Skip to main content

గుప్తుల అనంతర యుగం

గుప్తుల అనంతరం భారతదేశం మరోసారి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. ఈ రాజకీయ అనైక్యత ఉత్తర భారతంలో తీవ్రంగా ఉంది. ఈ కాలంలోనే ఉత్తరాదిలో.. వల్లభి కేంద్రంగా- మైత్రకులు, గౌహతి కేంద్రంగా (కామరూప రాజ్యం) - వర్మన్ వంశం, పాటలీపుత్రం కేంద్రంగా - కడపటి గుప్తులు పాలిం చారు. అలాగే బెంగాల్ కేంద్రంగా - గౌడ వంశం, కనౌజ్ కేంద్రంగా - మౌఖరీలు, ఒడిశా కేంద్రంగా-మాతరులు, మానవంశం, స్థానేశ్వర్ కేంద్రంగా- పుష్యభూతి వంశంవారు పాలన కొనసాగించారు. అయితే పుష్యభూతి వంశంవారు క్రమంగా ఈ రాజ్యాలన్నింటినీ జయించి మొత్తం ఉత్తర భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేసి పాలించారు.
ఈ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ గాంగులు, బాదామీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు మొదలైన రాజవంశాలు పాలిస్తు న్నాయి. ఈ వంశాలు దక్షిణ భారతదేశంలో వాస్తుశిల్ప కళలకు అమూల్యమైన సేవలను అందించాయి. గుప్తుల అనంతర యుగంలో ఉత్తరా దిని పాలించిన రాజవంశాలన్నింటిలో ‘పుష్యభూతి వంశం’ అతి గొప్పది.
 
పుష్యభూతి వంశం
పుష్యభూతి
ఇతడు తన పేరుతో పుష్యభూతి వంశాన్ని స్థాపించాడు. స్థానేశ్వర్ రాజధానిగా గుప్తుల సామంతుడిగా పరిపాలించాడు.
ప్రభాకర వర్థనుడు
పుష్యభూతి వంశంలో తొలి స్వతంత్ర రాజు. తన స్వతంత్ర పాలనకు గుర్తుగా ‘రాజాధిరాజ’ అనే బిరుదును ధరించాడు. ప్రభాకరుడి భార్యయశోమతి. ప్రభాకర వర్థనుడు క్రీ.శ. 605లో మరణించగా భార్య సతీ సహగమనాన్ని ఆచరించిందని బాణుడి గ్రంథాల ద్వారా తెలుస్తోంది.
రాజ్య వర్థనుడు
ప్రభాకర వర్థనుడు తన జ్యేష్ట పుత్రుడు రాజ్య వర్థనుడికి బదులు రెండో కుమారుడు హర్షుడిని రాజుగా చేయాలని సంకల్పించాడు. దీనికి హర్షుడు సమ్మతించలేదు. దీంతో రాజ్యవర్థనుడు రాజయ్యాడు. ఇతడి కాలంలో కనౌజ్‌ను గ్రహవర్మ అనే మౌకరీరాజు పాలించేవాడు. ఇతడు రాజ్యవర్థనుడి సోదరి రాజ్యశ్రీ భర్త. మగధను, మాళ్వాను పాలించే దేవగుప్తుడు, గౌడ దేశాన్ని పాలించే శశాంకుడితో కలిసి.. గ్రహవర్మను చంపి కనౌజ్‌ను ఆక్రమించాడు. రాజ్యవర్థనుడు దేవగుప్తుడిని చంపి కనౌజ్‌ను ఆక్రమించాడు. కానీ శశాంకుడు ఇతడిని మోసపూరితంగా హత్య చేయడంతో హర్షుడు రాజ్యానికి వచ్చాడు.

హర్షవర్ధనుడు (క్రీ.శ. 606 - 647)

స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించి హిందూస్థానాన్ని పాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి హర్షవర్థనుడు. గౌడ శశాంకుడి నుంచి కనౌజ్‌ను విడిపించి, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్‌కు మార్చాడు. శశాంకుడి అనంతరం గౌడ దేశాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత తన దిగ్విజయ యాత్రలు ప్రారంభించి.. సింధు, వల్లభి, గుజరాత్, సౌరాష్ర్ట మొదలైన ప్రాంతాలను జయించాడు. లత, మాళ్వా ప్రాంతాలపై ఆధిపత్యం విషయంలో హర్షుడికి.. బాదామీ చాళుక్యరాజు రెండో పులకేశితో ఘర్షణ అనివార్యమైంది. హర్షుడు.. పులకేశితో యుద్ధానికి చేసిన సన్నాహాల గురించి బాణభట్టుడు తన రచనల్లో వివరించాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన రెండో పులకేశికి చెందిన ఐహోల్ ప్రశస్తిలో కనిపిస్తుంది. ఈ యుద్ధంలో హర్షుడి విజయం సందిగ్ధకరం అని భావించాలి. కానీ పులకేశి వారసులు ఈ యుద్ధంలో పులకేశి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అయితే చరిత్రకారులు వీరి మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. హర్షుడు సాధించిన సైనిక విజయాల సమాచారం అతడు జారీ చేసిన వివిధ శాసనాల ద్వారా లభిస్తోంది. హర్షుడు బన్సిఖేర, మధుబన్, సోనేపట్ మొదలైన శాసనాలను జారీ చేశాడు. హర్షుడు మరణించే నాటికి ఇతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు.
ఇతడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు. హర్షుడు అయిదేళ్లకోసారి ప్రయాగలో ‘మహాపరిషత్’ ఏర్పాటు చేసి దానాలు చేసేవాడు. పండిన పంటలో 1/6వ వంతుని శిస్తుగా వసూలు చేసేవాడు. ప్రభుత్వాధికారులకు జీతాలకు బదులు భూములు ఇచ్చేవాడు. దీన్ని ఫ్యూడలిజం అంటారు. బానిసలతో బలవంతంగా పని చేయించేవాడు. హర్షుడు స్వయానా కవి. సంస్కృతంలో ‘నాగానందం’, ‘ప్రియదర్శిక’, ‘రత్నావళి’ నాటకాలు రచించాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు ‘కాదంబరి’, ‘హర్షచరిత్ర’ వచన కావ్యాలు రాశాడు. మయూరుడు సూర్యశతకాన్ని, భర్తృహరి శృంగార, వైరాగ్య శతకాలను రచించాడు. నలంద, వల్లభి విశ్వవిద్యాలయాలు ఇతడి కాలంలో వర్థిల్లాయి.
 
పాలనా విధానం
ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనాపద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ఇతడి పాలనా సమర్థత వల్ల గుప్తుల అనంతరం ఉత్తర భారతంలో దాదాపు 40 ఏళ్లపాటు శాంతియుత వాతావరణం ఏర్పడింది. కనౌజ్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇతడు ప్రత్యక్షంగా పాలించినప్పటికీ.. పరోక్ష పాలనలో మాత్రం చాలా ప్రాంతాలుండేవి. హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటం. దీంతోపాటు సామంత వ్యవస్థ కూడా పెరిగిపోయింది. ఒక రాజు ఉన్న సామంతుల సంఖ్యను బట్టి అతడి గొప్పదనాన్ని అంచనా వేయడం ప్రారంభమైంది. హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించాడు. వీటిని భుక్తి అని పిలిచేవారు. రాష్ట్రాలను విషయ అనే పేరుతో జిల్లాలుగా విభజించారు. జిల్లాలను పాథక అనే మరో విభాగంగా విభజించారు. పాలనలో చిట్టచివరి విభాగం గ్రామం.
పరిపాలనలో రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. హర్షుడి అధికారుల్లో ముఖ్యమైనవారు మంత్రి, సేనాపతి, మహాసామంత, కుమారామాత్య, ఉపారిక, విషయపతి, రాజస్థానీయ తదితరులు. ఉన్నతాధికారులందరికీ వేతనాలను భూముల రూపంలోనే చెల్లించే వారు. కేవలం కిందిస్థాయి సైనికులకే జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు. అందుకే ఈ కాలంలో అతి తక్కువ సంఖ్యలో నాణేలు కనిపిస్తాయి. నాణేల కొరతకు మరో కారణం ఈ కాలంలో వ్యాపార వాణిజ్యాలు మరింతగా క్షీణించడమే. ప్రజలపై పన్నుల భారం తక్కువగానే ఉండేది. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. ఇది పంటలో ఆరో వంతుగా ఉండేది. తుల్యమేయ అనే అమ్మకం పన్ను కూడా విధించారు.

సాంస్కృతిక సేవ
హర్షుడు స్వయంగా మూడు నాటకాలను రచించినట్లు ప్రతీతి. అవి నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక. హర్షుడి ఆస్థాన కవి బాణుడు మూడు కావ్యాలను రచించాడు. అవి హర్షచరిత్ర, కాదంబరీ, పార్వతీ పరిణయం. హర్షుడి ఆస్థానంలోని మరో కవి మయూరుడు.. సూర్యశతకం అనే గ్రంథాన్ని రచించాడు. హర్షుడు ప్రతి అయిదేళ్లకోసారి ప్రయాగ వద్ద మహామోక్ష పరిషత్‌ను నిర్వహించేవాడు. ఈ సమావేశంలో తన సంపదనంతా దాన, ధర్మాలకు వెచ్చించేవాడని హుయాన్‌త్సాంగ్ తెలిపాడు.
క్రీ.శ. 643లో కనౌజ్‌లో హర్షుడు ఒక సర్వమత సమ్మేళనాన్ని హుయాన్‌త్సాంగ్ అధ్యక్షతన నిర్వహించాడు. హర్షుడు మొదట శైవ మతాన్ని ఆదరించినప్పటికీ తర్వాతి కాలంలో బౌద్ధాన్ని స్వీకరించాడు. ఏటా రాజధానిలో బౌద్ధమత సమావేశాలు నిర్వహించేవాడు. నలంద విశ్వవిద్యాలయానికి 100 గ్రామాలను దానంగా ఇచ్చాడు. అందుకే ఇతని కాలంలో నలంద బౌద్ధ విశ్వవిద్యాలయం చాలా ఉన్నత దశలో ఉందని హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. 10 వేల మంది విద్యార్థులు, 1,500 మంది గురువులతో ఈ విశ్వవిద్యాలయం గొప్పగా విలసిల్లిందని అతడు తెలిపాడు. హర్షుడు కాశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి నుంచి బుద్ధుడి దంతపు అవశేషాన్ని కనౌజ్‌కు తెచ్చి దానిపై బౌద్ధస్తూపాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతదేశ చరిత్రలో మహాయాన బౌద్ధాన్ని ఆదరించిన చివరి చక్రవర్తిగా హర్షుడిని పేర్కొనవచ్చు.
 
రాజపుత్ర వంశాలు (క్రీ.శ. 760 - 1142)
రాజపుత్ర వంశానికి చెందిన రాజులు బెంగాల్, బిహార్ ప్రాంతాలను పాలించారు. వాస్తవానికి వీరు రాజపుత్రులు కారు. ‘పాల’ వంశస్థులు. ఈ వంశ స్థాపకుడు గోపాలుడు. వీరిలో ‘దేవపాలుడు’ గొప్పవాడు. ఇతడు తూర్పు ఈశాన్య దేశాలైన జావా, సుమత్రాతో సత్సంబంధాలు కొనసాగించాడు.
ఈ వంశీయులు సుమారు 400 ఏళ్లు పాలించారు. వీరిలో చాలా మంది బౌద్ధమతాన్ని అనుసరించారు. ధర్మపాలుడు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఉద్ధంతపురం, జగద్దల విశ్వవిద్యాలయాలను పాలరాజుల కాలంలోనే ఏర్పాటు చేశారు. వీరు అనేక విహారాలను పునర్నిర్మించారు.

గూర్జార ప్రతీహారులు - ‘కనౌజ్’ (క్రీ.శ. 800 -1036)
ఈ వంశస్థాపకుడు నాగభట్టు. మహేంద్రపాలుడు గొప్పవాడు. ఇతడి ఆస్థానంలో రాజశేఖరుడు అనే ప్రముఖ కవి ఉండేవాడు. మహేంద్రపాలుడు అరబ్ సైన్యాలపై విజయం సాధించాడు. అరబ్ బాటసారి సులేమాన్ మిహిరభోజుడి సామ్రాజ్యం గురించి వర్ణించాడు. మిహిరభోజుడి కుమారుడు మహేంద్రపాలుడు. ఇతడి తర్వాత ప్రతీహారుల సామ్రాజ్యం క్షీణించింది.

గహాద్వాల్ వంశం - కనౌజ్ (క్రీ.శ. 1080-1194)
ఈ వంశ స్థాపకుడు చంద్రదేవుడు (1085-1100). ఈ పాలకుల్లో గొప్పవాడు జయచంద్రుడు. మహమ్మద్ ఘోరీ 1193లో జయచంద్రుడిని ఓడించడంతో అవమానం భరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. గహద్వాలులు శతాబ్ద కాలం పాటు తురుష్క దండయాత్రల నుంచి మధ్యదేశాన్ని రక్షించారు.

చందేలులు - బుందేల్ ఖండ్ (క్రీ.శ. 916-1203 )
చందేలుల రాజధాని ఖజురహో. ఈ వంశ మూలపురుషుడు జయశక్తి. క్రీ.శ. 950 ప్రాంతంలో యశీవర్మ స్వతంత్రంగా చందేల రాజ్యాన్ని స్థాపించాడు. చందేల రాజుల్లో విద్యాధరుడు ప్రసిద్ధుడు. మధ్యప్రదేశ్‌లోని ‘ఖజురహో’ దేవాలయాలను నిర్మించింది వీరే. అల్లావుద్దీన్ ఖిల్జీ 1309లో చందేలులను తుదముట్టించి బుందేల్‌ఖండ్‌ను ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపాడు.

కాలచూరులు (క్రీ.శ. 950 - 1195)
కాలచూరి వంశస్థుల రాజధాని త్రిపుర (మధ్యప్రదేశ్). ఈ వంశ స్థాపకుడు కోకల్లుడు (845 - 880). కాలచూరుల్లో గంగయదేవుడు ప్రసిద్ధుడు. ఇతడికి ‘విక్రమాదిత్య’, ‘త్రికళింగాధిపతి’ అనే బిరుదులు ఉన్నాయి. క్రీ.శ. 1212లో చందేల త్రైలోక్యమల్లుడు కాలచూరి చివరి పాలకుడైన విజయసింహుడిని ఓడించాడు.

చౌహానులు (క్రీ.శ. 973-1192 )
వీరినే చహమాణులు అని కూడా అంటారు. ఈ వంశానికి మూలకర్త సింహరాజు. వీరి రాజధాని ‘శాకంబరి’. అజయరాజు అజ్మీర్‌ను నిర్మించాడు. సోమదేవ మహాకవి విశాలదేవుడి ఆస్థానంలో ఉండేవాడు. ఇతడు ‘లలిత విగ్రహరాజ’ నాటకాన్ని రచించాడు. ఈ వంశస్థుల్లో మూడో పాలకుడైన పృథ్వీరాజు చాలా గొప్పవాడు. పృథ్వీరాజ్ చౌహాన్ 1191లో మహమ్మద్ ఘోరీని మొదటి ‘తరైన్’ యుద్ధంలో ఓడించి క్షమించి వదిలేశాడు. కానీ మహమ్మద్ ఘోరీ మళ్లీ దండెత్తి వచ్చి పృథ్వీరాజ్‌ను 1192లో రెండో తరైన్ యుద్ధంలో ఓడించాడు.

గుజరాత్ చాళుక్యులు (క్రీ.శ. 974-1238)
గుజరాత్ చాళుక్య వంశస్థుల రాజధాని ‘అన్హిల్ వాడ్’ (గుజరాత్). వీరినే సోలంకీలు అంటారు. ఈ వంశస్థాపకుడు మూలరాజు. మొదటి భీమరాజు కాలంలో (1022-64) ఘజనీ మహమ్మద్ 1024లో సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. భీమరాజు మనవడైన జయసింహుడి కాలంలో సోలంకీ రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉంది. జైనకవి హేమచంద్రుడు ఇతడి మంత్రి. జయసింహుడి తర్వాత సామంతులైన వాఘేల వంశస్థులు సోలంకీలను జయించి రాజ్యాన్ని ఆక్రమించారు.

పరమారులు - మాల్వా, మధ్యప్రదేశ్ (క్రీ.శ. 974 - 1233)
పరమార వంశ స్థాపకుడు ‘సియక’. వీరిలో ముంజరాజు గొప్పవాడు. ఇతడినే ‘వాక్పతిరాజు’గా వ్యవహరిస్తారు. ఇతడి ఆస్థానంలో ధనంజయ, హలాయుధ, ధనిక, పద్మ గుప్త తదితర మహాకవులు ఉండేవారు. వాక్పతిరాజు ‘ముంజేశ్వరం’ తటాకాన్ని నిర్మించాడు. ఇతడి కుమారుడైన భోజరాజుకు ఈ వంశంలో మంచి పేరు ఉంది. భారతదేశ చరిత్రలో ఇతడికి ప్రత్యేక స్థానం ఉంది. భోజరాజుకు ‘కవిరాజ మాళ్వా చక్రవర్తి’ అనే బిరుదు ఉంది. ఇతడు థాన్ నగరాన్ని నిర్మించాడు.

సేన వంశస్థులు (క్రీ.శ. 1119 -1190)
వీరు బెంగాల్‌ను పాలించారు. సేన వంశీయుల్లో లక్ష్మణసేనుడు ప్రసిద్ధుడు. ఇతడు విజయయాత్రలు చేసి పూరీ, కాశీ, ప్రయాగలో విజయస్తంభాలు స్థాపించాడు. ఇతడు స్వయంగా కవి. ఇతడి ఆస్థానంలో పంచరత్నాలు అనే ప్రసిద్ధ కవులు ఉండేవారు. వీరిలో థోయి, జయదేవుడు ముఖ్యమైనవారు. జయదేవుడి ‘గీత గోవిందం’ ప్రసిద్ధి చెందిన రచన.

కర్కోటక వంశం (క్రీ.శ. 630-955)
ఈ వంశం కశ్మీర్ ప్రాంతాన్ని పాలించింది. ‘కర్కోటక వంశ’ స్థాపకుడు దుర్లభవర్థనుడు. కల్హణుడి ‘రాజ తరంగిణి’ వీరి చరిత్రకు ప్రధాన ఆధారం. ఈ వంశంలో ముక్తాపీడ లలితాధిత్య గొప్పరాజు. ఇతడు కశ్మీర్ రాజ్యాన్ని ఆసియాలోని పెద్ద రాజ్యాల్లో ఒకటిగా రూపొందించాడు. ‘మార్తాండ’, ‘సూర్య’ దేవాలయాలను నిర్మించాడు.

లోహారులు (క్రీ.శ. 939 -1339)
ఈ రాజ్యస్థాపకుడు పర్వగుప్తుడు. కశ్మీర్‌ను పరిపాలించిన లోహారులందరిలో ‘రాణి దిడ్డా’కు ప్రత్యేక స్థానం ఉంది. 1139లో షామీర్ (షామ్స్ ఉద్దీన్) అనే ముస్లిం వీరుడు ‘శ్రీ సంస్థినా’ బిరుదుతో కశ్మీర్‌ను ఆక్రమించాడు. లోహారుల కాలంలో సంస్కృతం రాజభాషగా ఉండేది. బ్రాహ్మణులకు రాజకీయంగా ప్రాబల్యం ఉండేది.

షాహీలు (క్రీ.శ. 883-1026)
షాహీలు కాబూల్, పంజాబ్ ప్రాంతాలను పాలించారు. వీరినే హిందూషాహీలుగా వ్యవహరిస్తారు. రాజ తరంగిణి, అల్‌బెరూనీ గ్రంథం వీరి చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు. వీరి రాజధాని కాబూల్. అల్‌బెరూనీ ఈ వంశంలో మొదటివారిని హిందూ తురుష్కులుగా పేర్కొన్నాడు. కుషాన్ వంశంలో చివరి రాజు ‘లగితూర్వానే’ను అతడి మంత్రి కల్లర్ తొలగించి, హిందూషా వంశాన్ని స్థాపించాడు. షాహీ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించారు. అరబ్బు యాత్రికుడైన అల్‌బెరూనీ భారతదేశంలో ‘కితాబ్-ఉల్-హింద్’ గ్రంథం రాశాడు.

అరబ్బుల దండయాత్రలు (క్రీ.శ. 712)
అరబ్బులు సింధూ ప్రాంతంపై దండయాత్ర చేశారు. భారతదేశంపై దండయాత్రల వల్ల అరబ్బులకు పరిమిత ఫలితాలు లభించాయి. ఎడారి వల్ల సింధూ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలపైకి దాడి చేయడానికి వీలు కలుగలేదు. అరబ్బుల పాలనలో సింధ్, గుజరాత్ రాష్ట్రాలు విదేశీ వాణిజ్యాన్ని విస్తృతంగా సాగించి ఐశ్వర్యవంతమయ్యాయి. అరబ్బుల ద్వారా ఐరోపా దేశాలకు భారతీయ సంస్కృతి వ్యాపించింది.
మహమ్మద్ ఘజనీ దండయాత్రలు (క్రీ.శ. 1000-27): ఇతడు భారతదేశంపై 17 సార్లు దండెత్తాడు. ఘజనీ 1026లో సోమ్‌నాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఇది గుజరాత్‌లోని కథియవార్‌లో ఉంది. ఇతడు రాజపుత్ర రాజ్యాల సిరిసంపదలను కొల్లగొట్టాడు. వారి సైన్యాలు చాలా వరకు క్షీణించాయి. ఘజనీ మహమ్మద్ భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపనకు అనుకూల పరిస్థితులను కల్పించాడు.
మహమ్మద్ ఘోరీ దండయాత్రలు (క్రీ.శ. 1175-1206): ఇతడిని భారతదేశంలో తురుష్క అఫ్గాన్ సామ్రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు. ఘోరీ మరణానంతరం అతడు జయించిన భూభాగాలన్నింటితో అతడి బానిస అయిన కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. మహమ్మద్ ఘోరీ.. పృథ్వీరాజ్ చౌహాన్‌తో 1191లో మొదటి, 1192లో రెండో తరైన్ యుద్ధాలు చేశాడు. బిహార్, బెంగాల్‌ను జయించడంలో భక్తియార్ ఖిల్జీ (1197) అనే అఫ్ఘాన్ సాహసయోధుడు ఘోరీకి సహాయపడ్డాడు. ఘోరీని 1206లో పంజాబ్‌లోని భోఖర్లు అనే తెగకు చెందినవారు హత్య చేశారు.

గుప్తానంతర యుగం-2

హర్షుడి అనంతరం దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాల్లో అతి ముఖ్యమైనవి బాదామీ రాజధానిగా పాలించిన చాళుక్య వంశం, (వీరినే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు), కంచి రాజధానిగా పాలించిన పల్లవ వంశం (వీరిని మలి పల్లవులు అని కూడా పిలుస్తారు). ఈ రెండు వంశాల్లో ఒకరు కర్ణాటకను, మరొకరు తమిళనాడును పాలిస్తూ పరస్పరం నిరంతర యుద్ధాల్లో మునిగి ఉండేవారు. అయితే, సాహిత్యం, వాస్తు, శిల్పకళా రంగాల్లో దక్షిణ భారతదేశ సంస్కృతికి ఈ వంశాలు అమూల్యమైన సేవలందించాయి.
బాదామీ చాళుక్యులు: క్రీ.శ. 6వ శతాబ్దంలో వీరు దక్కన్ ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. బ్రహ్మచుళుకం నుంచి జన్మించడం వల్లతాము చాళుక్యులమని వీరు పేర్కొన్నారు. చాళుక్యుల జన్మభూమిపై పలు వివాదాస్పద సిద్ధాంతాలున్నాయి. అయితే, బిల్హణుడు అనే కవి తన విక్రమాంక దేవచరిత్ర  గ్రంథంలో వీరి జన్మస్థలం అయోధ్య అని పేర్కొన్నాడు. చాళుక్యుల రాజధాని వాతాపి(బీజాపూర్ జిల్లాలోని బాదామీ నగరం). అందుకే వీరిని వాతాపి చాళుక్యులు అని కూడా పిలుస్తారు.
మొదటి పులకేశి: ఇతడు బాదామీ చాళుక్యవంశ వాస్తవ స్థాపకుడు. తన రాజ్య స్థాపనను పురస్కరించుకుని అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. మొదటి పులకేశి తర్వాత అతడి కుమారుడు కీర్తివర్మ రాజ్యానికి వచ్చాడు.
మొదటి కీర్తివర్మ: ఇతడు తన సోదరుడు మంగళేశుడితో కలిసి తన తండ్రి స్థాపించిన రాజ్యాన్ని పలు దిశల్లో విస్తరింపచేశాడు. కొంకణ్‌ను పాలించే మౌర్యులను, వైజయంతిని పాలించే కాదంబులను, మహారాష్ర్ట, మాళ్వాలను పాలించే కాలచురి రాజులను మొదటి కీర్తివర్మ ఓడించాడు.
 మంగళేశ: కీర్తివర్మ కుమారుడైన పులకేశి బాలుడిగా ఉండటంతో అతడి తరఫున కీర్తివర్మ సోదరుడు మంగళేశుడు కొంతకాలం రాజ్యాన్ని పాలించాడు. కానీ అతడు పులకేశికి రాజ్యాన్ని అప్పగించకుండా తన కుమారులకు దాన్ని సంక్రమింపజేసే ప్రయత్నం చేశాడు. దీంతో పులకేశి అతణ్ని వధించాడు.
రెండో పులకేశి: ఇతడు క్రీ.శ. 609 నుంచి 642 వరకు పరిపాలించాడు. తన పినతండ్రితో ఏర్పడిన వారసత్వ యుద్ధం నుంచి రాజ్యాన్ని రక్షించడమే కాకుండా తన దిగ్విజయ యాత్రల ద్వారా దాన్ని ఒక మహా సామ్రాజ్యంగా మార్చాడు. ఇతడి రాజ్య సరిహద్దులు నర్మద నుంచి కావేరి వరకూ విస్తరించాయి. దక్కన్‌పై జరిగిన హర్షుడి దాడిని ఇతడు విజయవంతంగా ఎదుర్కోవడమే గాక హర్షుడిని ఓడించినట్లుగా పులకేశి వారసుల శాసనాలు తెలియజేస్తున్నాయి. కోస్తాంధ్రపై దాడిచేసి రణదుర్జయుల పిష్టపుర రాజ్యాన్ని, విష్ణుకుండినుల రాజ్యాన్ని ఇతడు అంతం చేశాడు. ఆంధ్ర ప్రాంతాలకు పిష్టపురాన్ని కేంద్రంగా చేసి తన తమ్ముడు కుబ్జ విష్ణువర్థనుడిని తన ప్రతినిధిగా నియమించాడు. అనంతర కాలంలో  కుబ్జ విష్ణువర్థనుడు తన రాజధానిని వేంగీకి మార్చి స్వతంత్ర తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించాడు. రెండో పులకేశి పల్లవ రాజ్యంపై దాడిచేసి మొదటి మహేంద్రవర్మను అంతం చేశాడు.  పర్షియా రాజు రెండో ఖుస్రూతో రెండో పులకేశి దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అజంతాలోని చిత్రాల్లో కూడా ఈ అంశాన్ని చిత్రీకరించారు. క్రీ.శ. 642లో పల్లవరాజ్యంపై ఇతడు రెండోసారి దాడిచేశాడు. ఈ యుద్ధంలో పులకేశికి ఓటమితో పాటు ప్రాణహాని కూడా కలిగింది. పల్లవరాజు మొదటి నరసింహవర్మ ఈ దాడిని తిప్పికొట్టడమే గాక రెండో పులకేశిని తరుముతూ రాజధాని వాతాపి వరకు వచ్చి పులకేశిని వధించాడు. వాతాపి నగరాన్ని ధ్వంసం చేసి వాతాపికొండ అనే బిరుదును పొందాడు.
 మొదటి విక్రమాదిత్యుడు: తన తండ్రి పులకేశి కాలంలో పల్లవులు జయించిన ప్రాంతాలన్నింటినీ తిరిగి ఆక్రమించాడు. కంచిపై దాడిచేసి పల్లవ రాజు రెండో మహేంద్రవర్మను అంతం చేశాడు.
విజయాదిత్యుడు: ఇతడు 40 ఏళ్లపాటు చాళుక్య రాజ్యాన్ని పరిపాలించాడు. తన కాలంలో రాజ్యంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాడు. ఇతడి కాలం దేవాలయాల నిర్మాణానికి పేరెన్నికగన్నది. ఇతడు సుమారు 70 దేవాలయాలను నిర్మించినట్లుగా భావిస్తారు.
రెండో విక్రమాదిత్యుడు: ఇతడు తన పూర్వీకుల సంప్రదాయమైన కంచిపై దాడులను పునరుద్ధరించాడు. ఇతడి కాలంలో మొత్తం మూడు సార్లు కంచిపై దాడి చేశాడు.
రెండో కీర్తివర్మ: బాదామీ చాళుక్య వంశంలో చివరిరాజు. క్రీ.శ. 753లో సామంత రాజై న దంతిదుర్గుడు రెండో కీర్తివర్మను తొలగించి స్వతంత్ర రాష్ర్టకూట రాజ్యాన్ని స్థాపించాడు.
సాంస్కృతిక సేవ: బాదామీ చాళుక్యులు తమ సామ్రాజ్యంలోని పలు ప్రాంతాల్లో అనేక దేవాలయాలు నిర్మించారు. వీటి నిర్మాణంలో ఓ కొత్త వాస్తు, శిల్పకళా శైలిని అభివృద్ధి చేశారు. దీన్ని ‘వేసర’ శిల్పకళా శైలి అని పిలుస్తారు. ఉత్తర భారతంలోని నగర, దక్షిణాదిలోని ద్రావిడ  శిల్పకళా శైలుల కలయికతో దీన్ని అభివృద్ధి చేశారు. చాళుక్యులు నిర్మించిన వాస్తు కట్టడాల్లో గుహాలయాలు, రాతి కట్టడాలున్నాయి.
రాజధాని నగరమైన బాదామీలో చాళుక్యులు నాలుగు గుహాలయాలను నిర్మించారు. ఇందులో ఒకటి తప్ప మిగిలినవన్నీ శైవమతానికి సంబంధించినవే. ఐహోల్ నగరంలో దాదాపు 70 దేవాలయాలను నిర్మించారు. పట్టడకల్ నగరంలోనూ వీరు పలు దేవాలయాలు నిర్మించారు. ఇంకా అలంపూర్, మహానంది మొదలైన ప్రాంతాల్లో వీరు నిర్మించిన దేవాలయాలు నేటికీ నిలిచి ఉన్నాయి. బాదామీ చాళుక్యులు ప్రారంభించిన వేసర శైలి.. హోయసాలులు, రాష్ర్టకూటుల పాలనకాలంలో  అత్యున్నత దశకు చేరింది.
Published date : 14 Oct 2015 05:04PM

Photo Stories