Skip to main content

మాదిరి ప్రశ్నలు-7

కాకతీయుల చరిత్ర
 రుద్రమదేవి (1259-1295):
 దేశ చరిత్రలోనే రాజ్యాన్ని పాలించిన మొదటి మహిళ రుద్రమదేవి. ఈమె పాలనాకాలంలో వెనిస్ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. సామంతరాజైన రేచర్ల ప్రసాదిత్యుడు (పద్మ నాయకుడు) రుద్రమకు అండగా ఉండేవాడు. ఇతడికి ‘కాకతీయ రాజ్యస్థాపనాచార్య’ బిరుదు ఉన్నట్లు పద్మనాయక వెలమల చరిత్ర గురించి తెలిపే ‘వెలుగోటి వారి వంశావళి’ గ్రంథంలో ఉంది. రుద్రమదేవి చేతిలో యాదవ రాజైన మహాదేవుడు ఓడిపోయాడు. ఈమె కళింగరాజైన వీరభాను దేవుడిని ఓడించింది. రుద్రమదేవికి కాయస్థ అంబదేవుడు ప్రధాన శత్రువు. ఇతడితో పోరాడి వీరమరణం పొందింది. ఈమెకు ‘ఫటోదృతి’ అనే బిరుదు ఉంది. ముమ్మిడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని కాకతీయ రాజ్యానికి వారసుడిగా ప్రకటించింది. రెండో కుమార్తె రుయ్యమ్మకు బ్రాహ్మణ వర్గానికి చెందిన ఇందలూరి అన్నయ్య అనే మంత్రికి ఇచ్చి వివాహం చేసింది.
 
 ప్రతాపరుద్రుడు (1295-1323):
 కాకతీయ రాజుల్లో రెండో ప్రతాపరుద్రుడు గొప్పవాడు. 1303లో మహమ్మదీయ దండయాత్రలు మొదలుకొని 1323 వరకు వివిధ యుద్ధాల్లో ఏకధాటిగా పోరాడాడు. ఓరుగల్లుపై 1303లో తొలిసారిగా ముస్లిం పాలకులు దాడి చేశారు. అల్లాఉద్దీన్‌గా పేరు మార్చుకున్న గర్భాసుమాలిక్ దీనికి నాయకత్వం వహించాడు. ఈ దాడిలో ముస్లింలు ఓడిపోయారు. 1310లో అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ రెండోసారి ఓరుగల్లుపై దాడి చేశాడు. అనమకొండ, ఓరుగల్లు కోటను ముట్టడించాడు. 25 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అంతర్గత కారణాలతో ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్‌కు లొంగిపోయి సంధికి అంగీకరించాడు. తర్వాత 1323లో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై దాడి చేశారు. తుగ్లక్ వంశ స్థాపకుడైన ఘియాసుద్దీన్ ప్రతాపరుద్రుడి నుంచి కప్పం వసూలు చేయడానికి కుమారుడైన ఉలుగ్ ఖాన్‌ను భారీ సైన్యంతో ఓరుగల్లుకు పంపాడు. ప్రతాపరుద్రుడు సుమారు 5 నెలలు వీరోచితంగా పోరాడినా పరాజయం తప్పలేదు. ఉలుగ్ ఖాన్ (మహ్మద్ బీన్ తుగ్లక్) ప్రతాపరుద్రుడిని బందీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో నర్మదానదీ తీరంలో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు ముసునూరి ప్రోలయనాయకుడి విలస తామ్ర శాసనం, అనితల్లి కలువచేరు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయ సామ్రాజ్యం సుల్తాన్ల వశమైంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చాడు.
 
 కాకతీయుల కాలంనాటి పరిస్థితులు :
 పాలనావిధానం:
 వీరు సంప్రదాయబద్ధమైన రాచరికాన్ని అనుసరించారు. రాచరికం వంశపారంపర్యంగా సంక్రమించేది. రాజు నిరంకుశుడైనప్పటికీ ధర్మశాస్త్రాలను అనుసరించి పాలించేవాడు. స్త్రీలకు కూడా రాజ్యాధికార హక్కు కల్పించారు. దత్తత ద్వారా వారసత్వ హక్కు ఉండేది. రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు ఈ విధంగానే రాజ్యానికి వచ్చాడు. రాజు సర్వాధికారి. చాతుర్వర్ణ సముద్ధరణ ముఖ్యమని కాయస్థ అంబదేవుడి ‘త్రిపురాంతక శాసనం’ విశదీకరిస్తోంది. రాజుకు వేదాలు, శాస్త్రాలు, సాహిత్యం, కళలపై అవగాహన ఉండాలి. రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అనేక విద్యల్లో శిక్షణ పొంది, రాజనీతి సూత్రాలకు అనుగుణంగా పాలించారు. రాజు నిర్ణీత సమయాల్లో ప్రజలకు దర్శనమిచ్చి, వారి కష్టసుఖాలను తెలుసుకోవాలని ప్రతాపరుద్రుడి ‘నీతిసారం’ బోధిస్తోంది. రాజుకు ఎంత సన్నిహితుడైనప్పటికీ యోగ్యత లేనివాడిని మంత్రిగా నియమించరాదని బద్దెన ‘నీతిశాస్త్ర ముక్తావళి’లో ఉంది. వేదశాస్త్ర, రాజనీతికోవిదులైన బ్రాహ్మణులనే మంత్రులుగా నియమించాలని నాటి రాజనీతి గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ కాకతీయులు దీనికి విరుద్ధంగా అన్ని వర్గాల ప్రజలకూ మంత్రిమండలిలో అవకాశమిచ్చారు. పాలనలో మహాప్రధానులు, ప్రధానులు, ప్రెగ్గడలు, అమాత్యులు, మంత్రులు ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. సమస్యల పరిష్కారంలో రాజుదే తుది నిర్ణయం. హేమాద్రిరెడ్డి, ముప్పిడి నాయక లాంటి బ్రాహ్మణేతరులను మహా ప్రధానులుగా కాకతీయులు నియమించారు. మడికిసింగన ‘సకలనీతి సమ్మతం’ గ్రంథంలో రాజుకు సహాయకులుగా 21 మంత్రులు ఉన్నట్లు పేర్కొన్నాడు. రాజుకు పాలనలో సహాయపడటానికి 72 మంది నియోగాలు (అధికార్లు) ఉండేవారు. వీరినే ‘బహత్తర నియోగం’ అనేవారు. ఈ 72 శాఖలపై ఉన్నతాధికారి బహత్తర నియోగాధిపతి. గణపతిదేవుడి కాలంలో కాయస్థ గంగయ సాహితిని బహత్తర నియోధిపతిగా నియమించారు. రాజ్య విస్తరణ, పాలనలో సామంతరాజులు అధిక ప్రాధాన్యం పోషించారు. అనేక యుద్ధాల్లో విజయాలు చేకూర్చడమే కాకుండా, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కాకతీయులతో వివాహ సంబంధాలు కొనసాగించారు. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులు (రాష్ట్రాలు)గా, తిరిగి వాటిని స్థలాలు, స్థలాలను గ్రామాలుగా విభజించారు. చివరి పాలనా విభాగం గ్రామం. 1313 నాటి ప్రతాపరుద్రుడి శ్రీశైల శాసనంలో నాడుల ప్రస్తావన ఉంది. ఒక్కో స్థలంలో రెండు నుంచి అరవై గ్రామాలు ఉండేవి.
 గ్రామ పాలన:
 పాలన అంతటికీ గ్రామమే కేంద్ర బిందువు. స్వయంపాలన ఉండేది. ఆయం అంటే పొలం. విస్తీర్ణం ఆధారంగా భూమిని ఆయం అనేవారు. ఈ భూములపై పన్నులు లేవు. గ్రామ సేవలకు పన్నులు లేకుండా భూమిని పొందేవారిని ఆయగార్లు అనేవారు. కరణం, పెదకాపు (రెడ్డి), పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, శెట్టి మొదలైన 12 మంది ఆయగార్లు పాలన నిర్వహించేవారు. తలారి అంటే గ్రామరక్షక భటుడు. కుల సంఘాలను ‘సమయాసారాలు’ అని పిలిచేవారు. వీరు సాంఘిక, న్యాయ, మత, ధర్మ, రాజనీతితో స్వయంగా నియమ నిబంధనలు ఏర్పరచుకొని తగవులు పరిష్కరించేవారు.
 పన్నులు:
 రాజ్య ఆదాయానికి భూమి శిస్తు ప్రధాన ఆధారం. పరిశ్రమలు, వర్తకం, వృత్తులపై పన్నులు ఉండేవి. భూమిని పంట భూములు, పాడి భూములు, తోట, పచ్చిక బయళ్లు అని నాలుగు రకాలుగా విభజించారు. భూమిని కొలవడానికి పెనుంబాక మానదండం ప్రసిద్ధమైందని మార్కాపురం శాసనంలో ఉంది. ధాన్యాన్ని కొలిచే సాధనాలు కపిల, ఖండుగ. పన్నులను ధాన్యం, ధనం రూపంలో చెల్లించేవారు. పన్నులు వసూలు చేసే అధికారులను సుంకరులు అనేవారు. రాజుకు చెందిన సొంత భూమిని ‘రాచదొడ్డి’గా పేర్కొనేవారు. పచ్చికబీడులపై వేసే పన్నును ‘పుల్లరి సుంకం’ అనేవారు. పంట పొలాలకు చెరువుల ద్వారా నీటిని అందించేవారు. నీటికట్టు, ఆయకట్టు, గుడికట్టు అనే పదాలు శాసనాల్లో ఉన్నాయి. మాగాణి భూములపై పన్నును ‘ఫర’ అని, మెట్టభూములపై పన్నును ‘పంగం’ అనేవారు. వీటి వసూళ్లను వర్తక శ్రేణులకు వేలంపాటకు ఇచ్చేవారు. కాకతీయుల కాలంనాటి శాసనాల ద్వారా పెరిక ఎడ్ల సుంకం (సంచులను మోసే ఎడ్లబండపై సుంకం), అమ్ముబడి సుంకం (అమ్మకం పన్ను), ఉప్పు పెరికె సుంకం (ఉప్పు బస్తాలపై పన్ను) లాంటి సుంకాలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సంప్రదాయకంగా ధర్మనం, అప్పనం, ఉపకృతి పన్నులుండేవి. భూమిని ‘గడ’ లేదా ‘దండక’ లేదా ‘కోల’తో కొలిచేవారు. రాజుకు పన్నులు రెండు విడతల్లో చెల్లించేవారు. అవి.. కార్తీక మాసం (అక్టోబరు- నవంబరు), వైశాఖ మాసం (ఏప్రిల్-మే). రాజుకు చెల్లించాల్సిన పన్నులను కోలకాండ్రు గ్రామాలకు వెళ్లి వసూలు చేసేవారు.
 సైనిక వ్యవస్థ:
 సైన్యంలో గజ, తురగ, పదాతి దళాలు ప్రధానమైనవి. గుర్రాలు, ఏనుగులకు అశ్వ సాహిణులు, గజ సాహిణులనే శిక్షణాధికారులు ఉండేవారు. మారయ సాహిణి, పోతయ సాహిణి గుర్రాలకు శిక్షణాధికారులు. గజ సాహిణులుగా దాడి వీరయనాయక్, మాదయ నాయక్, మాచయ నాయకులు శిక్షణా వ్యవస్థను నిర్వహించేవారు. కాకతీయులకు 9 లక్షల సైనిక బలముండేది. దీన్ని సకల సేనాధిపతులు, మహారాయ సకల సేనాధిపతులు పర్యవేక్షించేవారు. రాజ్య రక్షణలో దుర్గాల (కోటలు) కు అగ్రస్థానం ఉండేది. ప్రతాపరుద్రుడి నీతిశాస్త్రం ప్రకారం స్థల, జల, వన, గిరి అనే దుర్గా లు ఉండేవి. దివిసీమ, కొలను (కొల్లేరు) అనేవి జల దుర్గాలు. కందుకూరు, నారాయణవనం అనేవి వన దుర్గాలు. అనమకొండ, రాయచూరు, గండి కోటలు గిరి దుర్గాలు. యుద్ధ సమయాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించే సేనాధిపతులకు బిరుదులిచ్చి సత్కరించేవారు.
 నాయంకర వ్యవస్థ: కాకతీయ సైన్యంలో రెండు విభాగాలుండేవి. వీటిలో మూలబలం నాయంకర సైన్యం. సైనిక అవసరాల దృష్ట్యా నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యంలోని భూములు సైనికాధికారులకు ఇచ్చేవారు. ఈ భూమిని నాయక స్థలం లేదా నాయకస్థల వృత్తి అనేవారు. వీరిని సామంతులుగా పేర్కొనవచ్చు. వీరు రక్షణ అవసరాల కోసం రాజుకు అత్యవసర పరిస్థితుల్లో సైన్యాన్ని పంపేవారు. ప్రతాపరుద్రుడు ఓరుగల్లు కోటను రక్షించడానికి 77 మంది నాయకులను (పద్మనాయకులు) నియమించాడు. రాజుకు అంగరక్షకులుగా ‘లెంకలు’ ఉండేవారు
 
 సాహిత్యం :
 రాజభాష సంస్కృతమైనప్పటికీ కాకతీయులు ప్రజల భాష తెలుగును కూడా ఆదరించారు. శాసనాలను సంస్కృతంలో వేయించారు.
 రచనలు: అచితేంద్రుడు 1163 నాటి రుద్రదేవుడి అనమకొండ శాసన ప్రశస్తి, బాలభారతి 1210 నాటి కుంద వరశాసనం, గణపతిదేవుడు గణపవరం శాసనం, నంది పాకాల శాసనం, కవి చక్రవర్తి బూదవూరు శాసనం, ఈశ్వరభట్టోపాధ్యాయుడు ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే అలంకార శాస్త్ర గ్రంథం, విద్యానాథుడు బాలభారతం, అగస్త్యుడు ‘నలకీర్తి’ లాంటి ఖండకావ్యాలు, రావిపాటి త్రిపురాంతకుడు  ప్రేమాభిరామం అనే వీధి నాటకం రచించారు.
 తెలుగు గ్రంథాలు: పాల్కురికి సోమనాథుడు పండితారాధ్యచరిత్ర, బసవపురాణం అనే ద్విపద కావ్యాలు, అనుభవసారం అనే పద్య కావ్యం, వృషాధిపశతకం లాంటి గ్రంథాలు తెలుగులో రాశాడు. పండితారాధ్యుడి ‘శివతత్వసారం’, యథావాక్కుల అన్నమయ్య ‘సర్వేశ్వర శతకం’ ప్రాచుర్యం పొందాయి. కేతన ‘దశకుమార చరితం’ తొలి కథాకావ్యం. కేతన ఆంధ్రభాషాభూషణం అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించాడు. వినుకొండ వల్లభరాయుడు ‘క్రీడాభిరామం’ అనే వీధి నాటకం రాశాడు. బద్దెన సుమతీశతకం, నీతిశాస్త్రముక్తావళి, నన్నెచోడుడి కుమార సంభవం, మంచన కేయూరబాహు చరిత్ర, రాజశేఖరుడి ‘విధాహసాలభంజిక’ ప్రసిద్ధి చెందాయి. దూబగుంట నారాయణ కవి తెలుగులో ‘పంచతంత్రం’ రచించాడు. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి భారతంలోని విరాటపర్వం, నిర్వచనోత్తర రామాయణం రాశాడు. శంభు దాసుడైన ఎర్రాప్రగడ హరివంశం, లక్ష్మీనరసింహ పురాణం, గోనబుద్ధరాజు రంగనాథ రామాయణం, హళక్కి భాస్కరుడు చంపూ రామాయణం, భాస్కరుడి లీలావతి గణితం మొదలైనవన్నీ కాకతీయుల కాలం నాటివే. 
 
మాదిరి ప్రశ్నలు :
Published date : 06 Jul 2019 12:03PM

Photo Stories