Skip to main content

భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం

1857 సిపాయిల తిరుగుబాటు
దేశానికి స్వాతంత్య్రం రావడానికి 90 ఏళ్ల ముందే సిపాయిల తిరుగుబాటు మీరట్‌లో ప్రారంభమైంది. ఆ సమయంలో లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్‌గా వ్యవహరించారు. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీ సైనికులు మొగల్ చక్రవర్తి రెండో బహదూర్‌షాను పాదుషాగా ప్రకటించారు. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ ముట్టడిలో ఆంగ్లేయులు సాగించిన దారుణ హింసాకాండను గాలిబ్ అనే ఉర్దూ కవి వర్ణించాడు.
సిపాయిల తిరుగుబాటుకు అయోధ్యలోహజ్రత్ బేగం నేతృత్వం వహించగా, ఝాన్సీలో లక్ష్మీబాయి, మధ్య భారతదేశంలో తాంతియా తోపే నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటును అణచి వేయడంలో ప్రముఖపాత్ర వహించిన బ్రిటిష్ సేనానులు సర్‌జేమ్స్, అవుట్రామ్, హూవ్‌లాక్, నికల్‌సన్, నెయిల్ లారెన్స్, కాంప్‌బెల్, సర్ రోజ్‌వుడ్.
 
తిరుగుబాటుకు కారణాలు
డల్హౌసీ అనుసరించిన దురాక్రమణ విధానం రాజకీయ కారణం కాగా, బ్రిటిషర్ల నూతన ఆర్థిక విధానం ఆర్థిక కారణమైంది. హైందవ సాంఘిక వ్యవస్థను ఖండించటం సాంఘిక కారణమైతే భారత్, ఐరోపా సైనికుల మధ్య ఉన్న తారతమ్యం సైనిక కారణమైంది.
 
రాజకీయ కారణాలు
తిరుగుబాటుకు ప్రధాన కారకుడు గవర్నర్ జనరల్ లార్‌‌డ డల్హౌసీ. ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సతారా, జైపూర్, సంబాల్‌పూర్, ఝాన్సీ తదితర రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. అస్తవ్యస్త పాలన సాకుతో అవధ్ (యూపీ)ను కూడా ఆక్రమించాడు.
పీష్వా రెండో బాజీరావు దత్త పుత్రుడు నానాసాహెబ్ (దొండు పంత్). డల్హౌసీ ఇతడి పెన్షన్‌ను నిలిపివేశాడు. నానాసాహెబ్‌కు మద్దతుగా అతడి సోదరుడు రావు సాహెబ్ పోరాడాడు.
బ్రిటిషర్లు మొగల్ చక్రవర్తి బిరుదును రద్దుచేశారు. చక్రవర్తి కుటుంబీకులు ఎర్రకోటను వదలి వెళ్లాలన్న బ్రిటిష్ కంపెనీ ఆజ్ఞలు భారతీయ ముస్లింలకు బాధ కలిగించాయి. డల్హౌసీ అయోధ్యను ఆక్రమించడంతో అనేక మంది ప్రభువులు, అధికారులు, సైనికులు, నిరుద్యోగులయ్యారు. బ్రిటిషర్లు వారికి ఉపాధి కల్పించలేదు. జమీందార్లు, తాలుక్‌దార్ల భూములను బ్రిటిషర్లు ఆక్రమించారు. ఇది అయోధ్యలో అన్ని వర్గాల ప్రజలకు తీరని అసంతృప్తి కలిగించింది. సంస్థానాధీశుల కొలువు నుంచి బ్రిటిషర్లు సైనికులను తొలగించారు. దీంతో వారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడే అవకాశం కోసం ఎదురు చూశారు.
 
ఆర్థిక కారణాలు
ప్రజల్లో బ్రిటిష్ పరిపాలన పట్ల వ్యతిరేకతకు వారు అనుసరించిన ఆర్థిక దోపిడీ విధానమే ప్రధాన కారణం. బ్రిటిషర్లు తమ దేశ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి భారతదేశ సంపదలను కొల్లగొట్టారు. మనదేశం నుంచి ముడి సరకులను ఇంగ్లండ్‌కు చేరవేశారు. ఇక్కడ తయారైన పట్టు, నూలు వస్త్రాలు విదేశాలకు ఎగుమతి చేయకుండా అడ్డుకున్నారు. వాటిపై సుంకాలు విధించారు. దీంతో స్వదేశీ పరిశ్రమలు మూతపడ్డాయి. పేదరికం ప్రబలి, దేశం కరవు కాటకాలకు నిలయమైంది. సాధారణ ప్రజలు తమ పరిస్థితులను మెరుగుపర్చుకొనే ఉద్దేశంతో తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. సంస్థానాలను బ్రిటిషర్లు ఆక్రమించడం అనేక అనర్థాలకు దారితీసింది. రాజుల అధికారం చేజారింది. వారి సైన్యాలు రద్దయ్యాయి. దీంతో సైనికులు జీవనాధారం కోల్పోయారు. బ్రిటిషర్లు మాత్రం ఉన్నత పదవుల్లో నియమితులయ్యారు. విద్యావంతులైన భారతీయులను కూడా ఉన్నతోద్యోగాలకు అర్హులుగా భావించలేదు. ఉన్నత పదవులకు భారతీయులు అనర్హులని బహిరంగంగా బ్రిటిషర్లు చాటి చెప్పారు. వారి ఆర్థిక విధానం భారతీయ రైతాంగాన్ని, చేతిపని వారిని, స్థానిక ప్రభువులను.. అందరినీ కుంగదీసింది.
 
సాంఘిక కారణాలు
బ్రిటిషర్లు భారతీయులను తక్కువ జాతివారిగా పరిగణించేవారు. సాంఘికంగా భారతీయులంటే వారికి చిన్నచూపు. భారతీయ స్త్రీలను అగౌరవ పర్చడం, భౌతిక హింసలకు గురి చేయడం, అవి కొన్నిసార్లు మరణాలకు దారి తీయడం లాంటి సంఘటనలు సర్వసాధారణం. మొదటి తరగతి రైల్వే బోగీల్లో భారతీయులు ప్రయాణించడానికి అనుమతించేవారు కాదు. సాంఘిక సమావేశాల్లో ఆంగ్లేయులతో కలవకుండా భారతీయులను దూరంగా ఉంచేవారు. యూరోపియన్లు నడిపే హోటళ్లు, క్లబ్బుల్లో భారతీయులకు ప్రవేశం లేదు. ఆగ్రాలో మెజిస్ట్రేట్ ప్రకటించిన రెగ్యులేషన్ భారతీయుల పట్ల బ్రిటిషర్ల వైఖరికి అద్దం పట్టింది. ఈ రెగ్యులేషన్ పాటించనందుకు గొప్ప సంస్కర్త అయిన రాజా రామ్మోహన్‌రాయ్ కూడా అవమానానికి గురయ్యాడు. ఈ రకమైన వేధింపులకు గురైన భారతీయులకు చాలా సందర్భాల్లో బ్రిటిష్ న్యాయమూర్తులు న్యాయం చేయలేదు.
 
మత కారణాలు
బ్రిటిషర్లకు హిందూమతం పట్ల ఉన్న అభిప్రాయం భారతీయుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. భారతీయులను క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నిస్తున్నారని భయాందోళనలకు గురయ్యారు. 1813 చార్టర్ చట్టానికి ముందు క్రైస్తవ మిషనరీలను దేశంలోకి అనుమతించేవారు కాదు. 1813 చార్టర్ చట్టంతో ఈ నిబంధన ఎత్తివేశారు. దీంతో అనేక మిషనరీలు భారతదేశానికి రావడం ప్రారంభమైంది. మిషనరీలు దేశంలో, ముఖ్యంగా అనేక వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సంస్థలను స్థాపించి, విద్యాబోధన చేసేవి. విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడమే వీటి ధ్యేయం. మిషనరీలు స్థాపించిన పాఠశాలల్లో బైబిల్ పఠనం తప్పనిసరి. జైళ్లలో ఉన్న ఖైదీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించేలా అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేసేవారు.వారికి క్రైస్తవ గ్రంథాలను బోధించేవారు. క్రైస్తవులుగా మారిన వారిని జైలు నుంచి విడుదల చేసేవారు.
 
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రకారం..
1837 కరవు కాటకాల సమయంలో మిషనరీలు అనేక మంది అనాథలను క్రైస్తవ మతంలోకి మార్చాయి. మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడానికి ధనాన్ని ఆశగా చూపేవి. ఆ మతంలోకి మారిన వారికి ఉద్యోగాలు ఇచ్చి, గౌరవ మర్యాదలు కల్పించారు. ప్రజల్లో అనుమానాలు సృష్టించేలా బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది. ఉపయోగపడే సాంఘిక చట్టాలనూ ప్రజలు అపార్థం చేసుకున్నారు. విలియం బెంటింగ్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధించాడు. దీన్ని హిందూ ఉదారవాదులు సమర్థించారు. కానీ సాధారణ ప్రజలు ప్రభుత్వ ఉద్దేశాలను అనుమానించారు. 1832-50 మధ్య కాలంలో ఆస్తి వారసత్వానికి సంబంధించిన చట్టాలను కంపెనీ ప్రవేశపెట్టింది. 1856లో రిలిజియస్ డిజేబిలిటీస్ యాక్ట్, వితంతు పునర్వివాహా చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టాలతో ప్రభుత్వం తమ సాంఘిక, మత విషయాల్లో జోక్యం చేసుకుంటుందని ప్రజలు భావించారు.
 
సైనిక కారణాలు
భారతీయ సైనికుల్లో అసంతృప్తికి హిదాయత్ అలీ కింది కారణాలను పేర్కొన్నారు.
బెంగాల్ సైన్యంలో ఎక్కువ మంది సైనికులు అయోధ్య ప్రాంతానికి చెందినవారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో అయోధ్యను కలపడంతో వీరు కోపోద్రిక్తులయ్యారు.
 
పంజాబ్‌ను బ్రిటిష్ ఇండియాలో కలిపాక, సైన్యంలో చేరే సిక్కు, ముస్లిం సైనికులకు గడ్డం లేదా జుట్టు తీసివేసే షరతు పెట్టబోమన్నారు. కానీ తర్వాతి కాలంలో జుట్టు తొలగించాలని ఆజ్ఞాపించారు. ధిక్కరించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. బ్రిటిషర్లు 1856 సెప్టెంబర్‌లో ఒక ఆజ్ఞ జారీ చేశారు. దీని ప్రకారం కొత్తగా నియమితులయ్యే సైనికులు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. సముద్ర యానం చేస్తే కులభ్రష్టులవుతారనే నమ్మకం హిందువుల్లో ఉండేది. ఇది బ్రిటిషర్ల పట్ల సైనికుల అనుమానాలు బలపడేలా చేసింది.

తక్షణ కారణం
కొవ్వు పూసిన తూటాల వదంతి వ్యాపించింది. ఇది హిందూ, ముస్లిం సైనికుల మనోభావాలను దెబ్బతీసింది. దాంతో సైనిక కవాతులో పాల్గొనరాదని 1857 ఫిబ్రవరి 20న బరంపూర్‌లోని పదాతిదళం నిర్ణయించింది. 1857 మార్చి 29న 34వ దేశీయ పటాలానికి చెందిన మంగళ్‌పాండే ఆంగ్లేయాధికారిపై కాల్పులు జరిపి తిరుగుబాటుకు అంకురార్పణ చేశాడు. తర్వాత అతడిపై విచారణ జరిపి ఏప్రిల్ 8న బహిరంగంగా ఉరితీశారు. దాన్ని తిరుగుబాటుగా భావించని కంపెనీ పాలకులు అదొక చిన్న సంఘటనగా, కేవలం హైందవ మేధావి వర్గ ఉద్యమమని భావించారు. త్వరలోనే సమసిపోతుందనుకున్నారు.
 
 తిరుగుబాటు విఫలం కావడానికి కారణాలు
 సిపాయిలు తిరుగుబాటు చేసే సమయానికి కంపెనీ సైన్యంలో ఏడుగురు సిపాయిలకు ఒక ఆంగ్ల సైనికుడు మాత్రమే ఉన్నాడు. ప్రజలు కూడా సిపాయిలకు మద్దతు ఇచ్చారు. తిరుగుబాటుదారులు విప్లవ ప్రారంభ దశలో ఢిల్లీని వశపర్చుకున్నారు. తర్వాత ఆగ్రా, కలకత్తాల మధ్య ఉన్న ప్రసార సాధనాలను ధ్వంసం చేశారు. తొలి దశలో వారు బ్రిటిషర్లను ఇబ్బందులకు గురి చేసినా, తర్వాత ఆంగ్లేయులు తిరుగుబాటుదార్లను ప్రతిఘటించారు.
 
విప్లవం విఫలం కావడానికి అనేక కారణాలున్నాయి. తిరుగుబాటు కొద్ది ప్రాంతానికే పరిమితం కావడం, యావత్తు దక్షిణ భారతదేశం, పంజాబ్ ఉత్తర ప్రాంతం, పశ్చిమ రాజస్థాన్, గుజరాత్, మధ్యభారతం, బెంగాల్‌లో తిరుగుబాటు ప్రభావం లేదు. ఢిల్లీ, అయోధ్య, బిహార్, రోహిల్‌ఖండ్, దాని పరిసర ప్రాంతాలకే తిరుగుబాటు పరిమితమైంది. అందువల్ల విప్లవాన్ని అణచివేయడం ఆంగ్లేయులకు తేలికైంది.
 
తిరుగుబాటుదారుల కంటే బ్రిటిషర్లకు మెరుగైన వనరులున్నాయి. క్రమేణా బ్రిటిషర్ల సైన్యం పెరిగింది. సుమారు 1.12 లక్షల బ్రిటిష్ సైన్యాన్ని ఇండియాకు తరలించారు. సుమారు 3.10 లక్షల మంది భారతీయులను కొత్తగా సైన్యంలో చేర్చుకున్నారు. తిరుగుబాటుదారులు సంప్రదాయ ఆయుధాలతో యుద్ధం చేస్తే, బ్రిటిష్ సైన్యం కొత్తగా ప్రవేశపెట్టిన రైఫిల్స్‌ను ఉపయోగించింది. టెలిగ్రాఫ్ సదుపాయం ఆంగ్లేయులకు చాలా ఉపయోగకరంగా మారింది. దీని వల్ల సిపాయిల వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలైంది.
 
అనేక మంది స్వదేశీ రాజులు బ్రిటిషర్లకు సహాయపడ్డారు. పాటియాల, సింధ్, గ్వాలియర్, హైదరాబాద్ మొదలైన సంస్థానాధీశులు  ఆంగ్లేయులకు సహాయం చేశారు. నేపాల్ రాజు తన సైన్యాన్ని బ్రిటిషర్ల ఆధీనంలో ఉంచాడు.
 
తిరుగుబాటుదారుల్లో సమర్థవంతమైన  నాయకత్వం కొరవడింది. బహదూర్‌షా వృద్ధుడు, అతడి కుమారులు నిష్ర్పయోజకులు. లక్ష్మీబాయి వీరవనిత అయినప్పటికీ, ఆంగ్లేయులతో పోరాడే శక్తియుక్తులు ఆమెకు లేవు. లారెన్స్, హ్యూరోస్, హల్‌రాక్, నికల్సన్ వంటి సుప్రసిద్ధ సేనానుల సేవలు లభించడంతో ఆంగ్లేయుల విజయం సులభమైంది. తిరుగుబాటుకు ఒక నిర్ణీత పథకం గానీ, నిర్దిష్ట కార్యక్రమం గానీ లేవు. తిరుగుబాటుదారుల ఆశయాలు వేరు, వారిలో ఐకమత్యం లేదు. పీష్వా పదవి కోసం నానాసాహెబ్, దత్తత అంగీకరించకపోవడం వల్ల లక్ష్మీబాయి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటుదారుల్లో జాతీయాభిమానం, దేశాభిమానం ఉన్నా వారికి సరైన మార్గదర్శకత్వం లేదు. తిరుగుబాటుదారులంతా ఒకేసారి తిరుగుబాటు చేయలేదు. ఎవరికి వారు ఒంటరిగా పోరాడి ఓడిపోయారు. తిరుగుబాటు ఎక్కువ భాగం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తిరుగుబాటులో పాల్గొనలేదు. కాబట్టే ఇది ప్రజల ఉద్యమంగా రూపాంతరం చెందలేదు.
 
బెంగాల్ సైనికులు పౌరుల పట్ల దూకుడు ప్రదర్శించేవారు. వారి ప్రవర్తన సరిగా ఉండేది కాదు. ప్రజలు వారిని ద్వేషించారు. అనేక ప్రాంతాల్లో ప్రజలే వారిని అణచివేశారు.
 
1857లో ఇంగ్లండ్‌కు అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. క్రిమియా యుద్ధంలో గెలుపొందడంతో బ్రిటిషర్లకు రష్యా బెడద తొలగిపోయింది. పర్షియాతో యుద్ధం కూడా ముగిసింది. దీంతో బ్రిటన్ తన సైన్యాన్ని భారతదేశానికి మళ్లించగలిగింది. తిరుగుబాటుదారుల్లో వ్యక్తిగత అసూయలు చోటు చేసుకున్నాయి. ఈ అసూయలే తిరుగుబాటు విఫలమయ్యేందుకు దోహదం చేశాయి.
 
1857 తిరుగుబాటు స్వభావం
సిపాయిల తిరుగుబాటు స్వభావం మీద చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది దీన్ని సిపాయిల పితూరీ అని, మరికొందరు క్రైస్తవుల మీద జరిగిన మత యుద్ధమని లేదా తెల్లవారికి, నల్లవారికి మధ్య జరిగిన యుద్ధమని, హిందూ, ముస్లింలు కలిసి బ్రిటిషర్ల మీద పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. చాలా మంది ఆధునిక భారత చరిత్రకారులు దీన్ని ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’గా అభివర్ణించారు.
 
సిపాయిల పితూరీ
సిపాయిలు తరచూ సొంత కారణాలతో తిరుగుబాటు చేయడం వల్ల సర్‌జాన్ లారెన్స్, సర్‌సీలే, స్మిత్, మార్‌‌షమన్ మొదలైన చరిత్రకారులు ఇది కేవలం సైనికుల తిరుగుబాటుగా భావించారు. అందుకే దీన్ని సిపాయిల పితూరీ లేదా సిపాయిల తిరుగుబాటుగా పిలిచారు. కానీ ఇది వాస్తవదూరం. అనేక మంది పౌరశాఖ ఉద్యోగులు, ప్రజలు కూడా తిరుగుబాటులో పాల్గొన్నారు. తిరుగుబాటుకు కేవలం సైనిక కారణాలే కాకుండా అనేక మత, సాంఘిక, ఆర్థిక కారణాలు కూడా దోహదం చేశాయి.
 
జాతి సంఘర్షణ
కొందరు చరిత్రకారులు ఈ తిరుగుబాటును తెల్లవారికి, నల్లవారికి మధ్య జరిగిన సంఘర్షణ అని అభిప్రాయపడ్డారు. ఈ దృక్పథం సరైంది కాదు. జె.బి.మోడ్లీ ప్రకారం ప్రతి తెల్ల జాతీయుడికి 20 మంది నల్ల జాతి సైనికులు ఉన్నారు. అనేక మంది భారతీయులు ఆంగ్లేయుల తరఫున పోరాడారు. భారతీయులంతా తిరుగుబాటులో పాల్గొనలేదు.
 టి.ఆర్.హోల్‌మస్ అనే చరిత్రకారుడు సిపాయిల తిరుగుబాటును ‘నాగరికతకు, అనాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణ’ అని పేర్కొన్నాడు. కానీ ఈ ధోరణి సరికాదని, భారత సంస్కృతి మహోన్నతమైందని విమర్శకులు దీటుగా సమాధానమిచ్చారు.
 
తిరుగుబాటు ఫలితాలు
1857 తిరుగుబాటు విఫలం కావడంతో భారతదేశ దాస్య శృంఖలాలు మరింత బిగిసిపోయాయి. తిరుగుబాటు ఒక శకాన్ని ముగించి, మరొక శకారంభానికి పునాది వేసిందని చెప్పొచ్చు. సామ్రాజ్య విస్తరణ స్థానంలో ఆర్థిక దోపిడీకి నాంది పలికింది. జాతీయ తత్వాన్ని అలవర్చుకున్న ప్రగతిశీల శక్తుల స్వభావాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు సవాల్‌గా ఎదుర్కోవాల్సి వచ్చింది. తిరుగుబాటు ఫలితంగా  కంపెనీ పాలన రద్దయింది. దాని స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన ఆరంభమైంది. బ్రిటన్ రాణి విక్టోరియాను భారత సామ్రాజ్ఞిగా ప్రకటించారు. 1858 నవంబర్ 1న వెలువడిన ఈ ప్రకటనను లార్డ్ కానింగ్ అలహాబాద్‌లో చదివారు.
Published date : 09 Dec 2015 04:49PM

Photo Stories