Skip to main content

మత, సాంఘికసంస్కరణ ఉద్యమాలు

పాశ్చాత్య దేశాల్లో మేధాసంపత్తి, వ్యక్తి వాదం ఆధిక్యంలో ఉన్నప్పుడు భారతీయులకు పశ్చిమ దేశాలతో సాన్నిహిత్యం ఏర్పడింది. తొలి దశలో పాశ్చాత్య విద్యను అభ్యసించిన భారతీయులు విదేశీ సంస్కృతిపై వ్యామోహంతో వారి వేషధారణ, అలవాట్లు, మత భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే 19వ శతాబ్దంలో భారతీయుల్లో జాతీయ భావం అంకురించింది. రాజా రామ్మోహన్‌రాయ్ తదితరులు మత, సాంఘిక సంస్కరణోద్యమాలు సాగించారు. ఫలితంగా హిందూ సమాజంలో సంస్కరణలొచ్చాయి. ఈ సంస్కర్తల ప్రభావం జాతీయోద్యమంపై ప్రసరించింది.
రాజా రామ్మోహన్‌రాయ్
హిందూ మత సాంస్కృతిక పునరుజ్జీవనానికి రాజా రామ్మోహన్‌రాయ్ (1772-1833) నాంది పలికాడు. ఈయన బెంగాల్‌లోని రాధానగరంలో ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడి తండ్రి రమాకాంత్ రాయ్ జమీందారు. రాయ్ చిన్నతనంలోనే బెంగాలీ, అరబిక్, పర్షియన్, సంస్కృత భాషలను నేర్చుకున్నాడు. తర్వాత ఇంగ్లిష్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలపై పట్టు సాధించాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ గ్రంథాలను కూలంకషంగా చదివాడు. రాయ్ 1805లో ఈస్టిండియా కంపెనీలో చేరి తొమ్మిదేళ్లు ఉద్యోగం చేశాడు. కానీ ఉద్యోగంలో సంతృప్తి కలగలేదు. సనాతన హిందూ ఆచారాల్లోని దోషాలు నశించి, సమాజం అభివృద్ధి చెందాలంటే ఆంగ్ల విద్య నేర్చుకోవాలని, తద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడం సాధ్యమవుతుందని భావించాడు.

బ్రహ్మ సమాజ స్థాపన (1828)
రాయ్ 1828లో బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. దేవుడొక్కడేనని, ఉపనిషత్తుల్లో పేర్కొన్న మార్గమే మోక్షసాధన అని బోధించాడు. విగ్రహారాధను నిరసించాడు. సర్వమానవ సమానత్వాన్ని బోధించాడు. పరమత సహనం చూపాలని, మానవకోటిని ఉద్ధరించాలని ప్రబోధించాడు. ఈ మతం హిందూ మతాన్ని వదల్లేకపోయినా పాశ్చాత్య ఉదార వైఖరి అవలంబించిందని మెకనాల్డ్ విశ్లేషించాడు.

సాంఘిక దురాచారాలపై..
మత బోధనలే కాకుండా హిందూ మతంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి రాయ్ నడుం బిగించాడు. 1811లో తన సోదరుడు జగన్‌మోహన్ రాయ్ మరణించినప్పుడు ఆయన భార్యను కూడా చితిపై ఉంచి దహనం చేయడం చూసి రాయ్ హృదయం ద్రవించింది. సతీసహగమనం, బాల్యవివాహాలను నిర్మూలించాలని భావించాడు. ఉపన్యాసాలు, పత్రికల ద్వారా తన భావాలను ప్రచారం చేశాడు. విలియం బెంటింగ్ 1829లో సతీసహగమన నిషేధ చట్టాన్ని రూపొందించడంలో రాజా రామ్మోహన్‌రాయ్ కృషి దాగి ఉంది. బాల్యవివాహాలను రద్దు చేయడానికి, కులవ్యవస్థ నిర్మూలనకు, స్త్రీ జనోద్ధరణకు నిర్విరామ కృషి చేశాడు.

విద్యాసేవ
ఆంగ్ల విద్యను అభ్యసించనిదే దేశం బాగుపడదని భావించిన రాయ్ ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు. 1830లో అలెగ్జాండర్ డఫ్ ఆంగ్ల పాఠశాలను నెలకొల్పినప్పుడు, మెకాలే ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టినప్పుడు సమర్థించాడు. తన భావాలను ప్రచారం చేయడానికి సంబంధకౌముది అనే బెంగాలీ వార పత్రికను, మీరట్- ఉల్- అక్బర్ అనే పారశీక పత్రికను నడిపాడు. పత్రికా స్వాతంత్య్రం కోసం పాటుపడ్డాడు. విలియం బెంటింగ్ రాయ్ ఘనతను గుర్తించి ‘రాజా’ బిరుదుతో సత్కరించి ఇంగ్లండ్‌కు పంపాడు. 1833లో బ్రిస్టల్ నగరంలో రాయ్ మరణించాడు. అతడి మరణానంతరం దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవచంద్రసేన్ బ్రహ్మ సమాజ ఆశయాలను కొనసాగించారు.

స్వామి దయానంద సరస్వతి
ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి (1824-1883). ఈయన గుజరాత్‌లోని మోర్వి గ్రామంలో జన్మించాడు. ఇతణ్ని హిందూ సాంసృ్కతిక పునరుజ్జీవనానికి మూల పురుషుడిగా పేర్కొంటారు. దయానంద సరస్వతి అసలు పేరు మూల్‌శంకర్ తివారి. ఇతడికి చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఇది వయస్సుతో పాటు పెరగడంతో వివాహాన్ని తిరస్కరించి ఇల్లు వదిలివెళ్లాడు. అనేక పుణ్యక్షేత్రాలు, పుణ్య పురుషులను దర్శించి సన్యాసాశ్రమం స్వీకరించాడు. చివరకు మధురలో విరజానందుడనే గురువు వద్ద వేదాలు అభ్యసించాడు. సత్యార్‌‌థ ప్రకాశ్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో తన భావాలను ప్రకటించాడు. అవి..
1) దేవుడొక్కడే 2) విగ్రహారాధన పనికిరాదు 3) వేదాలు విజ్ఞాన గనులు. వేదోక్తమయిన హిందూమతం అన్నిటికన్నా మిన్న 4) మోక్షానికి సత్ప్రవర్తన అవసరం 5) జాతి ఐక్యతకు ఏకమతం ఉండాలని భావించాడు. వేరే మతాల్లో చేరిన హిందువులను తిరిగి సొంత మతంలోకి మార్చడానికి శుద్ధి అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతాలే ఆర్య సమాజానికి మూల సూత్రాలయ్యాయి. తన సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. కులభేదం, అంటరానితనం, బాల్య వివాహాలను ఖండించి స్త్రీ జనోద్ధరణ, వెనుకబడిన జాతుల అభివృద్ధి కోసం కృషి చేశాడు. 1883లో ఆయన మరణించాక స్వామి శ్రద్ధానందుడు, లాలా లజపతిరాయ్, లాలా హంసరాజ్ మెదలైనవారు ఆర్యసమాజాన్ని ప్రచారం చేశారు.

రామకృష్ణ పరమహంస
భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి మారో రూపం రామకృష్ణ పరమహంస. ఈయన అసలు పేరు గదాధర్ చటోపధ్యాయ్. 1833లో బెంగాల్‌లోని కామర్స్‌కూర్ గ్రామంలో జన్మించాడు. ఈయన గొప్ప భక్తుడు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. కలకత్తాలోని దక్షిణేశ్వర్‌లో ఇతడి సోదరుడు రామ్ కుమార్ ఛటర్జీ అర్చకుడిగా పనిచేసేవాడు. దీంతో రామకృష్ణుడు కూడా దక్షిణేశ్వర్‌లో నివసించేవాడు. కొద్ది కాలానికి రామకృష్ణ పరమహంస అక్కడి కాళీమాత ఆలయానికి అర్చకుడయ్యాడు. ఆమెను ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో మునిగిపోయేవాడు. ‘తోతాపురి’ అనే యోగి ఆయన సమాధి స్థితిని సరి చేయడంతో రామకృష్ణుడు పరిపూర్ణుడయ్యాడు. తర్వాత..
 1. దేవుడొక్కడే, అతడు సర్వాంతర్యామి
 2. భగవంతుణ్ని తెలుసుకోవడమే జ్ఞానం
 3. అన్ని మతాలు భగవంతుణ్ని చేరే మార్గాలను చూపుతాయి
 4. మోక్ష సాధనకు కోర్కెలను విసర్జించాలి
 5. మానవ సేవే మాధవసేవ అని బోధించాడు. తన బోధనలను వ్యాప్తం చేసే బాధ్యతను ప్రియ శిష్యుడైన స్వామి వివేకానందుడికి అప్పగించి 1886లో పరమపదించాడు.
ప్రభావం: భారతదేశ సంస్కృతిపై రామకృష్ణ పరమహంస ప్రభావం పరోక్షంగా ఉంది. ఆయన వివేకానందుణ్ని తీర్చిదిద్దాడు. వివేకానందుడు ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని చాటాడు. అతడి వల్ల ప్రపంచం భారతదేశ ఔన్నత్యాన్ని గ్రహించింది.

స్వామి వివేకానంద(1863-1902)
19వ శతాబ్దం నాటి సంస్కర్తలందరూ దేశంలో హిందూ మత సంస్కరణకు పూనుకున్నారు. అయితే స్వామి వివేకానంద హిందూ మత ఔన్నత్యాన్ని, భారతీయ మత శాస్త్ర లోతులను ప్రపంచానికి చాటాడు. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఇతడు 1863లో కలకత్తాలో జన్మించాడు. మొదట బ్రహ్మసమాజం పట్ల ఇతడికి అభిమానం ఏర్పడింది. కానీ కుటుంబంలో వచ్చిన కొన్ని కల్లోలాల కారణంగా భగవంతుడిపై నమ్మకం పోయింది. ఆ సందర్భంలో రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకున్నాడు. ఆయనను చూడటానికి వచ్చి ‘నీవు భగవంతుణ్ని చూశావా? నాకు చూపిస్తావా? అని ప్రశ్నించాడు. రామకృష్ణుడు చూపిస్తానని తన బొటన వేలితో వివేకానందుణ్ని తాకాడు. దీంతో వివేకానందుడు అనిర్వచనీయమైన అనుభూతి పొందాడు. తర్వాత నాస్తిక భావాన్ని వదిలి రామకృష్ణుడికి శిష్యుడయ్యాడు. సన్యాసిగా, గొప్ప వేదాంతిగా మారాడు. వివేకానందుడు గొప్ప వక్త, మధుర గాయకుడు. రామకృష్ణుడి భావాలను ప్రచారం చేసేందుకు అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాలసదస్సుకు హాజరయ్యాడు. తన ఉపన్యాసంతో కొద్ది నిమిషాల్లోనే సభికులను ఆకట్టుకున్నాడు. సభికుల కోరికపై ఉపన్యాసాన్ని కొనసాగించి అద్వైత సిద్ధాంతాన్ని 5 గంటల పాటు వివరించాడు. భారతీయ ఆధ్యాత్మిక తత్వబోధనలను వారికి తెలియజేశాడు. రామకృష్ణుడి బోధనలు ప్రచారం చేయడానికి కలకత్తాలోని బేలూరు వద్ద మఠం నిర్మించాడు. అందులో రామకృష్ణుడి విగ్రహం ప్రతిష్టించి ‘రామకృష్ణ’ అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేటికీ రామకృష్ణుడి బోధనలను ప్రచారం చేస్తూ సంఘ సేవలో పాలుపంచుకుంటోంది. నిర్వీర్యమవుతున్న భారత జాతిని మేల్కొలుపుతూ వివేకానందుడు అనేక బోధనలు చేశాడు.

వివేకానందుడు ప్రచారం చేసిన సిద్ధాంతాలు
 1. సర్వమతాల వేదాంతానికి మూలం హిందూ మతం.
 2. హిందూ మతంలో జీవముంది. దాన్ని పునరుద్ధరించడమే మన కర్తవ్యం.
 3. పాశ్చాత్యులను అనుసరించడం నాగరికత కాదు. అది దుర్బలుల లక్షణం. నీ సంస్కృతి గొప్పది. దానికి దూరం కావొద్దు.
 4. నువ్వు నీ దేశానికి దూరం కావొద్దు.
 5. మానవ సేవే మాధవసేవ. కాబట్టి సాటి మనుషులకు సేవ చేయి.
 6. భారతదేశం నశిస్తే ప్రపంచంలో ఆధ్యాత్మిక తత్వం నశిస్తుంది.
ఇంకా దేశభక్తికి దృఢ దీక్ష అవసరమని బోధించాడు. ఆకలితో అల్లాడే సాటి భారతీయులను ఆదుకోండని దేశ ప్రజలను కోరాడు. ఇలా అభ్యర్థిస్తూ మైసూరు మహారాజుకు ఒక ఉత్తరం రాశాడు. హిందూ సంస్కృతి వ్యాప్తికి అహోరాత్రాలు కృషి చేసి 1902లో తన 39వ ఏట మరణించాడు.
 
దివ్యజ్ఞాన సమాజం - అనిబిసెంట్
మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఆల్‌కాట్ 1875లో అమెరికాలో థియోసోఫికల్ సొసైటీని స్థాపించారు. ఐర్లాండ్‌కు చెందిన అనిబిసెంట్ ఈ సొసైటీ శాఖను 1893లో మన దేశంలో ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనిబిసెంట్ హిందూ మత గ్రంథాలన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసి, హిందూ మత గొప్పదనాన్ని తెలుసుకున్నారు. హిందూ సంస్కృతిని కాపాడి ఆ మతాన్ని పునరుద్ధరించాలని నిశ్చయించుకున్నారు. దివ్యజ్ఞాన సమాజం సర్వసమాన సౌభ్రాతృత్వం, పరమత సహనం, సర్వమత సమానత్వాలను ప్రచారం చేసింది. కులవ్యవస్థను ఖండించి సంఘంలోని వెనుకబడిన జాతుల సంక్షేమానికి పాటు పడింది. భారతీయులకు విద్యాబుద్ధులు నేర్పడానికి అనిబిసెంట్ కాశీలో హిందూ కళాశాలను స్థాపించారు. కొద్ది కాలం తర్వాత మదన్‌మోహన్ మాలవ్య ఈ కళాశాలను హిందూ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు.
 
 హోమ్ రూల్ లీగ్
 అనిబిసెంట్ సంఘ సేవ చేయడమే కాకుండా భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1916 సెప్టెంబర్‌లో మద్రాసులో ‘హోమ్‌రూల్ లీగ్’ ప్రారంభించారు. 27,000 మందితో దేశమంతా దీని శాఖలు ఏర్పడ్డాయి. వారి సహాయంతో ఆమె దేశమంతా హోమ్‌రూల్ ఉద్యమాన్ని నడిపారు. చాలా పట్టణాల్లో బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చి దేశభక్తిని ప్రబోధించారు. ఆమె కృషి వల్ల దేశమంతటా జాతీయభావం బలపడింది. ఆమె విదేశీ వనిత అయినా భారతదేశాన్ని మతృభూమిగా భావించి గొప్ప సేవ చేశారు. 1917లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను జైల్లో నిర్బంధించింది. అనిబిసెంట్ గొప్ప పండితురాలు. ఆమె తొలి పేరు మిస్ ఉడ్. ఐర్లాండ్‌లో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలిగా భారత్‌కు వచ్చారు.
 
ఈశ్వర చంద్ర విద్యాసాగర్
 రాజా రామ్మోహన్‌రాయ్ తర్వాత హిందూ సమాజానికి అంతటి సేవ చేసిన మహనీయుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఇతడి అసలు పేరు ఈశ్వర చంద్రుడు. హిందూ శాస్త్రాల్లో విద్యాసాగర్ అనే పట్టాను పొందడంతో విద్యాసాగర్ అని పేరుతో కలిసిపోయింది. ఈయన 1820లో బెంగాల్‌లో వీరశింఘ అనే గ్రామంలో జన్మించాడు. ధర్మ, వేదాంత, జ్యోతిష శాస్త్రాల్లో గొప్ప పండితుడు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి విద్యాశాఖాధికారి అయ్యాడు. కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశాడు. విద్యావ్యాప్తి కోసం విశేష కృషి చేశాడు. విద్యాశాఖాధికారిగా ఉన్న కాలంలో 40 పాఠశాలలను, కలకత్తాలో మెట్రోపాలిటన్ కాలేజీని స్థాపించాడు. స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈయన కృషి వల్ల చాలామంది బెంగాలీ స్త్రీలు విద్యావంతులయ్యారు. సత్పురుషుల చరిత్ర, బెంగాల్ చరిత్ర, సీతావనవాసం అనే గ్రంథాలను రచించాడు.  సులభంగా సంస్కృతం నేర్చుకోవడానికి వీలుగా అనేక సంస్కృత పుస్తకాలు రాశాడు. 
 
సంఘ సంస్కరణలు
రాజా రామ్మోహన్‌రాయ్‌లా ఈశ్వరచంద్రుడు స్త్రీ జనోద్ధరణకు విశేష కృషి చేశాడు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం, వరకట్న దురాచారాలను ఖండించాడు. వితంతు వివాహాలను చట్టబద్ధం చేయాలని ప్రచారం చేసి వితంతు వివేకం అనే గ్రంథాన్ని రాశాడు. తన కుమారుడికి వితంతువును ఇచ్చి వివాహం చేసి ఆదర్శప్రాయుడయ్యాడు. ఈయన కృషి వల్ల 1856లో డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టం చేశాడు. తన సంపాదనంతా సంఘ సంస్కరణలకు ఖర్చు చేశాడు. ఈశ్వరచంద్రుడు 1891లో మరణించాడు.
Published date : 15 Dec 2015 03:38PM

Photo Stories