Skip to main content

మత్స్య సంపద విషయంలో ప్రపంచంలో భారత్ స్థానం?

 2019-20 మధ్యంతర బడ్జెట్:
   కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ 2019-20 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌ను 2019 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్‌లో 2030 నాటికి భౌతిక,   సాంఘిక అవస్థాపన, డిజిటల్ ఇండియా, పర్యావరణ రహిత భారత్, గ్రామీణ పారిశ్రామిక విస్తరణ, నదుల శుద్ధితో పాటు పౌరులందరికీ శుభ్రమైన తాగునీరు, భారత్ వృద్ధి రేటును పెంచే దిశగా సముద్ర తీర ప్రాంతాల్లో ప్రాజెక్టులు, స్పేస్ ప్రోగ్రామ్, ఆహారం, ఆర్గానిక్ ఫార్మింగ్‌లో స్వయం సమృద్ధి, ఆరోగ్యవంతమైన భారత్, మాక్సిమమ్ గవర్నెన్స్ అనే 10 పాయింట్ విజన్‌ను ప్రతిపాదించారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సగటు ద్రవ్యోల్బణం 2018-19లో 4.6 శాతంగా నమోదైంది. కరెంట్ ఖాతా లోటులో తగ్గుదల సంభవించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళీకరించడం వల్ల 2018-19లో భారత్ 239 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది.
   వస్తు, సేవల పన్నుతో పాటు ఇతర పన్ను సంస్కరణల కారణంగా 2014-2018 మధ్య కాలంలో భారత్ నిర్మాణాత్మక సంస్కరణలను చవిచూసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిపుష్టి పెంపునకు రీకాపిటలైజేషన్‌లాంటి చర్యను ప్రభుత్వం చేపట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడీపీలో 3.4 శాతంగా నిర్ణయించారు. గత అయిదేళ్లలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌లో సభ్యత్వం రెండు కోట్లకు పెరిగింది. అన్ని తరగతులకు చెందిన శ్రామికుల వేతనాల్లో పెరుగుదల గత అయిదేళ్లలో 42 శాతంగా నమోదైంది. నూతన పెన్షన్ పథకాన్ని సరళీకరించారు. శ్రామికుల బోనస్ గరిష్ట పరిమితిని రూ. 3500 నుంచి రూ. 7000కు పెంచారు. కనిష్ట పెన్షన్‌ను రూ. 1000కి పెంచారు. రూ. 15000 ఆదాయంలోపు ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు ‘ప్రధాన మంత్రి శ్రమ్- యోగి మాన్‌ధన్’  అనే నూతన పెన్షన్ పథకాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ పథకం కింద 60 ఏళ్లు పైబడిన శ్రామికులు నెలకు రూ. 3000 ఫించన్‌ను పొందుతారు. ఈ పథకం అమలుకు 2019-20 బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద లబ్ధిదారుల్లో మహిళల వాటా 70 శాతం ఉందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2014-18 మధ్యకాలంలో 34 కోట్ల జన్‌ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. నెలవారీ మొబైల్ డేటా వినియోగం గత అయిదేళ్ల కాలంలో 50 శాతం పెరిగింది. ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలు యువజనుల అభివృద్ధికి దోహదపడ్డాయని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
   దేశ ఆర్థికాభివృద్ధి, ప్రజల జీవన నాణ్యత పెంపులో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి ప్రాధాన్యతను 2019-20 కేంద్ర బడ్జెట్ గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా హైవేల అభివృద్ధిలో భారత్ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో రోజుకు సగటున 27 కి.మీ. హైవే నిర్మాణం జరుగుతున్నది. కొన్ని దశాబ్దాలుగా నిలిచిపోయిన ఢిల్లీ హైవే నిర్మాణంతో పాటు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లోని బోగిబీల్ రైల్-కమ్-రోడ్ బ్రిడ్‌‌జ నిర్మాణం పూర్తయింది. గ్రామీణ రోడ్ల నిర్మాణం మూడు రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కార్యక్రమం కింద మొత్తం 17.84 లక్షల హాబిటేషన్స్లో 15.8 లక్షల హాబిటే షన్‌లను పక్కా రోడ్లతో కనెక్ట్ చేశారు. 2019-20 బడ్జెట్‌లో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకానికి రూ. 19,000 కోట్లు కేటాయించారు. గతంతో పోల్చినప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీలో పురోగతి అధికంగా ఉంది. ఇటీవల సిక్కింలో ప్రారంభమైన పాక్యాంగ్ విమానాశ్రయంతో కలిపి ప్రస్తుతం దేశంలో 100 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత అయిదేళ్ల కాలంలో స్వదేశీ ప్రయాణీకుల రవాణా రెట్టింపయింది. తద్వారా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలు అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి వల్ల ప్రయోజనం పొందాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అవస్థాపనా రంగ అభివృద్ధికి 2018-19తో పోల్చినపుడు 2019-20లో 21 శాతం అదనపు నిధులను ప్రభుత్వం కేటాయించింది. భారత్ మాల పరియోజన కార్యక్రమం కింద 2022 నాటికి రూ. 5.35 లక్షల కోట్ల వ్యయంతో 65,000 కి.మీ. హైవే నిర్మాణం జరుగుతుంది. ఈ మొత్తంలో ఎకనమిక్ కారిడార్లు, అంతర్గత కారిడార్‌లు, ఫీడర్ రూట్స్, సరిహద్దురోడ్ల కింద 24,800 కి.మీ. హైవే నిర్మాణం ఉంటుంది.
  మొబైల్ డేటా వినియోగంలో భారత్ ప్రపంచ వ్యాప్తంగా ముందంజలో ఉంది. దేశంలో 3 లక్షల సేవా కేంద్రాలు 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. వచ్చే అయిదేళ్ల కాలంలో 1,00,000 డిజిటల్ గ్రామాల రూపకల్పనను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత అయిదేళ్ల కాలంలో దేశంలో మొబైల్ తయారీ కంపెనీలు 2 నుంచి 268కి పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
  2017-18లో సవరించిన అంచనాల ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ వ్యయం రూ. 24,57,235 కోట్లు కాగా 2019-20లో రూ. 27,84,200 కోట్లుగా ప్రతిపాదించారు.

మాదిరి ప్రశ్నలు

1. 2019-20 కేంద్ర బడ్జెట్‌లో కింది ఏ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది?
1) సాగర్ మాల
2) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
3) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
4) పైవేవీ కావు

Published date : 14 Feb 2019 02:43PM

Photo Stories