Skip to main content

Telangana History : మారన తెలుగులో రచించిన మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?

Telangana history material for appsc, tspsc and police exams

మార్కండేయ పురాణం గ్రంథాన్ని అంకితం పుచ్చుకున్న గన్నయ నాయకుడి జీవితం ఆసక్తికరమైంది. ప్రతాపరుద్రుడు 1323లో ఢిల్లీ సైన్యాలకు పట్టుబడిన తర్వాత చాలామంది కాకతీయ సేనానులను కూడా బంధించారు. వీరిలో గన్నయ నాయకుడు ఒకరు. కొందరు సేనానులు ఇస్లాం మతాన్ని స్వీకరించి విముక్తులయ్యారు. గన్నయ కూడా మల్లిక్‌ మక్బూల్‌ అనే పేరుతో మతం మార్చుకొని ఓరుగల్లుకు పాలకుడిగా వచ్చాడు. 


తెలంగాణ – ప్రసిద్ధ కవులు

పాల్కురికి సోమనాథుడు
కాకతీయ సామ్రాజ్యాన్ని గణపతి దేవుడు క్రీ.శ. 1199 నుంచి 1262 వరకు పాలించారు. దీని రాజధాని ఓరుగల్లుకు 30 మైళ్ల దూరంలో ఉన్న ‘పాలకుర్తి’ గ్రామంలో 1240 ప్రాంతంలో సోమనాథుడు జన్మించారు. ఈయన తండ్రిపేరు విష్ణురామిదేవుడు, తల్లి శ్రియాదేవమ్మ. వీరిది సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. సోమనాథుడు వేద వేదాంగాలను అధ్యయనం చేశారు. ‘కరస్థలం విశ్వనాథయ్య’ అనే గురువు వద్ద ఈయన కవితా రచనకు సంబంధించిన అంశాలను నేర్చుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు కావ్యాలు సంస్కృత సమాస భూయిష్టంగా ఉండేవి. ఛందస్సు కూడా సంస్కృతంలోనే ఉండేది. నన్నెచోడుని ‘కుమార సంభవం’, మల్లికార్జున పండితారాధ్యుడి ‘శివతత్వసారం’, యథావాక్కుల అన్నమయ్య ‘సర్వేశ్వర శతకం’ లాంటివాటిని సోమనాథుడు అభ్యసించారు. 
సోమనాథుడు వీరశైవ మతాన్ని స్వీకరించారు. ఈ మతంలో భక్తులకు జాతి భేదాలు, స్త్రీ – పురుష తారతమ్యాలు, కుల–గోత్రాలు, కలిమి–లేముల పట్టింపులు లేవు. సమాజంలోని తారతమ్యాలను నిర్మూలించి, సమానత్వాన్ని ప్రతిపాదించే మతం ఇది. ఈ కారణంగానే సోమనాథుడు వీర శైవ మతాన్ని స్వీకరించి, పండితారాధ్యుడి రచనలను ప్రచారం చేశారు. లింగార్యుడనే మతగురువు వద్ద సోమనాథుడు శివదీక్ష తీసుకున్నాడు. సోమనాథుడు ‘అనుభవసారం’ అనే కృతిని రచించి, గోడగి త్రిపురారికి అంకితమిచ్చారు. ఈయన తొలి రచన ఇదే. సోమనాథుడిపై కర్ణాటక  ప్రాంతానికి చెందిన బసవన్న మహిమలు, తమిళనాడులో ప్రచారంలో ఉన్న 63 మంది నాయనార్ల శివభక్తి కథలు ప్రభావం చూపాయి. ఈ కథల ఆధారంగా ఆయన అచ్చ తెలుగు ద్విపదలు రాశారు. భక్తుల కథలతో ‘బసవ పురాణం’ రచించారు. ఇది ఏడు ఆశ్వాసాల కావ్యం. ఇందులో శివభక్తుల కథలు ఉన్నాయి. కన్నడ దేశంలో శైవ మతాన్ని ప్రచారం చేసిన ‘బసవన్న’ కథతో తమిళ దేశంలో విశేష ఖ్యాతిపొందిన ‘అరువత్తు మూవరు’ నాయనార్ల కథలను జోడించి సోమనాథుడు తెలుగులో ఒక కావ్యం రాశారు. బసవడిపైనే బసవగద్యం, బసవాష్టకం, బసవోదాహరణం, బసవాబసవా అనే వృషాధిప శతకం రచించారు. తేట తెనుగులో 11,810 ద్విపదల్లో పండితారాధ్య చరిత్ర రాశారు. దీన్ని తెలుగు జాతికి ‘తొలి విజ్ఞాన సర్వస్వం’గా పేర్కొంటారు. దీనికి చిలుకూరి నారాయణరావు 348 పేజీల ఉపోద్ఘాతం రాశారు. ఈ గ్రంథంలో సోమనాథుడు నాటి ప్రజల జీవన విధానం, వేషధారణ, పాడుకునే పాటలు, నాటకాలు, జరుపుకునే పండగలు, మాట్లాడే భాషలు, ఉపయోగించే పలుకుబడులు, సామెతల గురించి వివరించారు.

Follow our YouTube Channel (Click Here)

పాల్కురికి రచనలు
1) అనుభవసారం    2) చతుర్వేదసారం
3) పండితారాధ్య చరిత్ర
4) బసవపురాణం    5) వృషాధిప శతకం
6) రుద్రభాష్యం    7) సోమనాథ భాష్యం
8) సోమనాథ స్తవం    9) వృషభాష్టకం
10) మల్లమదేవి పురాణం
11) బసవాష్టకం    12) చెన్నబసవ రగడ
13) చెన్నమల్లు సీసాలు
14) అక్షరాంక పద్యాలు
15) పంచరత్నాలు    16) పంచప్రకార గద్య
17) నమస్కార గద్య    18) గంగోత్పత్తి రగడ
19) అష్టోత్తర నామగద్య
20) సద్గురు రగడ (కన్నడ)
21) బెజ్జమహాదేవి కథ
22) బసవోదాహరణం
ప్రతాపరుద్రుడి కాలం (1289–1323)లో 1303లో మహమ్మదీయులు మొదటిసారి వరంగల్‌పై దండెత్తారు. ఆ తర్వాత సోమనాథుడు ఓరుగల్లు విడిచి వెళ్లి΄ోయారు. 

మరింగంటి సింగాచార్యులు
సింగాచార్యులు నవాబుల యుగానికి చెందిన పండితులు. కుతుబ్‌ షాహీల కొలువులో పేరు పొందారు. వీరికి మొదట ‘ఆసూరి’ అనే ఇంటి పేరుండేది. కాలక్రమంలో మరింగంటి అనే పేరు వచ్చిందని ఆయన రచనల్లో పేర్కొన్నారు. మరింగంటి సింగాచార్యులు రాసిన ‘దశరథ రాజనందన చరిత్ర’ తెలుగులో తొలి నిరోష్ఠ్య కావ్యం. ఈయనకు విజయనగర పాలకులు ‘కవిసార్వభౌమ’ అనే బిరుదు ఇచ్చినట్లు తెలుస్తోంది. 
ఇబ్రహీం కుతుబ్‌ షా (మల్కిభరాముడు) గోల్కొండను పాలించే రోజుల్లో మరింగంటి వంశానికి చెందిన ఎనిమిది మంది అన్నదమ్ములు చాలా ప్రసిద్ధి పొందారు. మరింగంటి అప్పన్న.. పొన్నెగంటి తెలగనాచార్యున్ని అచ్చ తెనుగు రామాయణం రాసి పఠాన్‌ చెరువు పాలకుడైన ‘అమీన్‌ఖాన్‌’కు అంకితమివ్వమని చెప్పినట్లు మరింగంటి సింగచార్యుల రచనల ద్వారా తెలుస్తోంది. నేబతి కృష్ణయామాత్యుడు ‘రాజనీతి రత్నాకరం’ అనే పంచతంత్రంలో మరింగంటి జగన్నాథసూరి కనకాభిషేకం పొందిన పండితుడు, శతావధాని, బహు గ్రంథకర్త అని పేర్కొన్నారు. 
    
సింగాచార్యుల రచనలు
1) వరదరాజ స్తుతి    2) శ్రీ రంగ శతకం
3) చక్రలాంఛన విధి    4) కవి కదంబం
5) శత సంహిత
6) రామకృష్ణ విజయం (రెండర్థాల కావ్యం)
7) నాటకశాస్త్రం
8) ధనాభిరామం    9) ప్రేమాభిరామం
10) నలయాదవ రాఘవ ΄ాండవీయం 
(నాలుగర్థాల కావ్యం)
11) సకలాలంకార సంగ్రహరాధా సుధాపూరణం
12) ఆంధ్రభాషా భూషణం
13) దశరథ రాజనందనం 
(నిరోష్ఠ్య రామాయణం)
14) శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణం
15) తారక బ్రహ్మ రామశతకం
16) శ్రీ కృష్ణ శతానందీయం
17) కృష్ణ తులాభారం
18) రతీమన్మథాభ్యుదయం
19) రామాభ్యుదయం

Follow our Instagram Page (Click Here)

మారన
మారన మార్కండేయ పురాణాన్ని అనువదించారు. తెలుగు సాహిత్యంలో పురాణాన్ని అనువాదం చేసిన మొట్టమొదటి కవి ఈయనే. ఈయన తిక్కన శిష్యులు. మారన ఆంధ్రీకరించిన మార్కండేయ పురాణంలోని గాథలే శంకర కవి ‘హరిశ్చంద్రో పాఖ్యానం’, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’, మట్ల అనంతభూపాలుడి ‘బహుళాశ్వ చరిత్ర’కు మార్గదర్శకమైనట్లు భావిస్తున్నారు. మారన గ్రంథంలోని యమలోక వర్ణనను సంగ్రహించి ప్రౌఢకవి మల్లన తన ‘రుక్మాంగద చరిత్ర’లో పొందుపరిచాడని వావిళ్ల ప్రచురించిన ‘మార్కండేయ పురాణం’ పీఠికలో శేషాద్రి రమణ కవి పేర్కొన్నారు.
మారన ‘మార్కండేయ పురాణం’ గ్రంథాన్ని కాకతీయ ప్రతాపరుద్రుడి సేనాని గన్నయ నాయకుడికి అంకితమిచ్చారు. ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు ఓరుగల్లును ΄ాలించారు. ఓరుగల్లు కటక పాలకుడు (కమిషనర్‌) గన్నయ్యకు గ్రంథాన్ని అంకితం ఇవ్వడం వల్ల మారన ఏకశిలా నగరానికి చెందినవారని సాహిత్యకారులు భావిస్తున్నారు. ఈయన తెలంగాణలోని గోదావరి ప్రాంతంలో ఉండేవారని ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ గ్రంథంలో అభిప్రాయపడ్డారు.
మార్కండేయ పురాణంలో భూగోళం గురించి వర్ణించారు. ప్రపంచంలో ప్రముఖ ద్వీపాలు, ఖండాలు, నదులు, పర్వతాల వివరాలు ఇందులో ఉన్నాయి. గోదావరి నదీ తీర ప్రదేశాలు ప్రపంచంలో అత్యంత పవిత్రమైనవని మారన ఒక పద్యంలో వివరించారు. మారన మార్కండేయ పురాణాన్ని 2,547 గద్య పద్యాలుగా అనువదించారు. ఇందులో వర్ణాశ్రమ ధర్మాలు, శ్రాద్ధ నియమాలు, ధర్మ ప్రసంగాలు, పురాతన వంశావళి లాంటి వివరాలున్నాయి. మార్కండేయ పురాణం ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికే ఆవిర్భవించిందని భావిస్తారు. మారన ఇందులో కథలను రసవత్తరంగా రచించారు. తెలుగువారి ఆచారాలను విశదీకరిస్తూ, మూలానికి భంగం వాటిల్లకుండా అనువదించారు. మార్కండేయ పురాణం ముఖ్యంగా దేవీ మాహాత్మ్యాన్ని వివరిస్తుంది. మహిషాసురమర్దనం, శుంభనిశుంభుల వధ అంశాలను మారన ఉత్తేజకరంగా వివరించారు.

కృష్ణమాచార్యులు
ఆధునిక యుగంలో ‘వచన పద్యాలు’ బహుళ ప్రజాదరణ పొందాయి. పద్యాల లాంటి వచనాలు రాయడం తెలుగు సాహిత్యంలో కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలోనే ప్రారంభమైంది. ఈ కాలానికి చెందిన కృష్ణమాచార్యులు ‘సింహగిరి వచనాలు’ అనే కృతిని రచించారు. వచన రచన మృదు మధుర రసా భరితంగా ఉంటుందని తెలుగులో ‘మహాభారతం’ గ్రంథాన్ని రాసిన నన్నయ్య పేర్కొన్నారు. కాకతీయ యుగానికి పూర్వమే వచన రచన విశారదులు ఉండేవారని నన్నయ తన భారత అవతారికలో రాసినట్లు ఆరుద్ర పేర్కొన్నారు. నన్నెచోడుని కాలంలో విస్తర, మార్గ, దేశి, వస్తు కవితలు ఉండేవని సాహిత్యకారుల అభిప్రాయం.
కాకతీయుల యుగంలో ‘మధుర కవితలు’ ప్రచారంలో ఉండేవి. కృష్ణమాచార్యులు వీటి రచనలోనే ప్రజాదరణ పొందారు. ‘మధుర’ కవిత రచనకు ఈయనను ఆద్యుడిగా పేర్కొంటారు. కాకతీ ప్రతాపరుద్రుడి కాలంలో కృష్ణమాచార్యులు తన కవితలను తామ్ర పత్రాలపై వేయించినట్లు తెలుస్తోంది. ఈ విధానాన్నే తాళ్లపాక అన్నమాచార్యులు అనుసరించారు.
‘ప్రతాపరుద్ర చరిత్ర’ ప్రకారం కృష్ణమాచార్యు­లు ‘సంతూరు’ గ్రామానికి చెందినవారని, ‘ఏకశిలానగరం’ (వరంగల్‌)లోని 50 గ్రామాలకు కరణంగా పనిచేశారని తెలుస్తోంది. వచన రచనలో భాగమైన ఒక ప్రక్రియ ‘చూర్ణిక’లో కూడా కృష్ణమాచార్యులు రచనలు చేసినట్లు ఆధారాలున్నాయి. వీటితోపాటు వచనాలు, విన్నపాలు కూడా రచించారు.
కృష్ణమాచార్యులు కొంతకాలం విశాఖపట్నం సమీపంలోని ‘సింహాచలం’ వద్ద ఉన్నట్లు ఆయన రాసిన ‘సింహగిరి వచనాలు’ ద్వారా తెలుస్తోంది. ఈయన ద్రావిడ వేదమైన ‘తిరుక్కురల్‌’ను ‘శఠకోప విన్నపాలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. తాళ్ల΄ాక చిన్నన్న రాసిన ‘పరమయోగి విలాసం’లో కృష్ణమాచార్యులు చూర్ణికలు, వచనాలు, విన్నపాలు, కీర్తనలు రచించినట్లు పేర్కొన్నారు. తెలుగులో తొలిసారిగా వచన రచన చేసింది కృష్ణమాచార్యులే.
ఈయన రాసిన ‘సింహగిరి వచనాలు’ తదితర కీర్తనలు, మధుర కవితలు తంజావూరు సరస్వతీ మహల్‌ లైబ్రరీ, మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉన్నాయి. ఈ వచన రచనలపై తిమ్మావజ్ఞుల కోదండరామయ్య, వేటూరి ఆనందమూర్తి, ఆరుద్ర విశేష పరిశోధనలు చేశారు.

Join our WhatsApp Channel (Click Here)

మాదిరి ప్రశ్నలు
1.    ‘బసవ పురాణం’ రచయిత?
    ఎ) నన్నెచోడుడు
    బి) యథావాక్కుల అన్నమయ్య
    సి) మల్లికార్జున పండితుడు
    డి) పాల్కురికి సోమనాథుడు
2.    పాల్కురికి సోమనాథుడు ఏ కాకతీయ పాలకుడి కాలంలో విశేష ఖ్యాతి గడించారు?
    ఎ) గణపతి దేవుడు    బి) ప్రతాపరుద్రుడు
    సి) రుద్రమదేవి    డి) రుద్రదేవుడు
3.    ‘వృషాధిప శతకం’ ఎవరు రచించారు?
    ఎ) మారన    బి) గౌరన
    సి) కేతన     డి) పాల్కురికి సోమనాథుడు
4.    మహమ్మదీయ పాలకులు మొదటిసారిగా వరంగల్‌పై ఎప్పుడు దాడి చేశారు?
    ఎ) 1310    బి) 1303
    సి) 1296    డి) 1323
5.    ‘దశరథ రాజ నందన చరిత్ర’ అనే తెలుగు నిరోష్ఠ్య కావ్య రచయిత ఎవరు?
    ఎ) నేబది కృష్ణయామాత్యుడు
    బి) శాకల్యమల్ల
    సి) పొన్నెగంటి తెలగనాచార్యుడు
    డి) మరింగంటి సింగాచార్యులు
6.    మరింగంటి సింగాచార్యులు ఏ రాజవంశం కాలంలో ప్రసిద్ధి చెందారు?
    ఎ) పద్మనాయకులు
    బి) రెడ్డిరాజులు
    సి) గోల్కొండ కుతుబ్‌షాహీలు
    డి) కాకతీయులు
7.    ‘రతీ మన్మథాభ్యుదయం’కావ్య రచయిత ఎవరు?
    ఎ) మరింగంటి సింగాచార్యులు
    బి) నేబది కృష్ణయామాత్యుడు
    సి) మల్లినాథసూరి
    డి) పొన్నెగంటి తెలగనార్యుడు
8.    తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పురాణాన్ని (మార్కండేయ పురాణం) అనువాదం చేసిన కవి ఎవరు?
    ఎ) గౌరన    బి) కేతన
    సి) మారన    డి) పోతన
9.    మారన తెలుగులో రచించిన మార్కండేయ పురాణాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?
    ఎ) గణపతిదేవుడు
    బి) గన్నయ నాయకుడు
    సి) ప్రతాపరుద్రుడు
    డి) రెండో ప్రోలరాజు
10.    ‘ఈశ్వర అల్లా తేరో నాం’ అనే శ్రవ్య నాటక రచయిత?
    ఎ) ఆరుద్ర    బి) దాశరథీ రంగాచార్యులు
    సి) గౌరన    డి) శ్రీనాథుడు
11.    ‘సింహగిరి వచనాలు’ రచయిత?
    ఎ) పోతన    బి) కేతన
    సి) మారన    డి) కృష్ణమాచార్యులు
12.    మధుర కవితకు ఆద్యుడైన ‘కృష్ణమాచార్యులు’ ఏ కాకతీయ చక్రవర్తి కాలానికి చెందినవారు?
    ఎ) ప్రతాపరుద్రుడు  బి) గణపతిదేవుడు    
    సి) రుద్రమదేవి      డి) నప్రోలరాజు

Join our Telegram Channel (Click Here)

సమాధానాలు
    1) డి    2) ఎ    3) డి    4) బి
    5) డి    6) సి    7) ఎ    8) సి    
    9) బి    10) ఎ    11) డి    12) ఎ 

Published date : 29 Sep 2024 10:37AM

Photo Stories