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించటం.
ఉద్యమాలు
స్వదేశీ ఉద్యమం
  • పరిపాలనా నెపంతో లార్డ్ కర్జన్ బెంగాల్‌ను తూర్పు, పశ్చిమ బెంగాల్‌లుగా విభజించాడు. కానీ, అతని అసలు వ్యూహం..బెంగాల్ విభజనతో పెరుగుతున్న జాతీయ భావాన్ని తగ్గించి, హిందూ-ముస్లింల ఐక్యతను దెబ్బతీయడమే. దీనికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యిందే స్వదేశీ/వందేమాతర ఉద్యమం.
  • కర్జన్ 1905 జూలై 4న బెంగాల్ విభజనను ప్రకటించాడు. ఇది అక్టోబర్ 16, 1905 నుంచి అమల్లోకి వచ్చింది.
  • రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతో అక్టోబర్ 16న రాఖీ దినంగా పాటించి హిందూ, ముస్లింలు సోదరభావాన్ని ప్రకటించారు. హర్తాళ్లు, నిరసన ప్రదర్శనలు జరిగాయి.
  • బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం జాతీయగేయంగా మారింది. వందేమాతరం నినాదంతో విదేశీ వస్తు బహిష్కరణ పెద్ద ఎత్తున జరిగింది.
  • ఈ ఉద్యమంతో స్వదేశీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.
  • వందేమాతరం ఉద్యమం సందర్భంలో 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించారు.
  • భారతీయ విద్యాభివృద్ధికి జాతీయ విద్యామండలి (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్) స్థాపించారు.
  • దీంతో ఇది జాతీయస్థాయిలో జరిగి విజయం సాధించిన తొలి ఉద్యమంగా నిలిచింది. 1911లో ఐదో జార్‌‌జ భారత పర్యటనలో భాగంగా 1911 డిసెంబర్ 11న నిర్వహించిన ఢిల్లీ దర్బారులో వైశ్రాయ్ లార్డ్ హార్టింజ్-ఐఐ బెంగాల్ విలీనాన్ని ప్రకటించారు.
హోమ్‌రూల్ ఉద్యమం 1916
  • అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన జాతీయ స్వయం నిర్ణయ సూత్రం ప్రకారం భారతీయులకు కూడా తమ జాతీయ ప్రభుత్వం ఏర్పర్చుకునే హక్కు ఉందని అనిబిసెంట్, తిలక్‌లు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
  • తిలక్ పుణే కేంద్రంగా 1916 ఏప్రిల్‌లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని కోసం హోమ్‌రూల్‌లీగ్ అనే సంస్థను ప్రారంభించారు.
  • తిలక్ ఉద్యమం మహారాష్ర్ట, సెంట్రల్ ప్రావిన్సులో కొనసాగింది.
  • అనిబిసెంట్ మద్రాసు కేంద్రంగా 1916 సెప్టెంబర్‌లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది తిలక్ ఉద్యమ ప్రాంతాలు మినహా మొత్తం భారతదేశమంతా కొనసాగింది.
  • అనిబిసెంట్ అఖిల భారత హోమ్‌రూల్ లీగ్‌ను స్థాపించారు.
  • బ్రిటిష్ అధికార పరిధికి లోబడి మతస్వేచ్ఛ, జాతీయ విద్య, సాంఘిక, రాజకీయ సంస్కరణలతో భారతీయులకు స్వయం పాలన అందించడం ఈ ఉద్యమ లక్ష్యం.
  • 1917లో మాంటేగ్ ప్రకటనతో అనిబిసెంట్ ఉద్యమం నిలిపివేశారు. తిలక్ తన ఉద్యమాన్ని కొనసాగించారు.
అతివాద యుగంలో ప్రముఖ సంఘటనలు
  • 1906 - కలకత్తాలో జాతీయ కళాశాల స్థాపన.
  • 1906 డిసెంబర్ 30న ఢాకా కేంద్రంగా నవాబ్ హబీబుల్లా అఖిల భారత ముస్లింలీగ్‌ను స్థాపించారు.
  • 1907 - సూరత్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు, మితవాదులుగా చీలిక. జాతీయ కాంగ్రెస్ నుంచి అతివాదుల బహిష్కరణ.
  • 1909 - మింటో - మార్లే సంస్కరణలు - ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు.
  • 1911 డిసెంబర్ 11న ఢిల్లీ దర్బార్ - బెంగాల్ పునరేకీకరణ. దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు. ఒడిశా, బీహార్‌లను బెంగాల్ నుంచి వేరు చేయటం.
  • 1912 డిసెంబర్ 23 లార్డ్ హార్డింజ్ బాంబు కేసు - నూతన రాజధాని ప్రవేశ సమయంలో ఢిల్లీలో చాందినీ చౌక్ వద్ద హార్డింజ్ హత్యకు బాంబు దాడి.
  • 1914-1918 - మొదటి ప్రపంచ యుద్ధం.
  • 1916 - లక్నో ఒప్పందం - ముస్లింలీగ్, కాంగ్రెస్‌లు ఐక్యపోరాటానికి అంగీకారం అతివాద, మితవాదుల కలయిక.
  • 1917 ఆగస్ట్ 20 - మాంటేగ్ ప్రకటన.
    పాలనలో భారతీయులకు ప్రాతినిధ్యం పెంచటం.
    అంచెలంచెలుగా స్వయంపాలనా సంస్థల ఏర్పాటు.
    బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు.
  • 1918 ఆగస్ట్ - సురేంద్ర నాథ్ బెనర్జీ నాయకత్వంలో మితవాదులు కాంగ్రెస్‌ను వీడటం. నేషనల్ లిబరల్ లీగ్ స్థాపన. ఇదే ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్‌గా మారింది.
  • 1919 - మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు- రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టడం.
రచనలు
  1. బాలగంగాధర్ తిలక్ - ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్, గీతా రహస్యం.
  2. లాలా లజపతిరాయ్ - అన్ హ్యాపీ ఇండియా, ఇంగ్లాండ్స్ డెబ్ టు ఇండియా, కాల్ టు యంగ్ ఇండియా, ఇండియాస్ విల్ టు ఫ్రీడమ్, ఏన్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ది నేషనల్ మూవ్‌మెంట్.
  3. అరబిందో ఘోష్ - ద లైఫ్ డివైన్, సావిత్రి, డాక్ట్రిన్ ఆఫ్ పాసివ్ రెసిస్టెన్స్, భవానీ మందిర్.
  4. బిపిన్ చంద్రపాల్ - మెమొరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్స్, ద సోల్ ఆఫ్ ఇండియా: ఎ కన్‌స్ట్రక్టివ్ స్టడీ ఆఫ్ ఇండియన్ థాట్స్ అండ్ ఐడియల్స్.
అతివాద నాయకులు

సం.

పేరు

కాలం

బిరుదులు

పత్రికలు

సంస్థలు

1. బాలగంగాధర్ తిలక్ 1856-1920 లోకమాన్య, భారత అశాంతిపిత, దేశ భక్తుల్లో రాజు మరాఠా (ఇంగ్లీష్), కేసరి (మరాఠా) హోమ్‌రూల్ లీగ్, ఫెర్గూసన్ కళాశాల
2. లాలా లజపతిరాయ్ 1865-1928 పంజాబ్ కేసరి పంజాబీ పీపుల్, వందేమాతర (ఉర్దూ) సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీ, ఇండియన్ హోమ్ రూల్ లీగ్ (యూఎస్‌ఏ), ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (యూఎస్‌ఏ)
3. బిపిన్ చంద్రపాల్ 1858-1932 బెంగాల్ డాంటన్, భారత విప్లవ భావపిత పారిదర్శక్, న్యూ ఇండియా, స్వరాజ్య (లండన్), ఇండియన్ స్టూడెంట్స్(లండన్)
4. అరబిందో ఘోష్ 1872-1950 స్వామి, యోగి వందేమాతరం (పాల్‌తో కలిసి), ఆర్య అరోవెల్లె ఆశ్రమం (పుదుచ్చేరి)
Published date : 21 Jun 2016 04:54PM

Photo Stories