Skip to main content

గుప్తుల కాలం నాటి శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం

గుప్తుల కాలం భారతదేశ చరిత్రలో మహో జ్వలమైన అధ్యాయం. వీరి పాలనాకాలం మన దేశ చరిత్రలో శాంతిభద్రతలకు, సిరిసంపదలకు, సారస్వత కళాభివృద్ధికి, విజ్ఞాన శాస్త్ర పురోగతికి నిలయం. గుప్త చక్రవర్తులు సమర్థులు, ప్రతిభావంతులు, పరిపాలన దురంధరులు, సాహిత్య పోషకులు, విజ్ఞాన ధనులు. వీరు విశాల సామ్రాజ్య స్థాపన ద్వారా రాజకీయ ఐక్యతను, సురక్షిత, సుభిక్షమైన పరిపాలన ద్వారా ఆర్థికాభ్యుదయాన్ని సాధించారు. సారస్వత కళాపోషణ ద్వారా సాంస్కృతికాభ్యుదయానికి ఎంతో కృషి చేశారు. ఇలా అన్ని రంగాల్లో పరిపూర్ణతను సాధించడం వల్ల చరిత్రకారులు గుప్తుల కాలాన్ని మనదేశ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణించారు.
ఈ యుగంలో సాహిత్య, సారస్వతాలతో పాటు వాటికి ధీటుగా వైజ్ఞానిక శాస్త్రాభివృద్ధి కూడా జరిగింది. ఉద్ధరణ పొందిన వైదిక మతం కారణంగా విజ్ఞానశాస్త్రం పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. అదేవిధంగా గ్రీసు వంటి దేశాలతో సంబంధాలు ఉండటం వల్ల శాస్త్రాభివృద్ధి జరిగింది. జంతుబలుల వల్ల వైద్య నిపుణులకు శరీర అంతర్భాగాలను, అవయవాలను పరిశీలించే అవకాశం కలిగింది. దీంతో వైద్యశాస్త్రం గణనీయంగా అభివృద్ధి చెందింది. గణిత, ఖగోళ శాస్త్రాల్లోనూ గొప్ప అభివృద్ధి జరిగింది. ఆర్యభట్ట, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ శాస్త్రవేత్తలు.
 
ఆర్యభట్ట
భూభ్రమణాన్ని గురించి మొదట ప్రపంచానికి చాటి చెప్పినవారు ఆర్యభట్ట. చుట్టుకొలతకు, వ్యాసానికి ఉన్న సంబంధాన్ని తన ‘ఆర్యభట్టీయం’లో వివరించారు. ఞ అంటే 3.1416 అని, సూర్య సంవత్సర కాలం 365.3586805 రోజులని ఆయన వేసిన అంచనాలు ఇటీవలి అంచనాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడే విధానాన్ని తన ‘సూర్య సిద్ధాంతం’ గ్రంథం ద్వారా  శాస్త్రీయంగా నిరూపించారు. భూమి తన కక్ష్యలో తాను తిరగడం వల్ల దాని నీడ చంద్రునిపై పడి గ్రహణం వస్తుందని పేర్కొన్నారు. ఈయన సిద్ధాంతాలు శాస్త్రయుక్తంగా ఉండటంతో మత, సంప్రదాయ పద్ధతిని పాటించేవారు వీటిని వ్యతిరేకించారు. అలాగే స్థాన భేదం వల్ల సున్నా విలువ ఎలా మారుతుందో వివరించి దశాంశ పద్ధతికి నాంది పలికారు. సున్నా విలువ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అపూర్వ కానుక.
 
వరాహమిహిరుడు
గుప్తుల కాలంలో మరొక ఖగోళ శాస్త్రజ్ఞుడు.. వరాహమిహిరుడు. క్రీ.శ. 5వ శతాబ్దంలో నివసించారు. పంచ సిద్ధాంతిక అనే గ్రంథాన్ని రాశారు. ఇది ఐదు ఖగోళ పద్ధతుల గురించి వివరిస్తుంది. వీటిలో రెండు సిద్ధాంతాలు గ్రీక్ ఖగోళశాస్త్ర నిశిత విజ్ఞాన సంపదను తెలుపుతాయి. ఆయన రచించిన ‘లఘుజాతకం’లో జాతక చక్రాన్ని వివరించారు. వరాహమిహిరుడు రచించిన ముఖ్య గ్రంథం ‘బృహత్ సంహిత’. ఇదొక విజ్ఞాన సర్వస్వం. ఇది సాంకేతిక విషయాలైన వాస్తు, శిల్ప, విగ్రహ శాస్త్రాలను గురించి వివరిస్తుంది. పాశ్చాత్య ఖగోళ శాస్త్రం నుంచి మనదేశం ఎంతో గ్రహించినట్లు బృహత్ సంహిత వల్ల తెలుస్తుంది.
 
బ్రహ్మగుప్తుడు
భూమ్యాకర్షణ శక్తిని గురించి సిద్ధాంతీ కరించిన ఘనత బ్రహ్మగుప్తుడికి దక్కుతుంది. ఆయన బ్రహ్మగుప్త సిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించారు. దీనిలో గ్రహాలు, నక్షత్రాల గురించి ఆసక్తికరమైన వివరాలు పేర్కొన్నారు. బ్రహ్మగుప్తుడు చెప్పిన గమన సూత్రాల (భూమికి గురుత్వాకర్షణ)నే తర్వాత కాలంలో న్యూటన్ చెప్పడం గమనార్హం. బ్రహ్మగుప్తుడికి ఇండియన్ న్యూటన్ అనే బిరుదు ఉంది.
 
వైద్యశాస్త్రం
వైద్యశాస్త్రాన్ని గుప్తుల కాలంలో క్రమబద్ధ మైన పద్ధతిలో అనుసరించారు. భారతీయ వైద్యశాస్త్రంపై ఉద్గ్రంథమైన ‘అష్టాంగ సంగ్రహం’ ను వాగ్భటుడు రచించారు. ఆధునిక వైద్యశాస్త్రానికి ఈ రచన ఎంతో ఉపకరిస్తుందని పండితుల అభిప్రాయం. శస్త్రచికిత్స (సర్జరీ) పై ‘శుశ్రుతసంహిత’ అనే గొప్ప రచన చేసిన శుశ్రుతుడు గుప్తులకాలం నాటివారే. ‘చరకసంహిత’ రచించిన చరకుడు, ‘హస్త్యాయుర్వేద’ గ్రంథం ద్వారా పశువైద్యాన్ని అభివృద్ధి చేసిన పాలకశ్య ధన్వంతరి గుప్తుల ఆదరాభిమానాలు పొందినవారే. వీరందరి కృషి కారణంగా శాస్త్రరంగంలో భారతీయులకు జిజ్ఞాస పెరిగింది. అంతేకాకుండా  శాస్త్ర పురోభివృద్ధి జరిగి అది విదేశీయులను సైతం ఆకర్షించింది.
 
లోహ పని
లోహాలను కరిగించి పోతపోసే పరిశ్రమ కూడా గుప్తుల కాలంలో అభివృద్ధి చెందింది. బంగారు, వెండి నాణేలు, రాగి పతకాలకు అమర్చిన శాసనాలు పనిలోని నైపుణ్యతను తెలుపుతాయి. నాణేల కళకు గుప్తుల నాణేలే గొప్ప నిదర్శనం. నెమళ్ల రూపంలో జంతువుల విగ్రహాలు జీవితాన్ని సూచించే విధంగా ఉన్నాయి. మానవ విగ్రహాల్లో చక్కటి పొందికలు, సన్నని దేహం, చక్కని వంపులు, ముఖ కవళికలు ఈ కళా లక్షణాలుగా ఉన్నాయి. సింహాన్ని, పెద్దపులిని చంపుతున్నట్లు ముద్రించిన నాణేలపై ఉన్న బొమ్మలు చక్కటి దేహధారుడ్యం, ఆరోగ్య లక్షణాలను సూచిస్తున్నాయి.
నలందాలోని 8 అడుగుల బుద్ధ విగ్రహం గుప్తుల లోహాకార కళా నైపుణ్యానికి నిదర్శనం. ఇనుము, కంచు లోహాలను కరిగించి పోతపోయడంలో వీరికి మంచి నైపుణ్యం ఉంది. ఢిల్లీలోని మెహరోలీ వద్ద చంద్ర రాజు ఉక్కు స్తంభం 23.8 అడుగుల ఎత్తు, 1.4 అడుగుల వ్యాసం కలిగి, 6 టన్నుల బరువుతో నిర్మితమైంది. ఇది నాటి నుంచి నేటివరకు ఎండకు ఎండి, వానకు తడిసినప్పటికీ తుప్పు పట్టకపోవడం వల్ల శాస్త్రజ్ఞులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. దీనిపైనున్న శాసనంలో చంద్ర విజయాలను వర్ణించారు. ఆ చంద్రను రెండో చంద్రగుప్తుడిగా గుర్తించారు. దానేసర్ ఖేరా, సుల్తాన్‌గంజ్ మొదలైన ప్రాంతాల్లో దొరికిన బుద్ధుడి కంచు విగ్రహాలు సారనాథ్ కళాశైలిని సూచిస్తాయి.
శాసనాలు, వాఙ్మయం, కళల్లోని వస్తువులు గుప్తు రాజులు సాధించిన ఘన కార్యాలను వివరిస్తాయి. వాఙ్మయం, కళ, విజ్ఞానశాస్త్ర రంగాల్లో గుప్తుల కాలం పరిపూర్ణతను సాధించింది. విక్రమాదిత్యుడు ఒక ఆదర్శరాజుగా ఉన్నట్లు పైన పేర్కొన్న కార్యాలు కూడా ఆదర్శాలే. బహుశా విక్రమాదిత్య గాథాభివృద్థి గుప్త పాలనతో ముడిపడి ఉండటంతో దీన్ని ఆదర్శ యుగంగా భావించారు. అదేవిధంగా గుప్త కళ, కాళిదాసు రచించిన గ్రంథాలు, సాంకేతిక శాస్త్రాల అభివృద్ధి ఈ ఆదర్శయుగ భాగాలే.
Published date : 05 Aug 2016 04:48PM

Photo Stories